రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతిని కలిసిన భారతీయ పోలీసు సేవా శిక్షణార్థులు
‘వికసిత్ భారత్’ నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న యువ అధికారుల నేతృత్వంలోని భవిష్యత్తు పోలీసు దళం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Posted On:
27 OCT 2025 2:24PM by PIB Hyderabad
“భారత పోలీసు సేవ 77వ రిక్రూట్ మెంట్ (2024 బ్యాచ్) శిక్షణార్థులు రాష్ట్రపతిని నేడు (అక్టోబర్ 27) రాష్ట్రపతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రొబేషన్‌లో ఉన్న అధికారులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ... ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని తెలిపారు. మన దేశ ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు, వేగవంతం చేయడం కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి మరింత పెట్టుబడులు అవసరమని ఆమె అన్నారు. ఏ రాష్ట్రం లేదా ప్రాంతంలోనైనా పెట్టుబడులను ఆకర్షించాలంటే శాంతి భద్రతలనేవి తప్పనిసరి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో సమర్థవంతమైన పోలీసింగ్ కూడా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. యువ అధికారుల నేతృత్వంలోని భవిష్యత్తు పోలీస్ బలగం వికసిత భారత్ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
యువ అధికారులు, అధికారం, అధికార స్థాయిలను చేపడతారు కాబట్టి.. అధికారంతో పాటు బాధ్యత కూడా వస్తుందని వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. వారి చర్యలు, ప్రవర్తన ఎప్పుడూ ప్రజల పరిశీలనలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఎప్పుడూ లాభదాయకమైనది కాకుండా, నైతికమైనదాన్ని ఎంచుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.. అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించేటప్పుడు కూడా న్యాయమైన విధానాలను అనుసరించాలని చెప్పారు. అధికారులు చట్టాలు, వ్యవస్థల ద్వారా ఎన్నో అధికారాలు పొందినప్పటికీ.. నిజమైన అధికారం వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమగ్రత నుంచే వస్తుందని తెలిపారు. నైతిక ఆధికారమే వారికి అందరి గౌరవం, నమ్మకాలను తెస్తుందని రాష్ట్రపతి స్పష్టం చేశారు.
ఒక పోలీసు అధికారి తరచూ నేరాలు, నేరస్థులతో వ్యవహరించాల్సి వస్తుందని.. ఇది కొన్నిసార్లు వారిలో సానుభూతిని తగ్గించి, మానవత్వాన్ని మసకబార్చే ప్రభావాన్ని చూపవచ్చని రాష్ట్రపతి పేర్కొన్నారు. సమర్థవంతమైన అధికారిగా మారే క్రమంలో వారు తమలోని కరుణ, మానవతా స్వభావాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆమె అధికారులకు సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్ రంగాన్ని గణనీయంగా మార్చేసిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దాదాపు పది సంవత్సరాల క్రితం ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉండేదని, కానీ నేడు అది పౌరులకు భయంకరమైన ముప్పుగా మారిందని ఆమె తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ వినియోగదారుల్లో భారత్ ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈ మార్పు పోలీసింగ్ వ్యవస్థపైనా ప్రభావం చూపనుందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సాంకేతికతలను, ముఖ్యంగా ఏఐని స్వీకరించడంలో తప్పుడు ఉద్దేశంతో ఉపయోగించే వ్యక్తుల కంటే ఐపీఎస్ అధికారులు ముందుండాలని ఆమె సూచించారు.
***
(Release ID: 2183069)
Visitor Counter : 10