చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
‘ఎల్ఐఎంబీఎస్’ను (లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్) ‘పీఎఫ్ఎంఎస్’తో (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) విజయవంతంగా అనుసంధానించడం ద్వారా విధానపరమైన సరళీకరణలో కీలక ఘట్టానికి చేరుకున్న న్యాయ వ్యవహారాల విభాగం
ఢిల్లీ హైకోర్టుతో పాటు ఇతర న్యాయ సంస్థలకు ఈ-బిల్ మాడ్యూల్‌ను అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న న్యాయ వ్యవహారాల విభాగం
దస్త్రాల ఆధారిత ప్రక్రియ నుంచి పూర్తి డిజిటల్ రూపంలో చేపట్టే ఈ- బిల్ వ్యవస్థకు మార్పు
పూర్తి స్థాయి డిజిటల్ వ్యవస్థల ఉపయోగం ద్వారా న్యాయ సంబంధిత చెల్లింపు ప్రక్రియలను సులభతరం చేస్తోన్న న్యాయ వ్యవహారాల విభాగం
Posted On:
25 OCT 2025 9:57AM by PIB Hyderabad
స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కింద సామర్థ్యం, పారదర్శకత, డిజిటల్ పాలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో న్యాయ శాఖకు చెందిన న్యాయ వ్యవహారాల విభాగం (డీఎల్ఏ).. ‘ఎల్ఐఎంబీఎస్’ను (లీగర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్) ‘పీఎఫ్ఎంఎస్’తో (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ) అనుసంధానించడం ద్వారా విధానపరమైన సరళీకరణలో ఒక కీలక ముందడుగు వేసింది. న్యాయవాది ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి డిజిటల్‌గా మారేందుకు ఈ సంస్కరణ ఉపయోగపడనుంది. ఇది వ్యాపార సౌలభ్యం, డిజిటల్ ఇండియా అనే ప్రభుత్వ విస్తృత కార్యక్రమాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.
గతంలో న్యాయవాదులకు ఫీజు చెల్లించే ప్రక్రియ భౌతికంగా ఉండేది. ప్రత్యక్ష తనిఖీ, పే - అకౌంట్స్ కార్యాలయానికి హార్డ్ కాపీలను సమర్పించటం వంటివి ఇందులో భాగంగా ఉండేవి. దీని ఫలితంగా తరచుగా ఆలస్యం జరిగేది. అంతేకాకుండా దస్త్రాల ఆధారంగా పనిచేయాల్సి వచ్చేది. మెరుగుపరిచిన ఈ-బిల్ మాడ్యూల్ ద్వారా ఇప్పుడు న్యాయాధికారులు, న్యాయవాదులకు ఫీజు చెల్లించే పూర్తి ప్రక్రియను ఎలక్ట్రానిక్ రూపంలో చేయచ్చు. పాత వ్యవస్థలో ఉన్న దస్త్రాల పని, జాప్యాలను ఇది తొలగిస్తుంది. ఇది మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో డిజిటల్ రికార్డుల భద్రతను బలోపేతం చేయటంతో పాటు చెల్లింపుల్లో ఏకరూపతను తీసుకొచ్చి.. సకాలంలో ప్రక్రియను పూర్తి చేసి, చెల్లింపులు జరిగేలా చూసుకుంటుంది.
ఈ-బిల్ మాడ్యూల్‌తో వచ్చిన మార్పులతో ఎల్ఐఎంబీఎస్ ప్లాట్‌ఫామ్‌లో న్యాయాధికారులు, న్యాయవాదులు రూపొందించిన బిల్లులు ఇప్పుడు డిజిటల్ పరిశీలన, మంజూరు, చెల్లింపు కోసం పీఎఫ్ఎంఎస్‌కు అందుతాయి. ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం, బిల్లులను ప్రత్యక్షంగా ట్రాక్ చేయటం, మానవ తప్పిదాలను తొలగించడం వంటి చర్యలతో ఈ ఏకీకరణ.. మొత్తం ప్రక్రియను కాగిత రహితంగా చేసింది. ప్రతి చెల్లింపు క్లెయిమ్‌కు సీఆర్ఎన్ (క్లెయిమ్ రిఫరెన్స్ నంబరు) ఉంటుంది. దీని ద్వారా పరిపాలన యంత్రాంగం ప్రత్యక్షంగా పురోగతిని తెలుసుకోవచ్చు. డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్) ధ్రువీకరించి, డిజిటల్‌గా సంతకం చేసిన తర్వాత.. భౌతికంగా ఎలాంటి దస్త్రాలు లేకుండానే పీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి.
ఎల్ఐఎంబీఎస్ ద్వారా న్యాయవాదులు చెల్లింపుల కోసం న్యాయ వ్యవహారాల విభాగంలోని సీఏఎస్ (సెంట్రల్ ఏజెన్సీ సెక్షన్) ఫిబ్రవరి 2025లోనే ఈ-బిల్ మాడ్యూల్‌ను ఉపయోగించటాన్ని ప్రారంభించింది. ఈ వ్యవస్థను ఢిల్లీ హైకోర్టుతో సహా ఇతర న్యాయ సంస్థలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. న్యాయాధికారుల కాలానుగుణ చెల్లింపుల కోసం ఎల్ఐఎంబీఎస్‌లో రిటైనర్ ఫీజు మాడ్యూల్‌ను రూపొందించే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తోంది.
ఈ ఏకీకరణ వల్ల డిజిటల్ పాలన బలోపేతం అవుతుంది. దీనితో పాటు వేగం, సామర్థ్యం మెరుగుపడుతుంది. జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే ఈ వ్యవస్థ పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న ఏకరూపత చట్టపరమైన రుసుముల చెల్లింపు ప్రక్రియల ప్రామాణీకరణను కూడా సులభతరం చేస్తుంది. అంతర్గత ప్రభుత్వ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ పరివర్తనను ప్రోత్సహించడం, సామర్థ్యాన్ని పెంపొందించటం ద్వారా పౌరుల కేంద్రీకృతంగా సేవలను మెరుగుపరచడం ద్వారా ఇది స్పెషల్ క్యాంపెయిన్ 5.0 లక్ష్యాలకు ప్రత్యక్షంగా దోహదపడుతోంది.
భౌతిక విధానాలను తొలగించడం, పని తీరును ప్రామాణీకరించడం ద్వారా న్యాయ వ్యవహారాల విభాగం.. ఈ సంస్కరణను ఇతర న్యాయ సంబంధిత రుసుం చెల్లింపులకు విస్తరిస్తూనే ఉంటుంది. ఇది 2047 వికసిత్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉంది.
***
(Release ID: 2182556)
Visitor Counter : 4