ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం


రూ.1 లక్ష కోట్ల వ్యయంతో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించిన పీఎం

భారత్‌లో ఆధునిక ఆవిష్కరణ వ్యవస్థ వికసించేలా పరిశోధనా సౌలభ్యాన్ని అందించడంపై దృష్టి సారించాం: పీఎం

సైన్సు విస్తృతమైనప్పుడు, ఆవిష్కరణలు అందరికీ చేరువైనప్పుడు, సాంకేతికత మార్పును నడిపిస్తున్నప్పుడు.. గొప్ప విజయాలకు అవసరమైన పునాది ఏర్పడుతుంది: పీఎం

ఇకపై భారత్ సాంకేతిక వినియోగదారు మాత్రమే కాదు.. సాంకేతికత ద్వారా పరివర్తనకు మార్గదర్శిగా మారుతోంది: పీఎం

ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన డిజిటల్ మౌలికవసతులు ఇప్పుడు భారత్‌లో ఉన్నాయి: పీఎం

నైతిక విలువలతో కూడిన, మానవ కేంద్రిత ఏఐకు అవసరమైన అంతర్జాతీయ నియమావళిని భారత్ రూపొందిస్తోంది: పీఎం

Posted On: 03 NOV 2025 11:13AM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్‌టీఐసీ) 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధనా సంస్థల సభ్యులు, ఇతర విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ఐసీసీ మహిళ ప్రపంచ కప్‌ 2025లో భారత క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన విజయంతో దేశమంతా ఆనందంతో ఉప్పొంగిపోయిందన్నారు. తొలిసారి భారత్ మహిళా ప్రపంచ కప్ గెలిచిందంటూ.. దీన్ని సాధించిన మహిళల జట్టుకు అభినందనలు తెలియజేశారు. వారిని చూసి దేశం గర్విస్తోందని, వారు సాధించిన విజయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది యువతకు స్ఫూర్తినిస్తుందన్నారు.

