ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్ వీడ్ అవుట్: ముంబయి విమానాశ్రయంలో రూ. 42 కోట్ల విలువైన 42 కిలోలకు పైగా హైగ్రేడ్ హైడ్రోపోనిక్ వీడ్ స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ-ఇద్దరి అరెస్టు


3 రోజుల్లో రూ.100 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

Posted On: 04 NOV 2025 7:26PM by PIB Hyderabad

"ఆపరేషన్ వీడ్ అవుట్"లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరో పెద్ద విజయం సాధించింది. ఆదివారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 42.34 కిలోల హై-గ్రేడ్ హైడ్రోపోనిక్ వీడ్‌ను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 42 కోట్లు ఉంటుందని అంచనా.

నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారంతో డీఆర్ఐ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను, వారి సామానులను తనిఖీ చేశారు. నూడుల్స్, బిస్కెట్లు సహా 21 ఆహార ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని పరీక్షించిన అధికారులు... వాటిలో చాకచక్యంగా దాచిపెట్టిన హైడ్రోపోనిక్ వీడ్‌ను గుర్తించారు. ఎన్‌డీపీఎస్ కిట్‌ని ఉపయోగించి మాదకద్రవ్యాల ఉనికిని వారు నిర్ధరించారు.

నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం-1985 నిబంధనల ప్రకారం నిషేధించిన 42.34 కిలోల సరుకును అధికారులు స్వాధీనం చేసుకుని... ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు.

శుక్రవారం (31.10.2025) రూ. 47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న మూడు రోజుల్లోనే డీఆర్ఐ అడ్డుకున్న రెండో అతిపెద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఇది. ఈ కేసులో ఇప్పటివరకు క్యారియర్లు, ఫైనాన్సర్లు, హ్యాండ్లర్లు, పంపిణీదారులు సహా ఐదుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. ఈ కార్యకలాపాలన్నీ కలిపి గత మూడు రోజుల్లో మొత్తం రూ. 100 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్‌కు పశ్చిమ మార్గం ద్వారా మాదకద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లను ఈ చర్యల ద్వారా డీఆర్ఐ నిర్ణయాత్మకంగా దెబ్బతీసింది.

ఇది కాకుండా, ఆపరేషన్ వీడ్ అవుట్ ద్వారా దేశంలోని పలు విమానాశ్రయాల్లో 292.9 కిలోల హైడ్రోపోనిక్ వీడ్‌ను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది.

పెరుగుతున్న అక్రమ రవాణా ధోరణులు... ముఖ్యంగా మాదకద్రవ్యాలను ఆహార ప్యాకెట్లు, నిత్యావసర వస్తువుల్లో దాచడం... భారత పౌరులను క్యారియర్లుగా ఉపయోగించడంపై అప్రమత్తమైన డీఆర్ఐ ఈ విషయంగా పూర్తిస్థాయి విచారణను కొనసాగిస్తోంది.

మాదకద్రవ్యాల సరఫరాను నిరంతరం అడ్డుకోవడం... అంతర్జాతీయ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడం... పౌరుల ఆరోగ్యం, శ్రేయస్సు, భద్రతను పరిరక్షించడం ద్వారా నషా ముక్త్ భారత్‌ను సాధించాలనే తన నిబద్ధత పట్ల డీఆర్ఐ దృఢంగా ఉంది.

 

***


(Release ID: 2186509) Visitor Counter : 5