ఆర్థిక మంత్రిత్వ శాఖ
30 అక్టోబర్ 2025 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు భూటాన్ పర్యటనకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన సందర్భంగా ఆర్థిక, అభివృద్ధి సహకారాన్ని పెంచుకోనున్న భారత్-భూటాన్
प्रविष्टि तिथि:
30 OCT 2025 2:09PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందంతో కలిసి కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 30 అక్టోబర్ నుంచి 2 నవంబర్ 2025 వరకు భూటాన్ లో పర్యటిస్తారు.
సాంగ్ చెన్ చోఖోర్ మఠం సందర్శనతో కేంద్రమంత్రి పర్యటన ప్రారంభమవుతుంది. 1765లో స్థాపించిన ఈ పురాతన మఠంలో 100 మందికి పైగా సన్యాసులు బౌద్ధ విద్యను అభ్యసిస్తున్నారు.
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను శ్రీమతి సీతారామన్ సందర్శిస్తారు. వాటిలో కురిచ్చు జల విద్యుత్ ప్లాంట్ డ్యామ్, పవర్ హౌస్, గ్యాల్ సంగ్ అకాడమీ, సాంగ్ చెన్ చోఖోర్ మఠం, పునాఖా జొంగ్ ఉన్నాయి.
పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి, భూటాన్ మహారాజు హిజ్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్చుక్, భూటాన్ ప్రధానమంత్రి హెచ్. ఈ దాషోషెరింగ్ తోబ్గేని మర్యాదపూర్వకంగా కలుస్తారు. భూటాన్ ఆర్థిక మంత్రి శ్రీ లెకీ డోర్జీతో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో భారతదేశం-భూటాన్ మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటంపై చర్చిస్తారు.
అధికారిక కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సీతారామన్ కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రదర్శనలకు హాజరవుతారు. అవి:
-
భూటాన్ ఇంధన రంగ డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీజీపీసీ)
-
భూటాన్ 21వ శతాబ్దపు ఆర్థిక ప్రణాళిక
-
భూటాన్ లోని డ్రక్ పీఎన్ బీ అండ్ బ్యాంక్ ఆఫ్ భూటాన్ కు చెందిన బ్యాంకింగ్, ఆర్థిక రంగం
-
గెలెఫు మైండ్ ఫుల్ నెస్ సిటీ ప్రాజెక్టు
కుటీర, చిన్న పరిశ్రమల (సీఎస్ఐ) మార్కెట్ ను సందర్శించిన సమయంలో భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా నగదు బదిలీని కేంద్ర ఆర్థిక మంత్రి పరిశీలిస్తారు. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న డిజిటల్, ఆర్థిక అనుసంధానతను ప్రతిబింబిస్తుంది.
పర్యటన చివర్లో భూటాన్ లోని రెండో అతి పురాతనమైన, రెండో అతి పెద్దదైన మఠం.. పునాఖా జొంగ్ ను సందర్శిస్తారు. అక్కడికి వెళ్లే మార్గంలో భూటాన్ రైతులతో ముచ్చటించి, అక్కడి వ్యవసాయ పద్ధతులు, సవాళ్లు, అవకాశాల గురించి తెలుసుకుంటారు.
భారత్, భూటాన్ మధ్య చిరకాల భాగస్వామ్యాన్ని ఈ పర్యటన స్పష్టం చేస్తుంది. ఈ భాగస్వామ్యం పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రాంతీయ అభివృద్ధి, శ్రేయస్సు వంటి అంశాలపై ఉమ్మడి ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2184246)
आगंतुक पटल : 21