ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ రాయ్‌పూర్‌లోని సత్యసాయి సంజీవని పిల్లల గుండెజబ్బు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్న బాలలతో ప్రధానమంత్రి మాటామంతీ

Posted On: 01 NOV 2025 6:52PM by PIB Hyderabad

ప్రధానమంత్రి: ‘హృదయ’పూర్వక సంభాషణకు మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు?

యువ లబ్ధిదారు: సర్‌... నేను హాకీ ఛాంపియన్‌ని. ఇప్పటిదాకా 5 పతకాలు సాధించాను. మా పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించినపుడు నా గుండెకు రంధ్రం ఉన్నట్లు నిర్ధరించారు. ఆ తర్వాత ఈ ఆస్పత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నాను. నేనిప్పుడు మళ్లీ హాకీ మైదానంలో ప్రతిభ చూపగలను.

ప్రధానమంత్రి: నీకు శస్త్రచికిత్స ఎప్పుడు చేశారు?

యువ లబ్ధిదారు: ఆరు నెలల కిందట సర్‌...

ప్రధానమంత్రి: ఇంతకుముందు ఆటలు ఆడేవాడివా?

యువ లబ్ధిదారు: అవును సర్‌..

ప్రధానమంత్రి: ఇప్పుడు కూడా ఆడుతున్నావా?

యువ లబ్ధిదారు: ఆడుతున్నాను సర్‌..

ప్రధానమంత్రి: భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు?

యువ లబ్ధిదారు: డాక్టర్‌ కావాలనుకుంటున్నాను సర్‌..

ప్రధానమంత్రి: డాక్టర్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నావు?

యువ లబ్ధిదారు: పిల్లల చికిత్స నిపుణుడు కావాలని నా ఆకాంక్ష.

ప్రధానమంత్రి: పిల్లలకు మాత్రమేనా?

యువ లబ్ధిదారు: అందరికీ చికిత్స చేస్తాను...

ప్రధానమంత్రి: నీవు డాక్టర్‌ అయ్యేనాటికి నేను బాగా వృద్ధుడినైపోతాను.. అప్పుడు నాకూ చికిత్స చేస్తావా?

యువ లబ్ధిదారు: తప్పకుండా చేస్తాను సర్‌...

ప్రధానమంత్రి: నాకు వాగ్దానం చేస్తావా?

యువ లబ్ధిదారు: అవును సర్‌... హామీ ఇస్తున్నాను.

ప్రధానమంత్రి: మంచిది..

యువ లబ్ధిదారు: నాకు మిమ్మల్ని కలిసే అవకాశం వస్తుందని నేనెప్పడూ అనుకో్లేదు సర్‌.. ఈ రోజు మీతో మాట్లాడటం నాకెంతో సంతోషం కలిగిస్తోంది.

యువ లబ్ధిదారు: నాకు ఏడాది కిందట శస్త్రచికిత్స చేశారు. నేను పెద్దయ్యాక, డాక్టరునై అందరికీ చికిత్స చేయాలని ఆశిస్తున్నాను.

ప్రధానమంత్రి: శస్త్రచికిత్స చేసేటపుడు కన్నీరు పెట్టావా?

యువ లబ్ధిదారు: లేదు సర్‌... నేనేమీ బాధపడలేదు.

ప్రధానమంత్రి: కానీ, నువ్వు చాలాసేపు కన్నీరు పెట్టావని డాక్టర్ చెప్పారే మరి!

యువ లబ్ధిదారు: డాక్టర్‌ అలా ఎప్పుడన్నారు? అలా అనలేదు సర్‌.

ప్రధానమంత్రి: లేదా?

యువ లబ్ధిదారు: నీను మీకొక ప్రవచనం వినిపించాలని భావిస్తున్నాను.

ప్రధానమంత్రి: సరే... కానివ్వు!