ప్రపంచ శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్ నిన్న అపూర్వమైన విజయాన్ని సాధించిందని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ శాస్త్రవేత్తలు.. దేశ భూభాగం నుంచి అత్యంత బరువైన ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారన్నారు. ఈ మిషన్లో భాగమైన శాస్త్రవేత్తలందరికు, ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. శాస్త్ర, సాంకేతిక రంగంలో ఈ రోజు చరిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. 21వ శతాబ్దంలో.. అభివృద్ధి చెందుతున్న నూతన శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణలకు దిశను అందించేందుకు అంతర్జాతీయ నిపుణులంతా ఒక్క చోట చేరి చర్చించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. ఈ అవసరమే.. ఒక ఆలోచనకు నాంది పలికిందని.. అదే.. ఈ సదస్సుకు దార్శనికతగా మారిందన్నారు. ఇప్పుడు ఈ సదస్సు ద్వారా ఆ లక్ష్యం రూపం సంతరించుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రైవేటు రంగ సంస్థలు, అంకుర సంస్థలు, విద్యార్థులు పాల్గొన్నారని ప్రధాని గుర్తించారు. వీరందరి మధ్యలో నోబెల్ పురస్కార గ్రహీత ఉండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమైన హాజరైన వారందరికీ స్వాగతం చెబుతూ.. సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అపూర్వమైన ప్రగతికి చెందిన కాలంగా 21 వ శతాబ్దాన్ని వర్ణిస్తూ.. అంతర్జాతీయ క్రమంలో కొత్త మార్పులు చూస్తున్నామని, వాటి వేగం సాధారణంగా కాకుండా.. విశేషంగా ఉందని శ్రీ మోదీ అన్నారు. ఈ దృక్పథంతోనే నూతన శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలకు సంబంధించిన వివిధ అంశాల్లో భారత్ ముందుకు వెళుతోందని, వాటిపై నిరంతరం దృష్టి సారిస్తోందన్నారు. దీనికి ఉదాహరణగా పరిశోధనలకు కేటాయించిన నిధులను చూపించారు. అలాగే అందరికీ సుపరిచితమైన జాతీయ లక్ష్యం ‘జై జవాన్, జై కిసాన్’ను గుర్తు చేసుకుంటూ.. పరిశోధనల పునరుజ్జీవానికి ప్రాధాన్యమిస్తూ.. ఈ నినాదానికి ‘జై విజ్ఞాన్’, ‘జై అనుసంధాన్’ కూడా జోడించామని తెలిపారు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ ఏర్పాటైందని వెల్లడించారు. వీటికి అదనంగా, రూ. 1 లక్ష కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకాన్ని ప్రారంభించామని ప్రకటించారు. ప్రైవేటు రంగంలో సైతం పరిశోధనాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ‘‘అధిక నష్టానికి, అధిక ప్రభావానికి వీలున్న ప్రాజెక్టులకు మొదటిసారిగా మూలధనం అందుబాటులోకి వస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.
‘‘ఆధునిక ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించేందుకు, పరిశోధనా సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు భారత్ కృషి చేస్తోంది’’ అంటూనే ఆర్థిక నియమాలు, సేకరణ విధానాల్లో అనేక సంస్కరణలను ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. అదనంగా.. ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు ప్రాథమిక నమూనాలు వేగంగా చేరేలా నియంత్రణలు, ప్రోత్సాహకాలు, సరఫరా వ్యవస్థల్లో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు.
భారత్‌ను ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా మార్చేందుకు ఇటీవలి సంవత్సరాల్లో చేపట్టిన అనేక విధానాలు, నిర్ణయాలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని వెల్లడిస్తూ.. ముఖ్యమైన గణాంకాలను శ్రీ మోదీ పంచుకున్నారు. గడచిన దశాబ్దంలో భారత పరిశోధన అభివృద్ధికి సంబంధించిన వ్యయం రెట్టింపయింది. రిజిస్టర్ చేసుకున్న పేటెంట్ల సంఖ్య 17 రెట్లు పెరిగింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర సంస్థల వ్యవస్థగా భారత్ ఎదిగింది. స్వచ్ఛ ఇంధనం, అధునాతన సామగ్రి లాంటి రంగాల్లో 6,000కు పైగా డీప్ టెక్ అంకుర సంస్థలు పనిచేస్తున్నాయి... అంటూ ఆయన తెలియజేశారు. భారతీయ సెమీ కండక్టర్ రంగం ఇప్పుడు వేగాన్ని పుంజుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో బయో ఎకానమీ వృద్ధి 2014లో రూ.10 బిలియన్ డాలర్ల నుంచి.. ప్రస్తుతం 140 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
ఇటీవలి సంవత్సరాల్లో.. హరిత హైడ్రోజన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సముద్ర అంతర్భాగ పరిశోధన, కీలకమైన ఖనిజాలు తదితరమైన కొత్తగా పుట్టుకొస్తున్న రంగాల్లో గణనీయమైన విజయాలు సాధిస్తూ.. భారత్ తన ఉనికిని చాటుతోందని శ్రీ మోదీ వివరించారు.
