గనుల మంత్రిత్వ శాఖ
ఐఐటీఎఫ్-2025లో గనుల శాఖ ప్రదర్శనశాలను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
భారత ఖనిజ శక్తిని చాటిచెప్పనున్న గనుల మంత్రిత్వ శాఖ
Posted On:
13 NOV 2025 1:26PM by PIB Hyderabad
ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (ఐఐటీఎఫ్) 2025ను ఈ నెల 14న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో నిర్వహించనున్నారు. ఐఐటీఎఫ్-2025లో గనుల శాఖ ప్రదర్శనశాలను బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రారంభిస్తారు.
భారతదేశంలోని అపార ఖనిజ వనరులనీ, మన దేశం సాధిస్తున్న సాంకేతిక అభివృద్ధినీ, వికసిత్ భారత్ - ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి గనుల శాఖ అందిస్తున్న తోడ్పాటునీ ఈ ప్రదర్శనశాల కళ్లకు కడుతుంది.
దీనిని 1,500 చదరపు మీటర్లకు పైగా ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులకు అనేక విషయాలను తెలియజేస్తుంది. దీనిలో ఇతివృత్త ప్రధాన అంశాలు, సందర్శకులు స్వయంగా పాల్గొనేందుకు వీలుండే కార్యక్రమాలు, గనుల తవ్వకంలో, ఖనిజ రంగంలో భారత్ సాధించిన విజయాలతో పాటు భావి కార్యాచరణ ప్రణాళికలనూ అందిస్తారు.
కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థలు (సీపీఎస్ఈల), మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థలు, ఈ శాఖ సహాయక సంస్థలతో పాటు ఈ శాఖ అధీనంలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలన్నీ దీనిలో పాలుపంచుకుంటాయి. ఇందులో నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో), హిందుస్తాన్ కాపర్ (హెచ్‌సీఎల్), భారతీయ భూవైజ్ఞానిక సర్వే సంస్థ (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ కన్సల్టెన్సీ (ఎంఈసీఎల్), జవహర్‌లాల్ నెహ్రూ అల్యూమినియం రిసర్చ్ డెవలప్‌మెంట్ అండ్ డిజైన్ సెంటర్ (జేఎన్ఏఆర్‌డీడీసీ)తో పాటు నేషనల్ రాక్ మెకానిక్స్ ఇనిస్టిట్యూట్ (ఎన్ఐఆర్ఎమ్) ఉన్నాయి.
జాతీయ కీలక ఖనిజాల మిషన్ (ఎన్సీఎమ్ఎమ్) చేసిన కృషిని ప్రదర్శనశాలలోని ఒక జోన్లో ప్రత్యేకంగా వివరిస్తారు. భారత కీలక ఖనిజాల అనుబంధ విస్తారిత వ్యవస్థను పటిష్ఠపరచడానికి గనుల శాఖ ఆధ్వర్యంలో నడుపుతున్న ఒక ప్రధాన కార్యక్రమమే ఎన్సీఎమ్ఎమ్. ఈ విభాగం నాన్-ఫెర్రస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్టీడీసీ) కార్యకలాపాల్ని వెల్లడిస్తుంది. దేశ స్వచ్ఛ ఇంధన రంగం, పారిశ్రామిక రంగం వృద్ధి చెందడంలో ముఖ్య పాత్ర పోషించే కీలక ఖనిజాలు, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణకూ, శుద్ధికీ, వినియోగానికీ మద్దతిచ్చే సాంకేతిక నవకల్పనలతో పాటు ఈ దిశగా సాధించిన ప్రధాన విజయాలను కూడా ఈ విభాగాన్ని చూసి తెలుసుకోవచ్చును.
హిందాల్కో ఇండస్ట్రీస్, హిందుస్తాన్ జింక్ (హెచ్‌జడ్ఎల్) వంటి ప్రయివేటు రంగ భాగస్వామ్య సంస్థలు కూడా నవకల్పనలనూ, తాము అందిస్తున్న సేవలనూ తెలియజేస్తాయి.
• హిందాల్కో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, చంద్రయాన్-3 నమూనాలను ప్రదర్శిస్తుంది. భారత్‌ను ప్రగతిపథంలో శరవేగంగా ముందుకు నడపడంలో లోహాలు పోషిస్తున్న పాత్రకు ఈ సంస్థ స్టాల్ ఒక ప్రతీకగా ఉంటుంది.
• హెచ్‌జడ్ఎల్ గనుల తవ్వకాన్ని లాభసాటి వాణిజ్యంగా తీర్చిదిద్దిన అంశంలో సాధించిన విజయాలతో పాటు సాంకేతికత పరంగా సాధించిన అత్యుత్తమ ఫలితాలను సందర్శకులకు తెలియజేస్తుంది.
ఇక డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్లు (డీఎంఎఫ్‌లు), స్వయంసహాయ బృందాలు ప్రదర్శించే అంశాలు సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్న కార్యక్రమాలతో పాటు, గనుల రంగం నుంచి సీఎస్ఆర్ రూపేణా సాయాన్ని అందుకొని స్థానికంగా తయారు చేసిన ఉత్పత్తులను గురించి వివరిస్తాయి.
గనుల తవ్వకంతో సంబంధం గల అనుభూతులను వర్చువల్ రియాలీటీ (వీఆర్), డిజిటల్ మాధ్యమాల ద్వారా సందర్శకులు సొంతం చేసుకోవచ్చు. విద్యార్థులు, యువత స్వయంగా పాలుపంచుకునేందుకు వీలుండే క్విజ్ కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. కీలక ఖనిజాలు, అన్వేషణకు ఉపయోగించే సాంకేతికతలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందుకొనే దృష్టితో చేపడుతున్న నవకల్పనలకు సంబంధించిన ప్రదర్శనలు కూడా చోటుచేసుకుంటాయి.
బాధ్యతల పట్ల స్పృహ కలిగి ఉంటూ గనుల తవ్వకాన్ని కొనసాగించడంతో పాటు నవకల్పనలను ప్రోత్సహిస్తూ, సమ్మిళిత అభివృద్ధినీ, ఖనిజాల రంగంలో స్వయంసమృద్ధినీ సాధించే దిశగా 2047 కల్లా వికసిత్ భారత్ ఆశయ సాధనకు సహకరించాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతకు ఈ ప్రదర్శనశాల అద్దం పడుతుంది.
***
(Release ID: 2189755)
Visitor Counter : 2