రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్


ప్రయాణీకులు సురక్షితంగా, సకాలంలో గమ్యాలకు చేరుకోవడంలో రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న 12 లక్షలమంది రైల్వే ఉద్యోగులు

గత 20 రోజుల్లో, కోటిమందికి పైగా ప్రయాణీకులకు సేవలు అందించిన 4211 ప్రత్యేక రైళ్లు: పండుగ రద్దీని తగ్గించేందుకు మరో 7800 రైళ్లు

కేవలం ఢిల్లీ ప్రాంతం నుంచే రోజూ సగటున 4.25 లక్షలమంది ప్రయాణం

ప్రయాణికుల రద్దీపై సమర్థమైన అంచనాతో రైళ్ల నిర్వహణ సజావుగా కొనసాగేందుకు రైల్ భవన్‌తో పాటు అన్ని జోన్లు, విభాగాల్లో ప్రత్యేక వార్ రూమ్‌ల ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ

పండుగ రద్దీ సమయంలో ప్రజలకు సేవలందించడంలో భారతీయ రైల్వేల మానవీయ దృష్టి: ప్రత్యేక నిరీక్షణ వసతులతో పాటు ఎం - యూటీలు సహా అదనపు టికెట్ కౌంటర్లు, మంచినీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్ల
ఏర్పాటు

పండుగ ప్రయాణ ఏర్పాట్లను మెరుగుపరిచినందుకు భారతీయ రైల్వేలకు ప్రయాణికుల ప్రశంస: రిజర్వేషన్ లేని కోచ్‌లలో కూడా సౌకర్యవంతమైన ప్రయాణాలు

Posted On: 21 OCT 2025 8:21PM by PIB Hyderabad

రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్  ఈరోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ప్రస్తుత పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికుల కోసం రైల్వేలు చేసిన ఏర్పాట్లను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం శ్రీ అశ్విని వైష్ణవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులు   పగలు, రాత్రి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.  ప్రత్యేక రైళ్ల ద్వారా ఇప్పటికే  కోటిమందికి పైగా ప్రయాణీకులకు సేవలు అందించామని ఆయన తెలిపారు. 

ఒక్క ఢిల్లీ ప్రాంతం నుంచే సగటున  రోజుకు సుమారు 4.25 లక్షల మంది ప్రయాణిస్తున్నారని రైల్వే మంత్రి తెలిపారు. సూరత్, ముంబై, కోయంబత్తూర్, హైదరాబాద్,  బెంగళూరు వంటి ప్రధాన స్టేషన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అంతేకాకుండా ప్రయాణంలో ఉన్న రైళ్ల సమయాన్ని కూడా నిశితంగా ట్రాక్ చేస్తున్నామని ఆయన చెప్పారు.  ప్రతి డివిజన్,  జోన్‌ లో  అంకిత భావం కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక  వార్ రూమ్ ద్వారా నిరంతర  పర్యవేక్షణ జరుగుతోందని పేర్కొన్నారు. 

ప్లాట్‌ఫామ్ నెంబర్ వన్ పై ఉన్న  రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) కంట్రోల్ రూమ్‌ను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ కంట్రోల్ రూమ్ మొత్తం స్టేషన్‌ను పర్యవేక్షిస్తుంది. అక్కడ ఆయన క్షేత్ర స్థాయి ఏర్పాట్లపై ప్రయాణీకులతో మాట్లాడారు. ప్రాథమిక ఆరోగ్య గదిని  కూడా సందర్శించి, విధుల్లో ఉన్న వైద్యులతో సంభాషించారు. 

 

 

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నెం. 16 పై ఉన్న పట్నాకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణీకులతో కూడా మంత్రి మాట్లాడారు. తమ కోసం భారతీయ రైల్వేలు చేసిన ఏర్పాట్ల  పట్ల ప్రయాణీకులు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన యాత్రి సువిధా కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. 

 

రైల్వే బోర్డు ఛైర్మన్, సిఈఓ శ్రీ సతీష్ కుమార్, ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అశోక్ కుమార్ వర్మ, ఇతర సీనియర్ అధికారులు కూడా  మంత్రి వెంట ఉన్నారు. 

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను సందర్శించే ముందు, శ్రీ అశ్విని వైష్ణవ్ రైల్ భవన్ వార్ రూమ్ నుంచి ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా సమీక్షించారు. ప్రయాణీకుల సౌకర్యాలపై రైల్వే అధికారులకు ముఖ్యమైన సూచనలను జారీ చేశారు.

భారతీయ రైల్వే 2024 పండగ సీజన్లో 7,724  ప్రత్యేక రైళ్లు నడపగా ఈ ఏడాది పండుగ సీజన్ లో పెరిగిన రద్దీకి అనుగుణంగా 12,011 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. 

