రక్షణ మంత్రిత్వ శాఖ
ఏ సవాలునైనా తిప్పికొట్టేందుకు భారత్ సదా సన్నద్ధంగా ఉందన్న సందేశాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి అందించింది: నావికాదళ కమాండర్ల సమావేశంలో రక్షణ మంత్రి
· పాకిస్తాన్ తన తీరాన్ని దాటలేని పరిస్థితిని భారత నావికాదళం సృష్టించింది... మన నావికాదళ కార్య సన్నద్ధత, సమర్థత, శక్తి ప్రపంచానికి తెలిశాయన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్
· “హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారత నావికాదళం ఉనికి మిత్ర దేశాలకు ఊరట, అస్థిరపరచాలనుకునే కుట్రదారులకు వ్యాకులత”
· “దేశ స్వావలంబన, ఆవిష్కరణ, పారిశ్రామికాభివృద్ధిలో మార్గదర్శకంగా మన నావికాదళం”
· “నేటి యుద్ధాలను ఎదుర్కోవాలంటే వ్యూహ రూపకల్పన, అత్యాధునిక పరికరాలను సమకూర్చుకునేందుకు సమాన ప్రాధాన్యమివ్వాలి”
Posted On:
23 OCT 2025 5:42PM by PIB Hyderabad
“ఆపరేషన్ సిందూర్ భారతదేశ సంకల్ప శక్తికి, సామర్థ్యానికి చిహ్నం. ఏ సవాలునైనా తిప్పికొట్టేందుకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నామన్న సందేశాన్ని ప్రపంచానికిచ్చింది” అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2025 అక్టోబర్ 23న న్యూ ఢిల్లీలో జరిగిన నావికా దళ కమాండర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. పాకిస్థాన్‌ను ఓడరేవుకు, ఆ దేశ తీరానికే పరిమితమయ్యే పరిస్థితి కల్పించిన భారత నావికాదళాన్ని ప్రశంసించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా మన నావికాదళ కార్యసన్నద్ధత, నైపుణ్య సామర్థ్యాలు, శక్తులను ప్రపంచమంతా చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారత నావికాదళ ఉనికి ‘మిత్ర దేశాలకు ఊరట’ అని, ‘ఈ ప్రాంతాన్ని అస్థిరపరచాలనుకునే వారికి వ్యాకులత’ అని అన్నారు.
“సమకాలీన భౌగోళిక రాజకీయాలకు హిందూ మహాసముద్ర ప్రాంతం కేంద్రంగా మారింది. ఇది ఇకపై అస్సలు నిష్క్రియాత్మకం కాదు.. పోటీకి, సహకారానికి ఈ ప్రాంతం నిలయమైంది. భారత నావికాదళం తన బహుముఖ సామర్థ్యాల ద్వారా ఈ ప్రాంతంలో నాయకత్వ పాత్ర పోషించింది. గత ఆరు నెలల్లో మన నౌకలు, జలాంతర్గాములు, నావికాదళ ఎయిర్ క్రాప్టులను మునుపెన్నడూ లేని స్థాయిలో మోహరించాం. అంతేకాకుండా దాదాపు 1.2 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు, 5.6 బిలియన్ డాలర్ల వరకు వాణిజ్య విలువ కలిగిన దాదాపు 335 వాణిజ్య నౌకలకు మన నావికాదళం సురక్షిత మార్గాన్ని అందించింది. నేడు అంతర్జాతీయ నౌకా ఆర్థిక వ్యవస్థలో విశ్వసనీయ, సమర్థ భాగస్వామిగా భారత్ నిలిచిందనేందుకు ఇదే నిదర్శనం” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
