కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ఖతార్‌లోని దోహలో జరిగిన రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సు ప్లీనరీ ప్రారంభ సమావేశానికి ఇవాళ హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి 180 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు. కార్మిక రంగంలో సహకారాన్ని పెంపొందించటం, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించటం, భారత డిజిటల్, మానవ వనరుల విజయాలను ప్రపంచస్థాయిలో ప్రదర్శించటం వంటివి ఇవాళ జరిగిన ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చల లక్ష్యం.
"సామాజికాభివృద్ధికి మూడు స్తంభాలైన పేదరిక నిర్మూలన, అందరికీ సంపూర్ణ, ఉత్పాదక ఉపాధి, గౌరవప్రదమైన పని, సామాజిక సమ్మిళిత్వాన్ని బలోపేతం చేయటం” అనే అంశంపై ఉన్నత-స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన ప్రసంగంలో భారత్ అధిక వృద్ధిని, సమ్మిళితత్వంతో ఏకం చేయడాన్ని కేంద్ర కార్మిక మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "డిజిటల్ ఆవిష్కరణను ఆర్థిక సమ్మిళితత్వంతో జోడించటం ద్వారా కోట్లాది మంది పౌరులకు సాధికారత కల్పించవచ్చని భారత్ నిరూపించింది" అని కేంద్రమంత్రి అన్నారు.
సామాజికాభివృద్ధికి సంబంధించిన మూడు స్తంభాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యలను డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ ప్రస్తావించారు. 2016-17, 2023-24 మధ్య 170 మిలియన్లకు పైగా నూతన ఉద్యోగాలు కల్పించామని, మహిళల ఉపాధి భాగస్వామ్యం రెట్టింపైందని, 6 నుంచి 3.2 శాతానికి నిరుద్యోగం తగ్గిందని ఆయన తెలిపారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా సరళీకరించారని, యూనివర్సల్ పెన్షన్ కవరేజీ దిశగా భారత్ పురోగమిస్తుందని చెప్పారు. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలు 1.4 బిలియన్లకు పైగా పౌరులకు సంక్షేమ ప్రయోజనాలను అందేలా చేశాయన్నారు.
"ఈ ప్రయత్నాల ఫలితంగా 2015లో భారత్ లో 19% ఉన్న సామాజిక భద్రతా పథకాల పరిధి, 2025 నాటికి 64.3 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం ఈ ఏడాదికి గానూ సామాజిక భద్రతలో అత్యుత్తమ అవార్డును భారత్ కు అందించింది. వేగంగా, సమ్మిళిత అభివృద్ధి వల్ల సమాజంలో మార్పు వస్తుందని భారత్ నిరూపించింది. ఆర్థిక ప్రగతిని సామాజిక అభివృద్ధికి జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ పనిని ముందుకు తీసుకెళ్తున్నాం" అని మాండవీయ తెలిపారు.
మారిషస్ కార్మిక మంత్రిని కలిసిన డాక్టర్ మాండవీయ.. నైపుణ్యాభివృద్ధి, కార్మికుల వలస, డిజిటల్ కార్మిక వేదికలు, సామాజిక భద్రత రంగాల్లో సహకార విస్తరణపై విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మారిషస్ తో భారత్ కున్న ప్రత్యేక చారిత్రక సంబంధాల్ని స్పష్టం చేసిన మాండవీయ.. సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణలో(టీవీఈటీ) సామర్థ్య పెంపునకు మద్దతిచ్చేందుకు భారత్ సంసిద్ధతను వ్యక్తపరిచారు. కార్మిక వ్యవస్థలో డిజిటల్ పబ్లిక్ గూడ్స్ నిర్మాణంలో భారత విజయాన్ని డాక్టర్ మాండవీయ వివరించారు. వాటిలో నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్ సీఎస్) పోర్టల్, ఈ-శ్రమ్ డాటాబేస్ ముఖ్యమైనవి. ప్రతిభావంతులను గుర్తించి, సహకరించటానికి ఈ వేదికలను ఉపయోగించుకోవాలని మారిషస్ ను కేంద్రమంత్రి ప్రోత్సహించారు. సామాజిక భద్రతా పరిధిని 2015లో 19% నుంచి 2025 నాటికి 64.3%కు పెంచడంలో భారతదేశం సాధించిన విజయాన్ని అభినందించారు.
యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యూఎన్ఈఎస్ సీఏపీ) కార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి ఆర్మిడా సల్సియా అలిస్జాబానాతో డాక్టర్ మాండవీయ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్య దేశంగా ఈఎస్ సీఏపీతో భారత్ కున్న దీర్ఘకాల అనుబంధాన్ని, విపత్తు నిర్వహణ, నైపుణ్యాలను గుర్తించటం, డిజిటల్ సంక్షేమ సేవల్లో ప్రాంతీయ సహకారానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు.
దశాబ్ద కాలంగా, పాలనాపరమైన అంశాల్లో డిజిటల్ సంస్కరణలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ వ్యవస్థలు, సామాజిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా 250 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావటంలో భారత్ అద్భుతమైన పురోగతిని సాధించిందని వెల్లడించారు.
సామాజిక భద్రత, ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించటంలో భారత్ సాధించిన పురోగతిని ఈఎస్ సీఏపీ ప్రశంసించింది. గ్రీన్, డిజిటల్, కేర్ ఎకానమీ రంగాల్లో విస్తృత స్థాయిలో నైపుణ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈఎస్ సీఏపీతో సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత్ తెలిపింది.
ఇవాళ భారత్ చేపట్టిన కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక భాగస్వామ్యాలు బలోపేతం అయ్యాయి. యూఎన్ఈఎస్ సీఏపీతో సహకారాన్ని పెంచాయి. డిజిటల్ సామాజిక భద్రత, నైపుణ్యాలు, సమ్మిళిత కార్మిక మార్కెట్ల విషయంలో ప్రపంచస్థాయిలో భారత నాయకత్వ ధోరణిని పటిష్టం చేశాయి.
నేపథ్యం:
2025లో 78/261, 78/318 తీర్మానాల ద్వారా "రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సు" అనే శీర్షికతో "ప్రపంచ సామాజిక సదస్సు"ను నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. రాజ్య, ప్రభుత్వాధినేతల స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సు.. కోపెన్‌హాగన్ సామాజిక అభివృద్ధి ప్రకటన, దాని కార్యాచరణ అమలులోని లోపాలను సరిదిద్దటం, వాటికి కట్టుబడి ఉండటాన్ని తెలియచేయటమే లక్ష్యంగా, 2030 అజెండా అమలుకు వేగం పెంచటం ఈ సదస్సు ఉద్దేశం. నవంబర్ 4 నుంచి 6వ తేదీ వరకు ఖతార్ లోని దోహలో ఈ సదస్సు జరుగుతుంది.
రెండో ప్రపంచ సామాజికాభివృద్ధి సదస్సులో ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశమనేది ఒక బహిరంగ చర్చా వేదిక. ప్రపంచ వ్యవస్థాగత పోకడలు, కోపెన్‌హాగన్ ఒప్పందంలోని మూడు కీలక లక్ష్యాలపై ఆ మార్పుల ప్రభావాలను పరిగణలోకి తీసుకుని, సామాజిక అభివృద్ధిని వేగవంతం చేసే సమగ్ర పనులను గుర్తించడానికి ఈ సమావేశం కృషి చేస్తుంది.
***