వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్, జర్మనీ భాగస్వామ్యం బలోపేతం: జర్మన్ ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి శ్రీమతి కేధరినా రిచేతో భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భేటీ

Posted On: 23 OCT 2025 8:56PM by PIB Hyderabad

భారత  వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, 23 అక్టోబర్ 2025న బెర్లిన్‌లో జర్మన్ ఫెడరల్ ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి శ్రీమతి కేధరీనా రిచేతో  సమావేశమయ్యారు. ఈ ఏడాది ఆగస్టు ఏడవ తేదీన జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయం మేరకు వారి సమావేశం జరిగింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, హరిత ఇంధనం,  నైపుణ్య రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు ప్రధానంగా చర్చించారు. జర్మనీ ఫెడరల్ చాన్సెలరీలో ఆర్థిక, ద్రవ్య విధాన సలహాదారు, జర్మనీ జీ7, జీ 20 షెర్పా డాక్టర్ లెవిన్ హోలేతో కూడా శ్రీ గోయల్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వారు చర్చించారు.

 

అనంతరం శ్రీ గోయల్ భారత రాయబార కార్యాలయంలో జర్మన్ మిట్టెల్ స్థాండ్ కంపెనీల సీఈఓలు,  నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు భారత్ లో వ్యాపారం చేయడానికి,  ఇప్పటికే ఉన్న పెట్టుబడులను విస్తరించడానికి తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. భారతదేశం అందిస్తున్న అవకాశాలను, పెట్టుబడులను, వ్యాపారాలను సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శ్రీ గోయల్ వారికి వివరించారు. చర్చల సందర్భంగా ఆవిష్కరణ, సుస్థిరత,  ఆధునిక తయారీ రంగాలలో సమన్వయం, పరస్పర వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశాలను పరిశీలించారు.

 

ఈ పర్యటనలో భాగంగా, శ్రీ గోయల్ లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ జావియర్ బెట్టెల్ ను కలవనున్నారు. ఇన్‌ఫినియన్ టెక్నాలజీస్, షాఫ్‌లర్ గ్రూప్, రెంక్, హెరెన్‌క్నెక్ట్ ఏజీ, ఎనర్‌ట్రాగ్ ఎస్ఈ,  మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ వంటి ప్రముఖ జర్మన్ కంపెనీల సీఈఓలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు.

అక్టోబర్ 24న కూడా శ్రీ గోయల్ పర్యటన కొనసాగుతుంది. ఆయన బెర్లిన్ గ్లోబల్ డైలాగ్  ప్యానెల్ చర్చలో పాల్గొంటారు. జర్మనీ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో మరిన్ని సమావేశాలు జరుపుతారు.

 

***


(Release ID: 2182036) Visitor Counter : 7