ఆయుష్
డయాబెటిస్ సంపూర్ణ నిర్వహణపై బెంగళూరులోని కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం: రేపు ప్రపంచ డయాబెటిస్ డే సందర్భంగా నిర్వహణ
Posted On:
13 NOV 2025 3:33PM by PIB Hyderabad
ముధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్)లో కేంద్ర ఆయుష్ శాఖ గుర్తింపు పొందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) అయిన బెంగళూరులోని కేంద్రీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీఏఆర్ఐ).. 2025 నవంబర్ 14న ‘మధుమేహ విమర్శ’ శీర్షికన ప్రపంచ డయాబెటిస్ దినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) కోసం పరిశోధన, క్లినికల్ సేవల్లో సంస్థ ప్రస్తుత పరిశోధన, చికిత్సాపరమైన పనులు, ప్రజలకు చేరువయ్యేలా చేపట్టిన చర్యలను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తారు.
ఆయుర్వేదం, యోగా, జీవనశైలి అంశాల ద్వారా డయాబెటిస్ నివారణ, నిర్వహణ కోసం సమగ్ర విధాన అభివృద్ధి, అమలుపై ఈ కేంద్రం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 6,000 మంది రోగులు సంస్థలో సేవలను పొందారు. వారిలో 25 శాతం కన్నా ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారే.
చికిత్సాపరమైన సంరక్షణతోపాటు.. డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఈ కేంద్రం ప్రజలకు మరింత సమర్థంగా చేరువవుతోంది. ఇ-మెడికల్ రికార్డులు, టెలికన్సల్టేషన్లు, ఎస్ఎంఎస్ అలర్టులు, వెబ్సైట్ (www.cari.gov.in), సామాజిక మాధ్యమ వేదికల్లో అందుబాటులో ఉన్న సమాచారం ద్వారా 6 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుస్తోంది.
మధుమేహం ప్రమాదాన్ని అంచనా వేయడం కోసం ఓ ‘మెషీన్ లెర్నింగ్’ ఆధారిత అంచనా వ్యవస్థను కూడా ఈ కేంద్రం అభివృద్ధి చేసింది. దీనికి ప్రస్తుతం కాపీరైట్ హక్కులు కూడా లభించాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థను ఓ వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను ఉపయోగించి ధ్రువీకరిస్తున్నారు. వ్యక్తులు తమ ఆరోగ్యాన్ని మరింత సమర్థంగా పర్యవేక్షించుకోవడానికి వీలుగా మొబైల్ యాప్‌గా దీనిని అభివృద్ధి చేస్తారు.
కార్యక్రమానికి ముందు సీఏఆర్ఐ ఇన్చార్జి డాక్టర్ సులోచనా భట్ మాట్లాడుతూ.. “సాంప్రదాయక వైద్య పరిజ్ఞానాన్ని శాస్త్రీయ పరిశోధనతో మేళవించి.. ప్రామాణికంగా మధుమేహ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు ‘సమగ్ర ఆరోగ్య సంరక్షణ’ ఎలా చేయూతనిస్తుందో, వారి జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో ఈ కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి” అన్నారు.
ఎంపిక చేసిన ఆహార ఉత్పత్తులు, ఆయుర్వేద సూత్రీకరణలపై సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ- మైసూరు, ఐఐఎస్సీ- బెంగళూరుతో సహకార అధ్యయనాలు కొనసాగుతున్నాయి. మధుమేహం నివారణ, నిర్వహణ కోసం అభివృద్ధి చేసిన సమగ్ర ఫ్రేమ్‌వర్క్ ప్రచురణకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా ప్రకృతి, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతీపై ఓ అధ్యయనం కూడా ప్రచురణలో ఉంది.
రేపటి కార్యక్రమంలో ‘మధుమేహ సంపూర్ణ నిర్వహణ’, తదితర అంశాలపై రమియా ఇండిక్ స్పెషాలిటీ ఆయుర్వేద రీస్టోరేషన్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) జి.జి. గంగాధరన్ ప్రసంగిస్తారు.
డయాబెటిస్ వంటి జీవనశైలి సంబంధిత రుగ్మతల నిర్వహణ కోసం సుస్థిర, సమ్మిళిత, ప్రామాణిక వ్యూహాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో పరిశోధన, చికిత్సాపరమైన కార్యక్రమాలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది.
***
(Release ID: 2189753)
Visitor Counter : 2