యువ లబ్ధిదారు: “నీ గమ్యస్థానానికి చేరాక మరో కొత్త గమ్యాన్ని అన్వేషించు... ఒక నది వద్దకు చేరితే, సముద్రం కోసం అన్వేషణ ప్రారంభించు... రాతి దెబ్బకు ప్రతి గాజు పగిలి పోతుంది. కానీ, రాతిని కూడా బద్దలు కొట్టగల గాజు కోసం అన్వేషించు.. సాదాసీదా ప్రార్థనలతో నీకేం ఒరిగింది? శతాబ్దాలు వ్యర్థమయ్యాయి తప్ప ప్రయోజనమేమీ లేదు. కాబట్టి, నీ జీవితాన్ని సమూల రీతిలో మార్చగల కొత్త ప్రార్థన పద్ధతిని అన్వేషించు!”

ప్రధానమంత్రి: అద్భుతం! ఎంతో బాగుంది!

యువ లబ్ధిదారు: నాకు 2014లో శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పుడు నా వయసు 14 నెలలు. ఇవాళ నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను... క్రికెట్ అంటే నాకు ప్రాణం!

ప్రధానమంత్రి: శస్త్రచికిత్స చేసి, 11 ఏళ్లు గడిచాయి కదా... క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటున్నావా?

యువ లబ్ధిదారు: చేయించుకుంటున్నాను సర్‌!

ప్రధానమంత్రి: ఇప్పుడు అంతా బాగానే ఉందా?

యువ లబ్ధిదారు: ఇప్పుడు ఏ సమస్యలూ లేవు సర్‌.

ప్రధానమంత్రి: నువ్విప్పుడు ఆడటానికి వెళ్తుంటావా?

యువ లబ్ధిదారు: వెళ్తాను సర్‌...

ప్రధానమంత్రి: క్రికెట్‌ ఆడటానికేనా?

యువ లబ్ధిదారు: అవును సర్‌..

యువ లబ్ధిదారు: మీకు దగ్గరగా రావాలనుంది... రావచ్చా!

ప్రధానమంత్రి: తప్పకుండా...

ప్రధానమంత్రి: ఆస్పత్రిలో చేరినప్పుడు ఏమనిపించింది? మందులు, ఇంజెక్షన్లు తీసుకోవాల్సి రావడం ఎలా అనిపించింది?

యువ లబ్ధిదారు: సర్‌... ఇంజెక్షన్లంటే నాకేమీ భయం లేదు కాబట్టి, నా శస్త్రచికిత్స సజావుగా పూర్తయింది. నేను ఏమాత్రం భయపడలేదు.

ప్రధానమంత్రి: మంచిది... మీ ఉపాధ్యాయులు నీ గురించి ఏమంటారు?

యువ లబ్ధిదారు: నేను చదువులో ముందుంటానని వారు చెబుతారు.. అయితే, నాకు కొంచెం నత్తి ఉన్నందువల్ల మాట తడబడుతూంటుంది.

ప్రధానమంత్రి: నేను అర్థం చేసుకున్నాను... కానీ, మీరు నిజం చెప్పడం ఎప్పుడూ మంచిదే- నిజాయితీగా ఉండటం మనకు సదా మేలు చేస్తుంది.

యువ లబ్ధిదారు: నేను 7వ తరగతి చదువుతుండగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది...

ప్రధానమంత్రి: నువ్వు 7వ తరగతి చదువుతున్నావా...

యువ లబ్ధిదారు: అవును సర్‌...

ప్రధానమంత్రి: నువ్వు సరైన పాళ్లలో ఆహారం తీసుకుంటావా?

యువ లబ్ధిదారు: తీసుకుంటాను సర్‌... నాకు తెలుసు.

ప్రధానమంత్రి: (నవ్వుతూ) మీ గురువుగారి తల తింటుంటావేమో! సరే... చెప్పు..

యువ లబ్ధిదారు: నేను 2023లో శస్త్రచికిత్స చేయించుకున్నాను... పెద్దయ్యాక ఉపాధ్యాయుడిని కావాలని కోరుకుంటున్నాను. పేద బాలలు జీవితంలో ఎదిగేవిధంగా వారికి ఉచిత బోధన చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే- మన దేశం అభివృద్ధి చెందడానికి సహాయపడేది విద్యే.

