వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ల్యాటిన్ అమెరికాతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకున్న భారత్


భారత్-పెరూ వాణిజ్య ఒప్పందంలో 9వ విడత, భారత్-చిలీ సీఈపీఏ 3వ విడత సంప్రదింపులు ఫలప్రదం

Posted On: 06 NOV 2025 8:40AM by PIB Hyderabad

ల్యాటిన్ అమెరికాలోని భాగస్వామ్య దేశాలతో వాణిజ్య సంప్రదింపుల్లో రెండు కీలక దశలను భారత్ ఫలప్రదంగా అధిగమించింది. ఇది ఈ ప్రాంతంతో ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలనీ, వాణిజ్య సంబంధాలను పటిష్ఠపరుచుకోవాలన్న ప్రభుత్వ నిబద్ధతను చాటిచెబుతోంది.


భారత్-పెరూ వాణిజ్య ఒప్పందంలో 9వ విడత సంప్రదింపులను ఈ నెల 3 నుంచి 5 వరకూ పెరూలోని లిమాలో నిర్వహించారు. ఈ చర్చల్లో.. వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం, మౌలికతకు సంబంధించిన నియమావళి, వాణిజ్యంలో సాంకేతిక సమస్యలు, కస్టమ్స్ ప్రక్రియలు, వివాద పరిష్కారాలతో పాటు కీలక ఖనిజాలు సహా ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతి చోటు చేసుకుంది.  

ముగింపు కార్యక్రమంలో పెరూ విదేశీ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి టెరెసా స్టెల్లా మేరా గోమెజ్, విదేశీ వాణిజ్య ఉప మంత్రి శ్రీ సీజర్ ఆగస్టో లొనా సిల్వాలు సహా సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత్ పక్షాన పెరూలో భారత్ రాయబారి శ్రీ  విశ్వాస్ విదు సప్కాల్‌ ప్రాతినిధ్యం వహించగా సంయుక్త కార్యదర్శి, ముఖ్య సంధానకర్త శ్రీ విమల్ ఆనంద్ భారతీయ ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించారు.

సంప్రదింపులను అనుకున్న సమయంలోనే ముగించి, పెరూ తన నిబద్దతను చాటిందని మంత్రి గోమెజ్ అన్నారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర అవగాహనను ఆమె వివరిస్తూ, ఈ ఒప్పందం వాణిజ్యాన్నీ, పెట్టుబడులనూ ప్రోత్సహిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారత్ నిరంతర అభివృద్ధి పథంలో సాగుతోందని రాయబారి శ్రీ సప్కాల్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం కీలక ఖనిజాలు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, వస్త్రాలు, ఆహార శుద్ధి వంటి రంగాల్లో సహకారానికి సరికొత్త అవకాశాలను అందిస్తుందని కూడా ఆయన అన్నారు.

మలివిడత  సంప్రదింపుల్ని 2026 జనవరిలో న్యూఢిల్లీలో నిర్వహించాల్సి ఉండగా పెండింగ్ అంశాల్ని పరిష్కరించుకోవడానికి మరిన్ని సమావేశాల్ని అంతకన్నా ముందే నిర్వహించుకోవడానికి ఇరు పక్షాలూ అంగీకరించాయి.

అంతకు ముందు... గత నెల 27 నుంచి 30 వరకూ భారత్-చిలీ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) 3వ విడత సంప్రదింపులను చిలీలోని సాంటియాగోలో నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తువులు, సేవలకు సంబంధించిన వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందించడం, మౌలికతకు సంబంధించిన నియమావళి, మేధాసంపత్తి హక్కులు, టీబీటీ, ఎస్‌పీఎస్ పరంగా తీసుకోదగిన చర్యలు, ఆర్థిక సహకారం, కీలక ఖనిజాలు సహా అనేక అంశాలపైన చర్చించారు. మార్కెట్ లభ్యత పరిధిని విస్తరించడం, సరఫరా వ్యవస్థను పటిష్ఠంగా ఉండేటట్లు తీర్చిదిద్దడంతో పాటు ఆర్థిక ఏకీకరణను శక్తిమంతం చేయాలన్న ధ్యేయాలతో కూడిన సీఈపీఏ సంప్రదింపుల్ని త్వరగా, నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలని ఇరు పక్షాలూ  ఉమ్మడి నిబద్దతను పునరుద్ఘాటించాయి.

 

పెరూ, చిలీలతో భారత్ వాణిజ్య భాగస్వామ్యం పెరుగుతున్న తీరు పరస్పర లాభదాయక, సమగ్ర ఆర్థిక సహకారం ద్వారా ల్యాటిన్ అమెరికా ప్రాంతంతో బలమైన భాగస్వామ్యం దిశగా భారత్ వ్యూహాత్మక ముందంజను సూచిస్తోంది.  


image.png
image.png

***


(Release ID: 2186894) Visitor Counter : 5