‘‘సైన్సు విస్తృతమైనప్పుడు, ఆవిష్కరణలు అందరికీ చేరువైనప్పుడు, సాంకేతికత మార్పును నడిపిస్తున్నప్పుడు.. గొప్ప విజయాలకు పునాది ఏర్పడుతుంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ దార్శనికతకు గడచిన 10-11 ఏళ్లుగా భారత్ సాగించిన ప్రయాణం ఉదాహరణగా నిలుస్తోందన్నారు. భారత్ ఇకపై సాంకేతిక వినియోగదారు మాత్రమే కాదని, సాంకేతికత ద్వారా పరివర్తనకు మార్గదర్శిగా నిలుస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి సందర్భంలో రికార్డు సమయంలో దేశీయంగా వ్యాక్సీన్ను భారత్ అభివృద్ధి చేసిందని, ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం చేపట్టిందని గుర్తు చేశారు.
బృహత్ స్థాయిలో విధానాలను, పథకాలను భారత్ ఏ విధంగా అమలు చేయగలుగుతుందో ప్రధానమంత్రి వివరించారు. ఈ విజయానికి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత డిజిటల్ మౌలిక వసతులే కారణమని తెలియజేశారు. రెండు లక్షలకు పైగా గ్రామ పంచాయతీలను ఆప్టికల్ ఫైబర్ ద్వారా అనుసంధానించామని.. దేశవ్యాప్తంగా మొబైల్ డేటాను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన వివరించారు.
భారత అంతరిక్ష కార్యక్రమం చంద్రుడిని, అంగారక గ్రహాన్ని చేరుకోవడంతో పాటుగా..  స్పేస్ సైన్స్ అప్లికేషన్ల ద్వారా  రైతులు, మత్స్యకారులకు కూడా తోడ్పడుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ విజయాల వెనుక ఉన్నవారందరి భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.
సమ్మిళిత ఆవిష్కరణలకున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ.. ఆవిష్కరణ అందరికీ చేరితే.. దాని ప్రాథమిక లబ్ధిదారులు సైతం నాయకులుగా మారతారని ప్రధానమంత్రి అన్నారు. దీనికి సరైన ఉదాహరణ భారతీయ మహిళలే అన్నారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమాల గురించి అంతర్జాతీయంగా చర్చించిన ప్రతి సందర్భంలోనూ మహిళా శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు లభిస్తోందని తెలియజేశారు. మేధో హక్కుల విషయానికి వస్తే.. దశాబ్దం క్రితం భారత్‌లో మహిళలు 100 కంటే తక్కువే పేటెంట్లకు దరఖాస్తు చేశారని, ఇప్పుడు ఆ సంఖ్య ఏడాదికి 5,000 దాటిందని తెలియజేశారు. భారత్‌లో స్టెమ్ రంగాల్లో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 43 శాతంగా ఉందని.. ఇది అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువ అని ఆయన వెల్లడించారు. ఈ గణాంకాలన్నీ.. దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు సాధిస్తున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
చరిత్రలో కొన్ని క్షణాలు, కొన్ని తరాల పాటు స్ఫూర్తినందించేవిగా నిలిచిపోతాయని ప్రధానమంత్రి అన్నారు. కొన్నేళ్ల క్రితం.. దేశంలోని చిన్నారులు చంద్రయాన్ ప్రయాణాన్ని చూశారని, దానికి సంబంధించిన ఒడిదొడుకులు, విజయాలను తెలుసుకొని, సైన్స్ పట్ల ఎలా ఆసక్తిని పెంచుకున్నారో గుర్తుచేసుకున్నారు. ఇటీవలే అంతరిక్ష కేంద్రానికి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చేపట్టిన యాత్ర చిన్నారుల్లో సరికొత్త ఆసక్తిని రేకెత్తించిదన్నారు. యువతరంలో పెరుగుతున్న ఆ ఉత్సాహాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. శాస్త్ర, సాంకేతికత, ఆవిష్కరణల దిశగా ఎంతమంది యువతను నడిపిస్తే.. భారత్‌కు అంత మంచి జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ లక్ష్యానికి అనుగుణంగానే.. దేశవ్యాప్తంగా 10,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో ఒక కోటి మందికి పైగా చిన్నారులు ఉత్సాహంగా, సృజనాత్మకంగా ప్రయోగాలు చేస్తున్నారన్నారు. ఈ విజయం అందించిన ప్రోత్సాహంతో.. 25,000 కొత్త అటల్ టింకరింగ్ ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఏడు ఐఐటీలు, పదహారు ఐఐఐటీలతో సహా వందల సంఖ్యలో కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయని ప్రధానమంత్రి వెల్లడించారు. నూతన విద్యా విధానం ప్రకారం సైన్స్, ఇంజనీరింగ్ లాంటి స్టెమ్ కోర్సులను విద్యార్థులు వారి ప్రాంతీయ భాషల్లో నేర్చుకోవచ్చన్నారు.
యువ పరిశోధకుల్లో ప్రధానమంత్రి రీసెర్చి ఫెలోషిప్ గొప్ప విజయాన్ని సాధించిందని, ఇది వారికి తగినంత సాయం చేస్తుందని శ్రీ మోదీ తెలిపారు. అలాగే దేశంలో ఆర్ అండ్ డీని మరింత బలోపేతం చేసేలా వచ్చే అయిదేళ్ల కాలానికి 10,000 ఫెలోషిప్పులు అందిస్తామని శ్రీ మోదీ ప్రకటించారు.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి ఉన్న పరివర్తనాత్మక శక్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ.. అవి నైతికంగా, సమ్మిళితంగా ఉండేలా చూసుకోవాలని ప్రధాని అన్నారు. రిటైల్, రవాణా నుంచి వినియోగదారుల సేవలు, చిన్నారుల హోంవర్కు వరకు విస్తృతంగా ఉపయోగిస్తున్న కృత్రిమ మేధను దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి ఏఐను ప్రయోజనకరంగా మార్చేందుకు భారత్ పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇండియా ఏఐ మిషన్ పరిధిలో రూ.10,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
