ప్రధాన మంత్రి కార్యాలయం
సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను రేపు సందర్శించనున్న ప్రధానమంత్రి
ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పురోగతిని సమీక్షించనున్న ప్రధానమంత్రి
ముంబయి-అహ్మదాబాద్ ప్రయాణ సమయాన్ని రెండు గంటలకు తగ్గించనున్న బుల్లెట్ రైలు
Posted On:
14 NOV 2025 11:43AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గుజరాత్‌లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి సూరత్‌లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ రైలు స్టేషన్‌ను సందర్శిస్తారు. ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ పురోగతినీ ఆయన సమీక్షిస్తారు. ఇది భారత అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశం హై-స్పీడ్ కనెక్టివిటీ యుగంలోకి అడుగుపెడుతోంది.
సుమారు 508 కిలోమీటర్లు విస్తరించిన ఈ ప్రాజెక్ట్... గుజరాత్, దాద్రా-నగర్ హవేలీలలో 352 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి, బోయిసర్, విరార్, థానే, ముంబయి వంటి ప్రధాన నగరాలను కలుపుతుంది. భారత రవాణా మౌలిక సదుపాయాల్లో ఒక పరివర్తనాత్మక ముందడుగును ఇది సూచిస్తుంది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 465 కిలోమీటర్లు (దాదాపు 85 శాతం మార్గం) వయాడక్ట్‌లపై ఉంది. తద్వారా ఇది తక్కువ భూసంబంధ అంతరాయాలు, మెరుగైన భద్రతను నిర్ధరిస్తుంది. ఇప్పటివరకు 326 కిలోమీటర్ల వయాడక్ట్ పనులు పూర్తయ్యాయి. 25 నది వంతెనలకు గానూ 17 వంతెనల నిర్మాణమూ ఇప్పటికే పూర్తయింది.
బుల్లెట్ రైలు అందుబాటులోకి రావడం ద్వారా ముంబయి-అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలకు తగ్గుతుంది. నగరాల మధ్య ప్రయాణాన్ని వేగవంతం, సులభతరం, మరింత సౌకర్యవంతంగా చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మకంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం కారిడార్‌లో వ్యాపారం, పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధినీ ఇది వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.
దాదాపు 47 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన సూరత్-బిలిమోరా విభాగం పనులు చివరి దశకు చేరాయి. సివిల్ పనులు, ట్రాక్-బెడ్ నిర్మాణం పూర్తయ్యాయి. నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత వజ్రాల పరిశ్రమ స్ఫూర్తిగా సూరత్ స్టేషన్ నమూనాకు రూపకల్పన చేశారు. ప్రయాణికుల సౌకర్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ స్టేషన్ నమూనాను రూపొందించారు. ఇందులో విశాలమైన వెయిటింగ్ లాంజ్‌లు, రెస్ట్‌రూమ్‌లు, రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. సూరత్ మెట్రో, సిటీ బస్సులు, భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో సజావైన మల్టీ-మోడల్ కనెక్టివిటీనీ ఇది అందిస్తుంది.
***
(Release ID: 2189989)
Visitor Counter : 5