వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ ఎఫ్‌పీఓ సమావేశం-2025ను ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్


సమావేశంలో పాల్గొన్న 24 రాష్ట్రాలు, 140 జిల్లాల రైతులు, సీబీడీఓలు, ఏజెన్సీలు

అభ్యుదయ రైతులతో మాట్లాడిన కేంద్ర మంత్రి..
ప్రశంసనీయ పనితీరును కనబరిచిన ఎఫ్‌పీఓలు, సీబీడీఓలు, ఏజెన్సీలకు సత్కారం

మేం త్వరలో విత్తన చట్టాన్ని తీసుకువస్తాం,
రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు దక్కాలనే నిబంధన ఆ చట్టంలో ఉంటుంది: శ్రీ శివ్‌రాజ్ సింగ్

సమీకృత వ్యవసాయం, మంచి విత్తనాలతో పాటు రైతుల్లో ఔత్సాహిక పారిశ్రామికత్వాన్ని పెంపొందించడంపై
దృష్టి సారిస్తున్నాం: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్

నకిలీ విత్తనాలకూ, నాసి రకం కీటకనాశిని మందులకూ అడ్డుకట్ట వేసే పటిష్ఠ చట్టాన్ని
ప్రభుత్వం తీసుకొస్తుంది: శ్రీ శివ్‌రాజ్ సింగ్

ఎఫ్‌పీఓలు ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో సాయపడాలి.. మహిళలకు సాధికారత కల్పించడంతో పాటు
స్వదేశీ స్ఫూర్తితో స్వయంసమృద్ధి యుక్త గ్రామాలకు దన్నుగానూ నిలవాలి: శ్రీ చౌహాన్

Posted On: 30 OCT 2025 2:12PM by PIB Hyderabad

ఈ సంవత్సరపు జాతీయ ఎఫ్‌పీఓ సమావేశాన్ని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ న్యూ ఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలతో పాటు 140 జిల్లాల నుంచి వచ్చిన 500 మంది అభ్యుదయ రైతులు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీఓలు), ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు (ఐఏలు), క్లస్టర్ ఆధారిత వాణిజ్య సంస్థలు (సీబీబీఓలు) పాల్గొన్నాయి.

 
image.png

ఆహూతులను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. రైతులు, ఎఫ్‌పీఓ సభ్యులు, సంస్థల కృషిని ఆయన ప్రశంసించారు. ఉత్పత్తిదారుల స్థాయి నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా ఎదగాల్సిందిగా రైతులకు మంత్రి పిలుపునిచ్చారు. అదే జరిగితే పూర్తి ప్రయోజనాలు నేరుగా వారికే అందుతాయన్నారు. 
image.png


రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరుగులేని నిబద్ధతను కనబరుస్తున్నందుకు రైతుల పక్షాన శ్రీ చౌహాన్ శ్రీ మోదీకి కృతజ్ఞత‌లు తెలిపారు.  జీవనోపాధికీ, దేశ ప్రజలకు ఆహారాన్ని అందిస్తుండడానికీ వ్యవసాయం కీలకం అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘రైతులకు మేలు కలిగేలా సమీకృత వ్యవసాయంపై మేం దృష్టి సారిస్తున్నాం. రైతుల ఆదాయాన్ని పెంచాలంటే ఒక్క తిండిగింజల మీదే ఆధారపడితే సరిపోదు, దీనితో సంబంధం గల కార్యకలాపాలను కూడా తప్పక ప్రోత్సహించాలి’’ అని ఆయన అన్నారు. 
image.png

ధరల్లో తేడాలపై శ్రీ చౌహాన్ ఆందోళనను వ్యక్తం చేశారు. రైతులు వారు పండించిన పంటలకు న్యాయమైన ధరలను తరచూ అందుకోలేకపోతున్నారనీ, వినియోగదారులు మాత్రం అధిక ధరలు చెల్లిస్తున్నారనీ మంత్రి అన్నారు. ‘‘ఈ అంతరాన్ని తగ్గించక తప్పదు’’ అని ఆయన స్పష్టం  చేశారు. ప్రభుత్వం త్వరలో విత్తన చట్టాన్ని ప్రవేశపెడుతుందనీ, రైతులు అధిక నాణ్యత కలిగిన విత్తనాలు అందుకొనేటట్టు చూస్తుందనీ కేంద్ర మంత్రి ప్రకటించారు. నకిలీ విత్తనాలు, నాసి రకం కీటకనాశిని మందుల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యల్ని తీసుకొంటోందనీ, రైతులను కాపాడటానికి పటిష్ఠ చట్టాన్ని తీసుకొస్తుందనీ ఆయన అన్నారు.   
image.png

