వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో జాతీయ వ్యవసాయ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయ విద్యార్థులతో కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఫలప్రద చర్చ
మెరుగైన వ్యవసాయ విద్య బోధన కోసం ఉద్యోగ ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని
కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ ఆదేశం
ఈ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ
లేఖలు పంపనున్న కేంద్ర మంత్రి
వ్యవసాయ విద్యార్థుల భవిత విషయంలో ఎట్టి స్థితిలోనూ రాజీ పడకూడదు: శ్రీ శివ్‌రాజ్ సింగ్
నాణ్యమైన వ్యవసాయ విద్యను అందించడం
దేశానికి అత్యంత కీలకం: శ్రీ శివ్‌రాజ్ సింగ్
లోపాలను అధిగమించేలా చక్కని సూచనలను ఇచ్చేందుకు
వ్యవసాయ విద్యార్థులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని
ఐసీఏఆర్‌కు శ్రీ శివ్‌రాజ్ సింగ్ ఆదేశం
‘‘ఆరోగ్యకరమైన పోటీకి వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల వర్గీకరణ జరగాలి: శ్రీ శివ్‌రాజ్ సింగ్
ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ పద్ధతులను ఐసీఏఆర్ పరిశీలించి,
మన దేశంలో తగిన చర్యలు తీసుకోవాలి: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
Posted On:
27 OCT 2025 4:02PM by PIB Hyderabad
జాతీయ వ్యవసాయ విద్యార్థుల సమావేశాన్ని ఈ రోజు న్యూఢిల్లీలోని పూసాలో నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల వ్యవసాయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. వేల మంది విద్యార్థులు దృశ్య మాధ్యమం సాయంతో దీనిలో భాగం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయాల వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి దృశ్య మాధ్యమం సాయంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

వ్యవసాయ రంగంలో పరిశోధననూ, ఆధునిక సాంకేతికతలనూ, నవకల్పననూ, సాంకేతిక బదిలీని ప్రోత్సహించే ధ్యేయంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ విద్య స్థాయిని ఇప్పటి కన్నా మెరుగుపరిచి, యువ ప్రతిభావంతులలో స్ఫూర్తిని రగిలిస్తూ, వారు చురుకుగా పాల్గొనేలా పరిశోధన కార్యక్రమాల్ని తీర్చిదిద్దాలని సమావేశంలో తీర్మానించారు.
వ్యవసాయ విద్యాసంస్థల్లో చాలా ఉద్యోగాలు భర్తీకాకుండా ఉన్నందుకు శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ తన ప్రసంగంలో ఆందోళన వ్యక్తం చేశారు. చక్కని విద్యను విద్యార్థులకు అందించే ఉద్దేశంతో ఈ ఖాళీలను భర్తీ చేసే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌ను ఆయన ఆదేశించారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోనూ, కళాశాలల్లోనూ ఉద్యోగ ఖాళీలను త్వరగా భర్తీ చేసే చర్యలు తీసుకొనేలా ముఖ్యమంత్రులందరికీ తాను లేఖలు రాస్తాననీ, ఈ విషయంపై వ్యవసాయ మంత్రులతోనూ చర్చిస్తాననీ కేంద్ర మంత్రి ప్రకటించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజీ పడకూడదని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేస్తూ, దేశంలో అత్యున్నత నాణ్యతతో కూడిన వ్యవసాయ విద్యను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత సవాళ్లను అధిగమించేలా విద్య బోధనతో పాటు సంస్థాగత ఏర్పాట్లకు మెరుగులు దిద్దడానికి వ్యవసాయ విద్యార్థుల నుంచి కొత్త కొత్త ఆలోచనలను రాబట్టేందుకు ఒక విద్యార్థి బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఐసీఏఆర్‌ను శ్రీ చౌహాన్ ఆదేశించారు.

ఆరోగ్యదాయక పోటీని ప్రోత్సహించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో పాటు కళాశాలలను వర్గీకరించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ పద్ధతులను పరిశీలించి వాటిని మన దేశంలో ఎలా అనుసరించగలమో ఆలోచించాల్సిందిగా ఐసీఏఆర్‌ను ఆయన కోరారు. ‘‘మనం వ్యవసాయంతో పాటు పల్లెలను కలిపి అభివృద్ధి చేస్తే, వలసలు ఆగిపోతాయి. ఇది కూడా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడమే’’ అని ఆయన అన్నారు. ‘‘మనం స్వయం సమృద్ధి సాధనకు శ్రమించి తీరాలి. అది జరిగిన నాడు, భారత ప్రగతి మరే ఇతర దేశంపైనా ఆధారపడబోదు. వ్యవసాయం వర్ధిల్లకపోతే అభివృద్ధి చెందిన, స్వయంసమృద్ధి యుక్త భారత్‌ను ఆవిష్కరించలేం’’ అని ఆయన తేల్చిచెప్పారు.
ప్రతిదీ అభ్యాస పూర్వకంగా తెలుసుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని శ్రీ చౌహాన్ సూచించారు. నేరుగా విషయాలను తెలుసుకోవడానికి విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒక్కసారైనా పంటపొలాల వద్దకు వెళ్లి, రైతులకు ఎదురవుతున్న సవాళ్లపై అవగాహన ఏర్పరుచుకోవాలని ఆయన చెప్పారు. రైతుల సమస్యలకు విద్యార్థులు పరిష్కారాలను ఆలోచించడంతో పాటు దేశ వ్యవసాయ రంగం రూపురేఖలలో గణనీయ మార్పులు తెచ్చేందుకు తమ వంతు పాటుపడాలని ఆయన అన్నారు.
సమాజానికి ప్రయోజనాత్మక సేవలు అందించండంటూ విద్యార్థులను కేంద్ర మంత్రి ప్రోత్సహించారు. ‘‘వ్యవసాయ విద్యార్థులు సీదాసాదా జీవనంతో తృప్తి పడిపోకూడదు. వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, జీవనాన్ని సార్థకం చేసుకోవాలి. ఇతరులకు అండగా నిలబడితేనే సిసలైన జీవనానికి అర్థం’’ అని కేంద్ర మంత్రి ఉద్బోధించారు.
ఐసీఏఆర్‌కు చెందిన విద్య విభాగం, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ)లు కలిసి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయ మంత్రితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. వారు ఆసక్తిదాయక చర్చలు నిర్వహించారు. విద్యార్థులు ఈ సందర్భంగా తమ అనుభవాన్ని పంచుకోవడమే కాక కొత్త సాంకేతికతలను కూడా ప్రస్తావించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవడంలో తమ వంతుగా పాటుపడతామంటూ నిబద్ధతను పునరుద్ఘాటించారు. వారు చెప్పిన సమస్యలను శ్రీ చౌహాన్ సావధానంగా విని, తగిన చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిత వెలుగులీనాలని ఆయన కోరుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 2183062)
Visitor Counter : 7