యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
వీబీవైఎల్‌డీ- 2026లో రికార్డు స్థాయి భాగస్వామ్యం: అమృత తరం కోసం ప్రధాని మోదీ దార్శనిక చర్యల ఫలితం
· వీబీవైఎల్‌డీ- 2026 క్విజ్‌లో దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా యువత భాగస్వామ్యం
· రెండో దశలో వ్యాసరచన పోటీ కోసం 2.5 లక్షల మందికి పైగా యువత ఎంపిక
· వికసిత భారత్@2047 దార్శనికతకు రూపుదిద్దే పది కీలక జాతీయ ఇతివృత్తాల్లో ఒక అంశంపై వ్యాసాలు
Posted On:
10 NOV 2025 3:29PM by PIB Hyderabad
యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ‘మేరా యువ భారత్ (మై భారత్)’ ద్వారా ఆ శాఖ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ).. దేశ వికాసంలో క్రియాశీల భాగస్వాములుగా నిలిచేలా భారత యువతకు స్ఫూర్తినిస్తోంది. 2026 ఎడిషన్ ఈ ఏడాది మొదట్లో విజయవంతంగా ప్రారంభమైంది. కార్యక్రమ మొదటి దశకు దేశవ్యాప్తంగా అద్భుత స్పందన లభించింది.
మై భారత్, మై గవ్ వేదికలు 2025 సెప్టెంబరు 1 నుంచి అక్టోబరు 31 సంయుక్తంగా వీబీవైఎల్డీ- 2026 క్విజ్ పోటీలు నిర్వహించగా.. గత ఎడిషనులో 30 లక్షల మంది పాల్గొన్న రికార్డును అధిగమిస్తూ, ఈ దఫా 50.42 లక్షలకు పైగా యువత ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వికసిత భారత్@2047 లక్ష్యం దిశగా వారి ఉత్సాహాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు దాదాపు సమానంగా భాగస్వాములయ్యారు. 51 శాతం పురుషులు, 49 శాతం మహిళలు ఇందులో పాల్గొన్నారు. అత్యధిక సంఖ్యలో భాగస్వాములతో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, పశ్చిమ బెంగాల్ మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. పాలన, విధాన రూపకల్పనలతోపాటు వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ధి ప్రస్థానంలో అర్థవంతంగా తోడ్పాటు అందించాలన్న ఆకాంక్ష దేశ యువతలో పెరుగుతోందనడానికి ఈ విశిష్ట కార్యక్రమం నిదర్శనం.
అనంతరం వీబీవైఎల్‌డీ-2026 రెండో దశలో అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి రూపుదిద్దే పది కీలక జాతీయ ఇతివృత్తాలపై వ్యాస రచన పోటీలు నిర్వహిస్తారు. దీనిద్వారా దాదాపు 2.56 లక్షల మంది యువతను ఎంపిక చేసి తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఆహ్వానిస్తారు:
1. వికసిత భారత్ లక్ష్యంగా ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వంలో యువత
2. మహిళల నేతృత్వంలో అభివృద్ధి: వికసిత భారత్‌కు కీలకం
3. ఫిట్ భారత్, హిట్ భారత్
4. ప్రపంచ అంకుర సంస్థల రాజధానిగా భారత్‌ను నిలపడం
5. భారత ప్రభావశీల శక్తి (సాఫ్ట్ పవర్): వికసిత భారత్ లక్ష్యంగా సాంస్కృతిక దౌత్యం, అంతర్జాతీయ ప్రాబల్యం
6. సంప్రదాయంతో కూడిన ఆవిష్కరణ: ఆధునిక భారత నిర్మాణం
7. ఆత్మనిర్భర భారత్: భారత్‌లో తయారీ, ప్రపంచం కోసం ఉత్పత్తి
8. ఆధునిక, సుస్థిర వ్యవసాయం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం
9. సుస్థిర, హరిత వికసిత భారత నిర్మాణం
10. వికసిత భారత్ కోసం భవిష్యత్ సన్నద్ధ శ్రామిక శక్తిని సిద్ధం చేయడం
22 భారతీయ భాషల్లో ఎందులోనైనా వ్యాసాలను రాయొచ్చు. 2025 నవంబరు 20 వరకు వీటిని స్వీకరిస్తారు.
న్యాయబద్ధంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించడం కోసం అన్ని రాష్ట్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో వ్యాసాలను సమీక్షించి, ప్రతిభావంతులైన యువ భాగస్వాములను రాష్ట్ర స్థాయి రౌండ్లకు ఎంపిక చేస్తారు. అక్కడ వికసిత భారత్ కోసం తమ ఆలోచనలను ప్రదర్శనల ద్వారా అందరితో పంచుకుంటారు.
దేశ యువత ఆలోచనల్లో వైవిధ్యాన్ని వెల్లడి చేయడం మాత్రమే కాదు... రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను ప్రజా జీవితంలోకి వచ్చేలా ప్రోత్సహించాలంటూ 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును ఈ పోటీలు మరింత ముందుకు తీసుకెళ్తాయి. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ) నేడు మార్పును కాంక్షించే యువత దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనభాగీదారి, యువశక్తి దార్శనికతలకు అనుగుణంగా.. పాలనలో భాగస్వాములయ్యేందుకు, వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు, దేశాభివృద్ధికి అర్థవంతంగా దోహదపడేందుకు క్రియాశీల వేదికగా ఇది నిలుస్తుంది.
***
(Release ID: 2188583)
Visitor Counter : 5