రక్షణ మంత్రిత్వ శాఖ
కౌలాలంపూర్లో జరిగే 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం - ప్లస్‌కు హాజరు కానున్న రక్షణ మంత్రి
Posted On:
29 OCT 2025 10:05AM by PIB Hyderabad
మలేషియాలోని కౌలాలంపూర్లో 2025, నవంబర్ 1న జరిగే 12వ ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం - ప్లస్ (ఏడీఎంఎం - ప్లస్)కు రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ హాజరవుతారు. ‘‘ఏడీఎంఎం-ప్లస్ 15 ఏళ్ల ప్రయాణం అవలోకనం.. ముందుకు సాగాల్సిన మార్గాన్ని రూపొందించడం’’ అనే అంశంపై నిర్వహించే సదస్సులో ఆయన ప్రసంగిస్తారు. అలాగే మలేషియా అధ్యక్షతన జరిగే ఆసియాన్-ఇండియా రక్షణ మంత్రుల అనధికార సమావేశం రెండో సంచికలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఆసియాన్ సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొంటారు. ఆసియాన్ సభ్యదేశాలు, భారత్ మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, ‘యాక్ట్ ఈస్ట్ విధానాన్ని’ ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం లక్ష్యం.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడీఎంఎం-ప్లస్ దేశాల రక్షణ మంత్రులు, మలేషియా అగ్ర నాయకులతో రక్షణ మంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) లో అత్యున్నత స్థాయి రక్షణ సలహా, సహకార యంత్రాంగమే ఏడీఎంఎం. ఆసియాన్ సభ్యదేశాలు (బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావో పీడీఆర్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్లాండ్, తైమూర్ లెస్ట్, వియత్నాం) తో పాటుగా.. దాని ఎనిమిది చర్చా భాగస్వాములు (భారత్, యూఎస్, చైనా, రష్యా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) మధ్య రక్షణ, భద్రతా సహకారాన్ని బలోపేతం చేసే వేదికగా ఏడీఎంఎం-ప్లస్ పనిచేస్తుంది.
భారత్ 1992లో ఆసియాన్ చర్చల భాగస్వామిగా మారింది. ఏడీఎంఎం-ప్లస్ తొలి సమావేశం వియత్నాంలోని హనోయ్‌లో 2010 అక్టోబర్ 12న జరిగింది. 2017 నుంచి ఆసియాన్, చర్చా భాగస్వామ్య దేశాల మధ్య రక్షణ సహకారాన్ని విస్తరించేందుకు ఏటా ఏడీఎంఎం-ప్లస్ నిర్వహిస్తున్నారు.
ఏడీఎంఎం-ప్లస్ నియమాల ప్రకారం 2024-2027 కాలానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి మలేషియాతో కలసి భారత్ సహ-అధ్యక్షత వహిస్తోంది. ఆసియాన్-భారత్ నౌకాదళ విన్యాసాల రెండో సంచిక 2026లో జరగనుంది.
***
(Release ID: 2183729)
Visitor Counter : 5