‘‘నైతిక విలువలతో కూడిన, మానవాళికి ఉపయోగపడే ఏఐ కోసం అంతర్జాతీయ నియమావళిని భారత్ రూపొందిస్తోంది’’ అని ప్రధాని అన్నారు. ఈ దిశగా త్వరలో రానున్న ఏఐ పరిపాలనా నియమావళి కీలకమైనది అవుతుందని, ఆవిష్కరణలు భద్రతను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఉంటుందని వివరించారు. 2026 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఏఐ సమ్మేళనానికి భారత్ ఆతిథ్యమిస్తుందని, ఇది సమ్మిళితమైన, నైతికమైన, మానవ ప్రయోజనకర ఏఐ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేస్తుందన్నారు.
అభివృద్ధి చెందిన భారత్ దిశగా లక్ష్యాన్ని సాధించడంలో కీలకంగా మారుతున్న, నూతనంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రయత్నాలను వేగవంతం చేయాలని పిలుపునిస్తూ.. ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు దృష్టిని మరల్చాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు బయోఫోర్టిఫైడ్ పంటలను భారత్ అభివృద్ధి చేస్తుందా? తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎరువులు, జీవ ఎరువులు.. రసాయనిక ఎరువులకు ప్రత్యామ్నాయంగా పనిచేసి.. భూసారాన్ని పెంచుతాయా? వ్యక్తి అవసరానికి తగినట్లుగా ఔషధాలు, వ్యాధుల అంచనాను అభివృద్ధి చేయగలిగేలా జెనోమిక్ వైవిధ్యాన్ని భారత్ ముందుకు నడిపించగలదా? బ్యాటరీల లాంటి స్వచ్ఛ ఇంధన స్టోరేజీల్లో నూతన, సరసమైన ఆవిష్కరణలను అభివృద్ధి చేయగలదా? అంటూ కీలకమైన ప్రశ్నలు సంధించారు. ఏ అంశాల్లో భారత్ ప్రపంచంపై ఆధారపడి ఉందో గుర్తించి ఆయా రంగాల్లో స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు.
శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నవారు తమకు ఎదురైన ప్రశ్నల పరిధిని దాటి కొత్త అవకాశాలను అన్వేషిస్తారన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఆలోచనలతో వచ్చిన వారికి తన సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే పరిశోధనకు అవసరమైన నిధులను సమకూర్చడంలో, శాస్త్రవేత్తలకు అవకాశాలను అందించడంలో ప్రభుత్వం నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సదస్సు నుంచి సమష్టి ప్రణాళిక రూపొందాలని ఆకాంక్షించారు. అలాగే భారతీయ ఆవిష్కరణల ప్రయాణాన్ని సరికొత్త శిఖరాలకు ఈ సదస్సు చేరుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘జై విజ్ఞాన్, జై అనుసంధాన్’’ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత ప్రభుత్వానికి ప్రధాన సైంటిఫిక్ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, నోబుల్ పురస్కార గ్రహీత సర్ ఆండ్రీ గీమ్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
దేశంలో ఆర్ అండ్ డీ వ్యవస్థకు ప్రోత్సాహాన్ని అందించేలా రూ. 1 లక్ష కోట్లతో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రైవేటు రంగం సారథ్యంలో దేశంలో పరిశోధన, ఆవిష్కరణల వ్యవస్థను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.
ఈఎస్‌టీఐసీ 2025 సదస్సు 2025 నవంబర్ 3 నుంచి 5 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో విద్య, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన 3,000 మందితో పాటుగా నోబెల్ విజేతలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, విధాన రూపకర్తలు పాల్గొన్నారు. అధునాతన పరికరాలు - తయారీ, కృత్రిమ మేధ, బయో-మాన్యుఫాక్చరింగ్, సముద్ర ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్-సెమీకండక్టర్ తయారీ, నూతన వ్యవసాయ సాంకేతికతలు, ఇంధనం, పర్యావరణం-వాతావరణం, ఆరోగ్య-వైద్య సాంకేతికతలు, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష సాంకేతికతలు సహా 11 ప్రధానాంశాలపై చర్చలు జరుగుతాయి.
ప్రముఖ శాస్త్రవేత్తల ప్రసంగాలు, ప్యానెల్ చర్చలు, ప్రజెంటేషన్లు, సాంకేతికత ప్రదర్శనలు ఈఎస్‌టీఐసీ 2025లో ఉంటాయి. ఇది పరిశోధకులు, పరిశ్రమలు, యువ ఆవిష్కర్తల మధ్య భాగస్వామ్యానికి అవసరమైన వేదికను అందిస్తూ.. భారతీయ శాస్త్ర సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

 

***


(Release ID: 2186105) Visitor Counter : 5