ప్రధానమంత్రి: సరే... ఈ నెలలో ఎవరి శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటామో మీకందరికీ తెలుసా? ఇది సత్యసాయి బాబా శతాబ్ది జయంతి... అనేక ఏళ్ల కిందట పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో వ్యవసాయానికే కాకుండా తాగడానికీ నీటి కొరత తీవ్రంగా ఉండేది- అలాంటి సమయంలో దాదాపు 400 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ఆయనెంతో శ్రమించారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి బృహత్కార్యం చేపట్టడానికి వెనుకాడుతాయి.. కానీ, ఆయన చేసి చూపారు. ఆయన బోధించిన అంశం ఏంటంటే,మనం ఎప్పుడూ నీటిని ఆదా చేయాలి... మొక్కలు నాటాలి. మీకు తెలుసా- నేను “ఏక్ పేడ్ మా కే నామ్” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాను. మీరంతా అమ్మను ఎంతో ప్రేమిస్తారు కదా... కాబట్టి, ఆమె పేరిట ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటండి. ఆ విధంగా మన తల్లితోపాటు భూమాతకూ మన రుణం తీర్చుకుందాం!

యువ లబ్ధిదారు: సర్‌... నా పేరు అభిక్... మాది పశ్చిమ బెంగాల్... పెద్దయ్యాక, నేను సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని భావిస్తున్నాను.

ప్రధానమంత్రి: దేశ సేవ చేయాలని ఉందా?

యువ లబ్ధిదారు: అవును సర్‌...

ప్రధానమంత్రి: కచ్చితంగా చేస్తావా?

యువ లబ్ధిదారు: తప్పకుండా సర్‌...!

ప్రధానమంత్రి: అలా ఎందుకు అనుకుంటున్నావు?

యువ లబ్ధిదారు: ఎందుకంటే- మనమంతా సురక్షితంగా ఉన్నామంటే సైనికులే కారణం. అదే తరహాలో నేను కూడా దేశ రక్షణకు అంకితం కావాలని భావిస్తున్నాను!

ప్రధానమంత్రి: అద్భుతం... అద్భుతం..

యువ లబ్ధిదారు: సర్‌... మీతో కరచాలనం చేయవచ్చా...
యువ లబ్ధిదారు: ఎందుకంటే- మిమ్మల్ని కలవాలన్నది నా కల.

ప్రధానమంత్రి: నిజమా! ఈ కల ఎప్పటిది... ఇవాళ్టిదేనా... మునుపటిదా?

యువ లబ్ధిదారు: చాలాకాలం కిందటిది సర్‌...

ప్రధానమంత్రి: నా గురించి నీకు తెలుసా?

యువ లబ్ధిదారు: తెలుసు సర్‌... వార్తల్లో చూశాను.

ప్రధానమంత్రి: ఓహో... నీవు వార్తలు చూస్తుంటావా... మంచిది! మీతో మాట్లాడటం నాకెంతో ఉల్లాసాన్నిచ్చింది. ఒక విషయం గుర్తుంచుకోండి... మీరు ఏ మంచి పని చేయాలనుకున్నా, అందుకు మార్గం మీ శరీరమే... కాబట్టి, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. నిత్యం కొద్దిసేపు యోగా చేయండి.. దినచర్యలు గాడి తప్పకుండా చూసుకోండి.. వేళకు తిండి-నిద్ర మరువకండి. మిమ్మల్ని మీరు బాగా చూసుకోవాలి మరి... సరేనా! ఆ మేరకు వాగ్దానం చేస్తారా?

యువ లబ్ధిదారులు: (ముక్త కంఠంతో) చేస్తున్నాం సర్‌...

ప్రధానమంత్రి: మీకందరికీ నా శుభాకాంక్షలు... శుభాశీస్సులు!

 

***


(Release ID: 2185492) Visitor Counter : 6