భారతీయ రైల్వే  2025 అక్టోబర్ ఒకటి - అక్టోబర్ 20 తేదీల మధ్య భారతీయ రైల్వేలు సాధారణ రైలు సర్వీసులతో పాటు  4,211 ప్రత్యేక రైళ్లను విజయవంతంగా నడిపి, కోటిమందికి ప్రయాణీకులకు సేవలు అందించింది. దీపావళి,  ఛత్ పూజ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, రాబోయే రోజుల్లో సుమారు మరో 7,800 ప్రత్యేక రైళ్లను నడపడానికి కూడా భారతీయ రైల్వే  ప్రణాళికలు రూపొందించింది. 

2025 అక్టోబర్ 1 నుంచి 20వ తేదీ మధ్య ప్రత్యేక రైళ్ల ద్వారా కోటిమంది పైగా ప్రయాణించారు. న్యూఢిల్లీ ప్రాంతంలో అక్టోబర్ 16 - 20 తేదీల మధ్య 21.04 లక్షల మంది ప్రయాణించారు. గత సంవత్సరం ఇదే కాలంలో ప్రయాణించిన 19.71 లక్షలమందితో పోలిస్తే ఇది 1.33 లక్షలు ఎక్కువ. 

దేశవ్యాప్తంగా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు

ప్రయాణీకులకు సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే  విస్తృతమైన ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక వసతి ప్రాంతాలు, అదనపు టికెట్ కౌంటర్లు, సురక్షితమైన తాగునీటి సౌకర్యాలు,  పరిశుభ్రమైన మరుగుదొడ్లతో అన్ని స్టేషన్లలో ప్రయాణీకుల నిర్వహణను పటిష్టం చేశారు. 

పండుగల సందర్భంగా ప్రయాణికుల భారీ రద్దీని పర్యవేక్షించి, నిర్వహించడానికి భారతీయ రైల్వే, రైల్ భవన్‌లో ఒక ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేసింది. ఈ కమాండ్ సెంటర్ ద్వారా వాస్తవ సమయ పర్యవేక్షణ సాధ్యమవుతుంది. దీనివల్ల రద్దీ, ప్రయాణికుల ఫిర్యాదులు, అవకాశం ఉన్న అవాంఛనీయ సంఘటనలను తక్షణమే పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. రైల్వే మంత్రిగా శ్రీ అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆయన మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. రైల్వే వ్యవస్థ అంతటా భద్రత పర్యవేక్షణను బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

శ్రీ వైష్ణవ్,  రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ శ్రీ సతీష్ కుమార్ రైల్ భవన్‌లోని వార్ రూమ్‌ను తరచూ సందర్శిస్తూ  ప్రయాణికుల డిమాండ్ ను సమీక్షించి  అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇస్తున్నారు. నేడు ఈ వార్ రూమ్, రైల్వే బోర్డు, జోనల్,  డివిజనల్ స్థాయిలలో 80కి పైగా క్రియాశీల వార్ రూమ్‌లతో, మొత్తం భారతీయ రైల్వే నెట్వర్క్ ను పర్యవేక్షించే ఒక ప్రభావవంతమైన వ్యవస్థగా అభివృద్ధి చెందింది.

ఇదే తరహాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో  ఒక మినీ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికుల ఏర్పాట్లను నిశితంగా పర్యవేక్షిస్తూ, కార్యకలాపాలు సాఫీగా ఆపరేషన్లు జరగటానికి, ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడానికి సహాయపడుతోంది. 

జైపూర్ స్టేషన్‌లో స్పెషల్ మొబైల్ అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (ఎం - యూటీఎస్)  ద్వారా ప్రయాణికులకు వారు వేచి ఉండే ప్రదేశాలలోనే  నేరుగా టిక్కెట్లను జారీ చేస్తున్నారు. ఈ విధానం స్టేషన్‌లో క్రమశిక్షణను కాపాడటంలో సహాయపడటమే కాకుండా, ప్రయాణికులకు సౌకర్యవంతమైన,  సంతృప్తికరమైన అనుభవాన్ని అందిస్తోంది.

పశ్చిమ రైల్వేకు చెందిన వడోదర డివిజన్ కూడా పెరిగిన ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి  వడోదర డివిజన్ నడుపుతున్న సాధారణ రైళ్లు, 5 ప్రత్యేక రైళ్ల ద్వారా 30 లక్షలమందికి పైగా ప్రజలు ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని తమ గమ్యస్థానాలకు ప్రయాణించారు. ఈ డివిజన్ ఐదు పండుగ ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, ఇప్పటికే 70కి పైగా ట్రిప్పులు నమోదయ్యాయి.

ఈరోజు ఉధ్నా రైల్వే స్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణికులకు 5,000 ప్యాకేజ్డ్ మంచినీటి బాటిళ్లను పంపిణీ చేశారు.

తంజావూర్ జంక్షన్‌లో ఇటీవల వృద్ధ ప్రయాణికులు శుభ్రమైన సౌకర్యాలతో ఉన్న ఏసీ రిటైరింగ్ రూమ్‌లను ఉపయోగించడం -  ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందించేవిధంగా ఆలోచనాత్మకమైన, సేవా ఆధారిత సౌకర్యాలను కల్పించడంపై భారతీయ రైల్వేల నిబద్ధతను చాటుతుంది.

