రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 20,000 కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారులపై నెట్‌వర్క్ సర్వే వాహనాలలు మోహరించనున్న ఎన్‌హెచ్‌ఏఐ

Posted On: 22 OCT 2025 5:31PM by PIB Hyderabad

జాతీయ రహదారులపై వాహనదారుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఎన్‌హెచ్‌ఏఐ దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో 20,933 కిలోమీటర్ల విస్తీర్ణంలో నెట్‌వర్క్ సర్వే వాహనాలను మోహరించనుంది. ఇవి జాతీయ రహదారుల భాగాలపై రహదారి జాబితా, రోడ్డు ఉపరితల స్థితిని సేకరించడానికి, ప్రాసెస్ చేయడానికి, విశ్లేషించడానికి వినియోగపడతాయి. రహదారి ఉపరితలంపై పగుళ్లు, గుంతలు, అతుకులు వంటి  లోపాలు, ఎన్‌ఎస్‌వీ సర్వేల ద్వారా సేకరించిన డేటా ఆధారంగా బయటపడతాయి. దీంతో జాతీయ రహదారుల మెరుగైన నిర్వహణ కోసం ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు తీసుకుంటుంది.

ఎన్‌ఎస్‌వీ సర్వే ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్‌హెచ్‌ఏఐ  ‘డేటా లేక్’ అనే కృత్రిమ మేధా ఆధారిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తుంది. అక్కడ ఉన్న నిపుణుల బృందం ఈ సమాచారాన్ని విశ్లేషించి, ఉపయోగకరమైన సమాచారం, కార్యాచరణ సూచనలు రూపొందిస్తారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి క్రమం తప్పకుండా సేకరించిన సమాచారాన్ని భవిష్యత్తు సాంకేతిక ప్రయోజనాల కోసం రోడ్డు అసెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో‌ (ఆర్‌ఏఎంఎస్‌) నిర్దిష్ట ఫార్మాట్లలో భద్రపరచాలి.

ఈ సర్వేలు 3డీ లేజర్ ఆధారిత ఎన్‌ఎస్‌వీ సిస్టమ్ ద్వారా జరుగుతాయి. ఇవి హై రెజల్యూషన్ 360 డిగ్రీ కెమెరాలు, డిఫరెన్షియల్ జీపీఎస్,ఇనెర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్, డిస్టెన్స్ మెజరింగ్ ఇండికేటర్ సహయాంతో  మానవ జోక్యం లేకుండానే రహదారి లోపాలను గుర్తించి నివేదించగలవు. ఈ వాహనాలలో ఉన్న అధునాతన సాఫ్ట్‌వేర్ ద్వారా రహదారి డేటా ఖచ్చితంగా సేకరించవచ్చు. ఈ వాహనాల్లో అనేక విధాల డేటా సేకరణ, ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ అమర్చబడి ఉంటుంది. వీటి సహాయంతో రోడ్డు మౌలిక వివరాలు,  ఉపరితల స్థితి డేటాను ఖచ్చితంగా కొలిచి, నివేదిక రూపంలో అందించవచ్చు .వివిధ లైన్ల ప్రాజెక్టుల ప్రారంభానికి ముందు ఎన్‌ఎస్‌వీ ద్వారా ప్రమాణిత డేటా సేకరణ జరుగుతుంది. ప్రతి ఆరు నెలలకొకసారి పునఃసర్వేలు నిర్వహించి పేవ్‌మెంట్ పరిస్థితుల డేటాను అప్‌డేట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఎన్‌హెచ్‌ఏఐ అర్హత కలిగిన కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానించింది.

నెట్‌వర్క్ సర్వే వాహన వ్యవస్థ (ఎన్ఎస్ వీ)   దేశ జాతీయ రహదారుల నిర్వహణ కోసం రూపొందించిన ఒక ప్రత్యేక  మౌలిక సదుపాయాల నిర్వహణ సాధనం. ఇందులో అధునాతన సెన్సార్లు, డేటా సేకరణ పద్ధతులు గల వాహనాలు ఉంటాయి. ఇవి జాతీయ రహదారుల స్థితి, జాబితా సంబంధిత డేటాను సేకరించగల సామర్థం కలిగి ఉన్నాయి. ఈ డేటా ద్వారా రోడ్డు ఉపరితల స్థితి నిర్వహణ, ఆస్తి నిర్వహణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనివల్ల దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల భద్రత సామర్థ్యం మెరుగుపడుతుంది.

 

***


(Release ID: 2181825) Visitor Counter : 8