రైతులు తమ ఫలసాయానికి అదనపు హంగులు సమకూర్చడంపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ‘‘రైతులు వ్యవసాయ పంటలను ఉత్పత్తి చేసే వారుగా మిగిలిపోకూడదు, వారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదగాలి. శుద్ధి ప్రక్రియను అనుసరించి, అదనపు విలువను జతపరిస్తే వారి ఆదాయం ఇంతలంతలవుతుంది’’ అని మంత్రి అన్నారు.
image.png


చిన్న రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గట్టి ఆలోచనలు చేయాల్సిందిగా ఎఫ్‌పీఓలకు శ్రీ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆచరణీయ సూచనలను, సలహాలను మంత్రిత్వ శాఖకు నివేదించాలనీ, వాటి విషయంలో తగిన చర్యలు తీసుకుంటామనీ హామీనిచ్చారు. ఒక ఏడాది లోపల టర్నోవరుతో పాటు సభ్యత్వాన్ని కూడా విస్తరించాలనీ, సభ్యత్వం పొందిన రైతులకు గరిష్ఠ లాభం దక్కేటట్లు చూడటానికి విశ్వసనీయతనూ, నాణ్యతనూ మరింతగా పెంచాలని ఆయన ఎఫ్‌పీఓలకు సూచించారు.  
image.png

ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో గల ఎన్‌సీడీసీ, ఎన్‌సీయూఐ ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సంస్థ నిర్వహణ, వ్యాపార నిర్వహణ, డిజిటల్ నవకల్పనల్లో శ్రేష్ఠత్వాన్ని సాధించినందుకూ, ప్రశంసనీయ పనితీరును కనబరిచినందుకూ ఎఫ్‌పీఓలు, సీబీడీఓలు, ఏజెన్సీలను ఆయన సత్కరించారు.
image.png

వ్యవసాయ ఉత్పాదనల మహా ప్రదర్శన

ఎన్‌సీడీసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో తృణధాన్యాలనూ, పప్పుధాన్యాలనూ, నూనెగింజలనూ, పండ్లనూ, కాయగూరలనూ, సేంద్రియ, శుద్ధి చేసిన, సాంప్రదాయక ఉత్పాదనలనూ మొత్తం 267 ఎఫ్‌పీఓలు ప్రదర్శించాయి. 57 స్టాళ్లను కేంద్ర వ్యవసాయ మంత్రి సందర్శించి, రైతులతో మాట్లాడారు. వారి వినూత్న ప్రయత్నాలను ప్రశంసించారు. సాంకేతికతను వినియోగించుకోండి, మార్కెట్లకు చేరుకోండి, కొత్త ఆలోచనలు చేయండి అంటూ వారిని మంత్రి ప్రోత్సహించారు.

image.png


సాంకేతిక సదస్సులు, బృంద చర్చలు

ఈ కార్యక్రమంలో భాగంగా అనేక సాంకేతిక ప్రధాన సదస్సులతో పాటు నూనెగింజల ఉత్పత్తి, నీటిని అవసరమైనంత వరకే వినియోగించడం, ప్రాకృతిక వ్యవసాయం, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి, తేనె సేకరణ, డిజిటల్ మార్కెటింగ్, అగ్‌మార్క్ ధ్రువీకరణ, విత్తనాల ఉత్పత్తి సహా అనేక అంశాలపై బృంద చర్చలు నిర్వహించారు. ఈ సదస్సుల్లో వ్యవసాయ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులతో పాటు రైతులు పాలుపంచుకున్నారు.

image.png

రైతుల్లో ఔత్సాహిక పారిశ్రామికత్వానికీ, మార్కెట్‌తో అనుబంధానికీ నూతనోత్తేజం

ఎఫ్‌పీఓలు, రైతులు, కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య చర్చలకు వీలుగా ఒక  వేదికను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్త మార్కెట్లు లభించేందుకు మార్గం సుగమమైంది. ఈ సమావేశాన్ని రైతులను ఉత్పత్తిదారులుగాను, సేవాప్రదాతలుగాను, భాగస్వాములుగాను మరింత బలపరిచే ఉద్దేశంతో నిర్వహించారు. దీంతో వ్యవసాయరంగంలో సమ్మిళిత, వినూత్న అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు వేసినట్లయింది.

ఈ సార్థక కార్యక్రమం మంత్రికీ, రైతులకూ మధ్య చర్చకు ఒక ప్రబల ఉదాహరణగా నిలిచింది. దీంతో ఎఫ్‌పీఓ ఉత్పాదనలకు ప్రోత్సాహం లభించడమే కాకుండా కొత్త ఆలోచనల బదలీ చోటుచేసుకోవడం వల్ల దేశం నలుమూలలా మన రైతులకు కొండంత మేలు కలుగుతుంది.

 

***


(Release ID: 2184247) Visitor Counter : 11