రక్షణ మంత్రిత్వ శాఖ
'ఇక్షాక్' ప్రారంభంతో స్వదేశీ హైడ్రోగ్రాఫిక్ నైపుణ్యంలో నూతన అధ్యయాన్ని లిఖించనున్న భారత నౌకాదళం
భారత సముద్ర తీరంలో కచ్చితత్వం, లక్ష్యం, ఆత్మనిర్భరతకు దిక్సూచి ఎస్ వీఎల్ ఇక్షాక్
Posted On:
05 NOV 2025 10:23AM by PIB Hyderabad
ఇక్షాక్ ప్రారంభం ద్వారా హైడ్రోగ్రాఫిక్ సర్వే సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని భారత నౌకాదళం భావిస్తోంది. నౌకా దళంలోకి ప్రవేశపెట్టనున్న సర్వే నౌక (లార్జ్) [ఎస్ వీఎల్] విభాగానికి చెందిన మూడో నౌక ఇక్షాక్.. దక్షిణ నౌకా దళ కమాండ్ లో ...ఈ విభాగంలో మోహరించనున్న మొదటి నౌక. నౌకా దళ అధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి సమక్షంలో 2025 నవంబర్ 6న కొచ్చిలోని నావల్ బేస్ లో ఈ నౌకను లాంఛనంగా ప్రవేశపెడతారు.
కోల్ కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) కంపెనీ నిర్మించిన ఇక్షాక్ నౌక.. నౌకా నిర్మాణంలో భారతదేశ ఆత్మనిర్భరతకు ఉదాహరణగా నిలుస్తుంది. 80 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకను నిర్మించారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ విజయాన్ని, జీఆర్ఎస్ఈ, దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మధ్య సహకార సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది.
'ఇక్షాక్' అనే పేరుకి సంస్కృతంలో 'మార్గదర్శి' అని అర్థం. కచ్చితత్వంతో లక్ష్యాన్ని నెరవేరుస్తూ రక్షణ నౌకలా పనిచేసే ఈ నౌకకు ఈ పేరు సరిగ్గా సరిపోతుంది. తీరప్రాంతాలు, లోతైన జలాలు, నౌకాశ్రయాలు, ఓడరేవులు, నౌకాయాన మార్గాల్లో పూర్తిస్థాయి హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేపట్టేందుకు ఈ నౌకను రూపొందించారు. సముద్రంలో సురక్షితమైన నౌకాయానానికి, దేశ సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం అత్యంత కీలకంగా మారుతుంది.
అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, సముద్ర అధ్యయన పరికరాలతో ఇక్షాక్ నౌకను రూపొందించారు. ఇందులో హై-రిజల్యూషన్ మల్టీ-బీమ్ ఎకో సౌండర్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ), రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్ఓవీ), నాలుగు సర్వే మోటార్ బోట్లు (ఎస్ఎంబీలు) ఉన్నాయి. ఈ అత్యాధునిక పరికరాలతో ఇక్షాక్ నౌక.. భారత నేవీ హైడ్రోగ్రాఫిక్ బృందానికి సాటిలేని బహుముఖ ప్రజ్ఞను, సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ నౌకకు అమర్చిన హెలికాప్టర్ డెక్.. నౌక కార్యాచరణ పరిధిని విస్తరించటంతో పాటు వివిధ రకాల మిషన్లను చేపట్టే వీలు కల్పిస్తుంది.
సముద్ర సర్వే, మౌలిక సదుపాయాల పెంపుదలకు భారత నౌకా దళం చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఇక్షాక్ ను ప్రవేశపెట్టటం అత్యంత కీలకమైనది. స్వదేశీ శక్తి, సాంకేతిక నైపుణ్యం, సముద్ర పర్యవేక్షణకు ప్రతీకగా నిలిచే ఇక్షాక్ నౌక.. తెలియని చోట జలమార్గాన్ని నిర్దేశిస్తూ, భారత సముద్ర సరిహద్దులను పరిరక్షిస్తూ, దేశానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉంది.
***
(Release ID: 2186782)
Visitor Counter : 6