‘‘స్వావలంబనతో కూడిన నావికాదళమే.. ఆత్మవిశ్వాసం గల, శక్తిమంతమైన దేశానికి పునాది’’ అని రక్షణ మంత్రి అభివర్ణించారు. దేశీయ పరికరాల ద్వారా సామర్థ్యాలను పెంచుకుని, ఆత్మనిర్భర భారత పతాకధారిగా ఆవిర్భవించిన మన నావికాదళాన్ని ఆయన ప్రశంసించారు. “గత పదేళ్లలో నావికాదళ పరికరాల కొనుగోలు ఒప్పందాల్లో దాదాపు 67 శాతం భారతీయ పరిశ్రమలతోనే జరిగాయి. మనం ఇకపై దిగుమతులపైనే ఆధారపడి లేమని ఇది రుజువు చేస్తోంది. మనం సొంత ప్రతిభపై, ఎంఎస్ఎంఈలూ అంకుర సంస్థల సామర్థ్యాలపై ఆధారపడుతున్నాం. ప్రస్తుతం ఐడెక్స్, టీడీఎఫ్, స్ప్రింట్, మేకిన్ ఇండియా కింద 194 ఆవిష్కరణ, దేశీయీకరణ ప్రాజెక్టులపై భారత నావికాదళం పనిచేస్తోంది. ఈ కార్యక్రమాలు సాంకేతిక స్వావలంబనతో నావికాదళాన్ని తీర్చిదిద్దడమే కాకుండా.. ప్రైవేటు పరిశ్రమలు, యువ ఆవిష్కర్తలను కూడా ఈ మిషన్‌లో భాగం చేశాయి” అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
ప్రస్తుత యుద్ధాలు సాంకేతికత, నిఘా ఆధారితమైనవిగా పేర్కొంటూ.. రక్షణ, దేశీయ ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆత్మనిర్భరతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోందని రక్షణ మంత్రి పునరుద్ఘాటించారు. “నావికా సంసిద్ధత ఇకపై ఓడలు లేదా జలాంతర్గాములకే పరిమితం కాదు. సాంకేతి ప్రాతిపదిక గల, నెట్‌వర్క్ కేంద్రీకృత, స్వయంప్రతిపత్త వ్యవస్థలపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రత్యర్థుల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ రంగాల్లో మన సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. మనకు శక్తి సామర్థ్యాలున్నాయి. సొంతగడ్డపైనే మనం పరికరాలను తయారు చేసుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర భారత్ ద్వారా భారత నావికాదళం రక్షణపరమైన ఉత్పత్తిలో నిమగ్నమై ఉండటమే కాకుండా, దేశ పురోగతికి కూడా గణనీయంగా దోహదపడుతోందని రక్షణ మంత్రి ప్రశంసించారు. “నేడు మన నావికాదళం దేశ స్వావలంబన, ఆవిష్కరణ, పారిశ్రామికాభివృద్ధిలో మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి ఓడ, జలాంతర్గామి అభివృద్ధితో ఓ కొత్త ఉద్యోగావకాశం కలుగుతోంది. ప్రతి ఇంజిన్ ఓ కొత్త నైపుణ్యాన్ని అందిస్తోంది. ప్రతీ దేశీయ వ్యవస్థతో భారత ఆధీనత తగ్గుతోంది. 75 శాతానికి పైగా దేశీయ భాగాలే ఉన్న ప్రాజెక్ట్ 17ఏ నౌకలతో ఎండీఎల్, జీఆర్ఎస్ఈ వంటి నౌకా నిర్మాణ కేంద్రాల్లో దాదాపు 1.27 లక్షల ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. నావికా దళ ప్రతీ ప్రాజెక్టు భద్రతతోపాటు ఆర్థిక వ్యవస్థతో, యువత ఉపాధితో ముడిపడి ఉందనేందుకు ఇది రుజువు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంఎస్ఎంఈలు, చిన్న షిప్‌యార్డులతో భారత నావికాదళ సహకారం గణనీయంగా పెరుగుతోందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇటీవల యార్డ్ క్రాఫ్టుల నిర్మాణం కోసం దాదాపు రూ.315 కోట్ల విలువైన కాంట్రాక్టులను ఇచ్చినట్టు తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ దార్శనికతతో వేసిన భారీ ముందడుగు ఇది అన్నారు. “తన వైమానిక రంగంలో స్వావలంబన దిశగా నావికాదళం అనేక ఆవిష్కరణలు చేసింది. మల్టీరోల్ నౌకా పర్యవేక్షణ ఎయిర్ క్రాఫ్ట్, బహుళార్థక ఉపయోగాలున్న హెలికాప్టర్లు, రెండు ఇంజిన్లున్న డెక్ ఫైటర్లు, నావికా దళ నౌకలపై ఉన్న మానవ రహిత వైమానిక వ్యవస్థల వంటి ప్రాజెక్టులు మన దేశీయ విమానయాన పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇది కీలకమైన సామర్థ్య అంతరాలను భర్తీ చేయడమే కాకుండా, స్వావలంబననూ బలోపేతం చేస్తుంది” అని ఆయన అన్నారు.
