రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

స్వదేశీ జీశాట్-7ఆర్ ఉపగ్రహంతో అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్‌ను పెంచుకోనున్న భారత నావికాదళం

Posted On: 02 NOV 2025 8:00AM by PIB Hyderabad

భారత నావికాదళానికి చెందిన జీశాట్-7ఆర్ (సీఎమ్ఎస్-03) కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోజు ప్రయోగించనుంది. ఇది భారత నావికాదళం కోసం అత్యంత అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహంగా పనిచేస్తుంది. ఈ ఉపగ్రహం నావికాదళం కోసం అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్లు, సముద్ర సంబంధితమైన వాతావరణ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ గురించిన అవగాహన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు.  ఇంతవరకు ప్రయోగించిన వాటిలో అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహమైన ఇది, దాదాపు 4,400 కిలోల బరువు గలది. భారత నావికాదళ కార్యాచరణ అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన అనేక స్వదేశీ అత్యాధునిక భాగాలు ఇందులో ఉన్నాయి.

జీశాట్-7ఆర్ ఉపగ్రహం హిందూ మహాసముద్రం ప్రాంతం అంతటా బలమైన టెలికమ్యూనికేషన్ కవరేజీని అందిస్తుంది. దీని పేలోడ్‌లో బహుళ కమ్యూనికేషన్ బ్యాండ్‌లపై వాయిస్, డేటా, వీడియో లింక్‌లకు మద్దతు ఇవ్వగల ట్రాన్స్‌పాండర్‌లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అధిక-సామర్థ్య బ్యాండ్‌విడ్త్‌తో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఓడలు, విమానాలు, జలాంతర్గాములు, భారత నావికాదళం ఆధీనంలోని నౌకా వాణిజ్య కార్యకలాపాల కేంద్రాల మధ్య సజావైన, సురక్షితమైన కమ్యూనికేషన్ లింక్‌లను అనుమతిస్తుంది.

సంక్లిష్ట భద్రతా సవాళ్ల యుగంలో ఆత్మనిర్భరత ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన జీశాట్-7ఆర్ ఉపగ్రహం... దేశ సముద్ర సంబంధిత ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను పరిరక్షించడం పట్ల భారత నావికాదళ దృఢ సంకల్పాన్ని సూచిస్తుంది.

 

***


(Release ID: 2185514) Visitor Counter : 23