విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్తు రంగంలో సహకారాన్ని బలపరుచుకున్న భారత్, నేపాల్.. కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్‌తో నేపాల్ ఇంధన మంత్రి శ్రీ కుల్‌మన్ ఘీసింగ్ సమావేశం
నేపాల్ లోని ఇనారువా, భారత్ లోని పూర్ణియా 400 కేవీ సీమాంతర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థతో పాటు
నేపాల్ లోని లమ్కీ (దోదోధారా), భారత్‌లోని బరేలీ 400 కేవీ సీమాంతర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు
పవర్‌గ్రిడ్, నేపాల్ విద్యుత్తు ప్రాధికార సంస్థ (ఎన్ఈఏ)ల మధ్య కుదిరిన ఒప్పందాలు
ప్రాంతీయ గ్రిడ్ సంధానం సహా విద్యుత్తు రంగంలో సహకారాన్ని సమీక్షించడానికి
ఇద్దరు నేతల వ్యూహాత్మక చర్చలు
Posted On:
29 OCT 2025 12:37PM by PIB Hyderabad
కేంద్ర విద్యుత్తు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్‌ను నేపాల్ ఇంధన, జల వనరులు, సాగునీటి శాఖ మంత్రి శ్రీ కుల్‌మన్ ఘీసింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు కలుసుకున్నారు. విద్యుత్తు రంగంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న సహకారాన్ని బలపరుచుకొనే అంశంపై ఇద్దరు నేతలూ సమావేశంలో చర్చించారు.
నేపాల్‌లో జలవిద్యుత్తు ప్రాజెక్టుల అభివృద్ధి పనులు పురోగమిస్తున్న తీరు సహా అనేక అంశాలపై చర్చించారు. సరిహద్దులకు ఆవల విద్యుత్తు వాణిజ్యాన్ని సులభతరంగా మార్చడం, ఇంధన భద్రతను పటిష్ఠపరుచుకోవడం, భారత్‌కూ నేపాల్‌కూ మధ్య స్వచ్ఛ ఇంధన వనరుల విస్తృత ఏకీకరణను ప్రోత్సహించడం సహా ప్రాంతీయ గ్రిడ్ సంధానానికి సంబంధించిన కార్యక్రమాలపైనా ఉభయ పక్షాలూ చర్చించాయి.

మహారత్న హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ) అయిన పవర్‌గ్రిడ్, నేపాల్ విద్యుత్తు ప్రాధికార సంస్థ (ఎన్ఈఏ)ల మధ్య ఒక సంయుక్త సంస్థ (జేవీ)తో పాటు వాటాదారుల ఒప్పందాలపై శ్రీ మనోహర్ లాల్, శ్రీ కుల్‌మన్ ఘీసింగ్‌ల సమక్షంలో సంతకాలయ్యాయి. అధిక సామర్థ్యం కలిగిన సీమాంతర విద్యుత్తు ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల్ని అభివృద్దిపరచడానికి భారత్‌లో ఒకటీ, నేపాల్‌లో ఒకటీ చొప్పున రెండు సంయుక్త సంస్థలను స్థాపించేందుకు ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
ప్రతిపాదిత సీమాంతర ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇనారువా (నేపాల్) - న్యూ పూర్ణియా (భారత్) 400 కేవీ డబల్ సర్క్యూట్ (క్వాడ్ మూస్) ట్రాన్స్‌మిషన్ లింక్‌తో పాటు లమ్కీ (దోదోధారా) (నేపాల్) - బరేలీ (భారత్) 400 కేవీ డబల్ సర్క్యూట్ (క్వాడ్ మూస్) ట్రాన్స్‌మిషన్ లింక్‌ల అభివృద్ధి పనులు కలిసి ఉన్నాయి. ఈ ట్రాన్స్‌మిషన్ కారిడర్లు సిద్ధమయ్యాక భారత్‌కూ, నేపాల్‌కూ మధ్య కరెంటు సరఫరాను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుతాయి. ప్రాంతీయ భద్రతను సుదృఢం చేస్తాయి. గ్రిడ్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. రెండు దేశాల్లోనూ దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందిస్తాయి.

దశాబ్దాల నాటి నుంచీ భారత్, నేపాల్‌ల మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, స్థిరాభివృద్ధితో పాటు ఇంధన భద్రత పట్ల ఉమ్మడి నిబద్ధతపై ఆధారపడి ఇంధన రంగంలోనూ పెరుగుతున్న సహకారాన్ని, ఇవాళ్టి సమావేశం మరింత బలపరిచింది.
***
(Release ID: 2183980)
Visitor Counter : 5