ప్రస్తుత యుద్ధాలను ఎదుర్కోవాలంటే వ్యూహాల రూపకల్పనతోపాటు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకోవడానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “కేవలం పరికరాలు, యుద్ధనౌకలతో ఏ దేశమూ యుద్ధంలో గెలవలేదు. సాంకేతికత మనకో ఆధిక్యాన్నిస్తుంది. కానీ భౌగోళిక వ్యూహాలు, యుక్తి, సమయస్ఫూర్తి, మన నిర్ణయాలను ఎల్లప్పుడూ ఓ వ్యూహాత్మక చట్రంగా పరిగణించాలి. నౌకల పరిమాణం, ఆధునికీకరణ ముఖ్యమైనవే. కానీ, వేదికలను వ్యూహాత్మకంగా ఉపయోగించడం కూడా అంతే కీలకం. ప్రణాళికలో చురుకుదనం, అనుకూలత చాలా కీలకం” ఆయన పేర్కొన్నారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంతోపాటు నౌకాదళ వ్యూహం, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లడం ఆవశ్యకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. “మూడు రంగాల్లో మనం కలిసి పనిచేయాలి: సమర్థత, వ్యక్తులు, భాగస్వామ్యాలు. సామర్థ్యం అంటే సాంకేతికత, శక్తి. వ్యక్తులంటే నావికులు, వారి కుటుంబాలు. భాగస్వామ్యాలు అంటే పరిశ్రమలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సహకారం. ఈ మూడూ కలిస్తే మన నావికాదళం మరింత విశ్వసనీయమైనదిగా, శక్తిమంతమైనదిగా ఆవిర్భవిస్తుంది” అని రక్షణ మంత్రి అన్నారు.
త్రివిధ దళాల ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్, నావికా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, డీడీఆర్డీ కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్, నౌకాదళ కమాండర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ నాయకత్వం, అధికారులతో సన్నిహిత సంభాషణకు, ప్రస్తుత భౌగోళిక-వ్యూహాత్మక వాతావరణంలో వివిధ సవాళ్ల పరిష్కారం పట్ల భారత నావికాదళ దృక్పథాన్ని మెరుగుపరిచేందుకు ఓ వేదికగా ఈ సమావేశం ఉపయోగపడుతుంది. పశ్చిమ, తూర్పు సముద్ర తీరాల్లో కార్యాచరణ సంసిద్ధతను నావికాదళ అత్యున్నత నాయకత్వం సమీక్షిస్తోంది. మేకిన్ ఇండియా పథకం కింద దేశీయీకరణ, ఆవిష్కరణలకు ఊతమిస్తోంది. ప్రభుత్వ మహాసాగర్ (అన్ని ప్రాంతాల భద్రత కోసం పరస్పర, సమగ్ర పురోగతి) లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ.. హిందూ మహాసముద్ర ప్రాంతం, ఇండో- పసిఫిక్‌లో భారత నావికాదళాన్ని ప్రాధాన్య భద్రతా భాగస్వామిగా నిలుపుతోంది.
***
(Release ID: 2182039)
Visitor Counter : 6