వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-ఈయూ ఎఫ్‌టీఏపై యూరోపియన్ వాణిజ్య, ఆర్థిక భద్రతా కమిషనర్‌తో వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి భేటీ
Posted On:
29 OCT 2025 9:31AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు బ్రసెల్స్‌లో పర్యటించారు. కొనసాగుతున్న భారత్-ఈయూ ఎఫ్‌టీయే సంప్రదింపులకు సంబంధించిన అపరిష్కృత అంశాలపై యూరోపియన్ వాణిజ్యం, ఆర్థిక భద్రత కమిషనర్ మారొస్ సెఫ్కోవిచ్ బృందంతో ఫలప్రదమైన చర్చలు నిర్వహించారు.
కమిషనర్ల బృందం ఫిబ్రవరి 2025లో చేపట్టిన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అందించిన దిశానిర్దేశానికి అనుగుణంగా భారత్-ఈయూ ఎఫ్‌టీఏను 2025 చివరి నాటికి పూర్తి చేయాలనే ఉమ్మడి నిబద్దతను ఉభయ పక్షాలు స్పష్టం చేశాయి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఉన్న దృఢమైన రాజకీయ నమ్మకం, వ్యూహాత్మక సంబంధాలను ప్రతిబింబించే.. ఇరు పక్షాల బాధ్యతలు, ప్రాధాన్యాలను గౌరవించే.. పరస్పరం ప్రయోజనకరమైన, సమతుల్యమైన, సమానమైన వాణిజ్య ఒప్పందాన్ని రూపొందించడంపై ఈ చర్చలో దృష్టి సారించారు.
భవిష్యత్తులో రెండు పక్షాల మధ్య వాణిజ్యాన్ని వేగవంతం చేసేందుకు సుంకాలు, నాన్-టారిఫ్ ఇబ్బందులను తొలగించడంలో, పారదర్శకమైన, నియంత్రణా విధానాలను రూపొందించడంలో ఎఫ్‌టీఏ సమతుల్యత పాటించాల్సిన ప్రాధాన్యాన్ని భారత్ గుర్తించింది.
అపరిష్కృత సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు చర్చలు జరిగాయి. నాన్ టారిఫ్ విధానాలు, కొత్త ఈయూ నియంత్రణలపై భారత్ వెలిబుచ్చిన సందేహాలపై కూడా చర్చించారు. చర్చల సమయంలో భారత దేశ కీలక డిమాండ్లపై ముఖ్యంగా శ్రామిక ఆధారిత రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం గురించి హెచ్‌సీఐఎం వివరించారు. సమస్యాత్మకం కాని పారిశ్రామిక టారిఫ్ విధానాలను ఖరారు చేయడానికి రెండు పక్షాలు అంగీకరించాయి. అలాగే అత్యధిక ప్రాధాన్యమున్న ఉక్కు, ఆటో, సీబీఏఎం,ఇతర ఈయూ నియంత్రణలకు సంబంధించిన అంశాలపై మరింత చర్చించేందుకు వారు అంగీకరించారు.
ఉమ్మడి ఆవిష్కరణలు, సమతుల్యమైన, సమానమైన, అర్థవంతమైన వాణిజ్యం, శాంతి-సంక్షేమం పట్ల ఉమ్మడి నిబద్ధత ద్వారా ఈ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా యూరోపియన్ యూనియన్‌తో కలసి పనిచేసేందుకు భారత్ ఎదురుచూస్తోంది. కొనసాగుతున్న చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే వారం యూఈ సాంకేతిక బృందం భారత్‌ను సందర్శిస్తుంది. ఈ బృందానికి వాణిజ్య డైరెక్టర్ జనరల్ నాయకత్వం వహిస్తారు. గడచిన రెండు రోజుల్లో గుర్తించిన సమర్థమైన పరిష్కారాల ఆధారంగా నిర్మాణాత్మక ముగింపును సాధించడమే లక్ష్యంగా ఈ పర్యటన జరుగుతుంది.
***
(Release ID: 2183731)
Visitor Counter : 6