దుష్ప్రచారంపై నిఘా - పారదర్శకతపైనే దృష్టి

ప్రస్తుత పండుగ సీజన్‌లో ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, మెరుగైన సమన్వయంతో కూడిన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వేలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో, సోషల్ మీడియా వేదికల  ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి కూడా చురుకైన చర్యలు తీసుకుంటోంది.

కొన్ని సోషల్ మీడియా ఖాతాలు రైళ్లు, స్టేషన్లు రద్దీగా,  ప్రయాణికులకు అసౌకర్యంగా ఉన్న పాత ఫోటోలు, వీడియోలను సర్క్యులేట్ చేస్తూ, ప్రయాణికులలో అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తున్నట్లు గుర్తించారు. ఈ విజువల్స్‌ ను చాలా వరకు ఎటువంటి ఆధారం లేకుండా షేర్ చేస్తున్నారు. వాటిని కొత్తగా జరిగినవవిగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అధికారిక జోనల్ సోషల్ మీడియా ఖాతాలు ఈ విషయంలో చురుకుగా స్పందించి వాటిని నిరాధారమైననిగా నిరూపిస్తున్నాయి. అటువంటి తప్పుదారి పట్టించే కంటెంట్‌ను పాతది, అసత్యమైనదిగా ఆధారాలతో చూపిస్తున్నాయి. 

గత ఐదు రోజుల్లో, ఇలాంటి తప్పుదారి పట్టించే 40కి పైగా కేసులను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత, ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభుత్వం తక్షణ,  దృఢమైన చర్యలు తీసుకుంటోంది.

గతంలో లేనంతగా  పండుగ కార్యకలాపాలు

రైల్వే ప్రయాణికులు కూడా ఈ ఏడాది మెరుగైన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటూ, ఈసారి ఏర్పాట్లు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉన్నాయని, మొత్తం ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా సాగిందని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్, వల్సాడ్, విశాఖపట్నం, సంబల్‌పూర్ స్టేషన్‌లలోని ప్రయాణికులు భారతీయ రైల్వే చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు, రిజర్వేషన్ లేని కోచ్‌లలో కూడా మెరుగైన సౌకర్యాలు, నిర్వహణను ప్రశంసించారు.

ఉద్యోగుల అంకితభావం - సౌకర్యవంతమైన ప్రయాణం

భారతీయ రైల్వే  లేడీస్ సర్కిల్ ఇండియాతో కలిసి, ప్రాజెక్ట్ ఆయుష్మాన్ కింద మైసూరు రైల్వే స్టేషన్‌  రెండవ ప్లాట్‌ఫారమ్ లో మొట్టమొదటి నర్సింగ్ గదిని ఆవిష్కరించింది. తల్లులు, శిశువులకు ప్రశాంతమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన ఈ ప్రత్యేక ప్రదేశం ప్రయాణ సమయంలో గోప్యత, గౌరవం,  సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఎయిర్ కండిషన్డ్, మంచి వెలుతురుతో,  అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ నర్సింగ్ గది, ఎక్కువ సేపు ఆగాల్సి వచ్చినప్పుడు, రాత్రిపూట రైళ్లు మారాల్సిన సమయంలో లేదా పండుగ రద్దీలో తల్లుల అవసరాలను తీరుస్తుంది.

భారతీయ రైల్వే ఇటీవల సాధించిన  ప్రగతిలో లక్నో సిటీ రైల్వే స్టేషన్ ఉత్తర భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో నడిచే స్టేషన్‌గా అవతరించడం ఒక ముఖ్యాంశం. ఇది సాధికారత, లింగ సమానత్వంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కంట్రోల్ రూమ్ నుంచి టిక్కెట్ కౌంటర్లు, భద్రతా గస్తీ నుంచి సిగ్నల్ క్యాబిన్‌ల వరకు అన్ని కార్యకలాపాలను ఇప్పుడు 34 మంది సభ్యులతో కూడిన పూర్తి మహిళా బృందం నిర్వహిస్తోంది. ఈశాన్య రైల్వే ప్రారంభించిన ఈ చరిత్రాత్మకమైన చర్య, మహిళా శక్తిని ఆచరణలో ప్రతిఫలింపజేస్తూ, ప్రయాణికులకు భద్రమైన, సమ్మిళితమైన ఉత్తేజపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోంది.

 

వైద్య సంసిద్ధతను,  అంకితభావాన్ని ప్రదర్శిస్తూ, పాలక్కాడ్ జంక్షన్ (దక్షిణ రైల్వే) డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జితిన్ పి.ఎస్, కన్యాకుమారి - దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరడానికి కేవలం నిమిషాల ముందు ప్లాట్‌ఫారమ్‌పై 24 ఏళ్ల ప్రయాణీకుడి దవడకు చికిత్స చేశారు. అత్యవసరంగా చేతితో దవడను సరిచేసే ప్రక్రియను కచ్చితత్వంతో నిర్వహించారు, దీనివల్ల ప్రయాణీకుడు వెంటనే కోలుకుని, ఆలస్యం లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించగలిగాడు. ఈ తక్షణ స్పందనకు సోషల్ మీడియాలో విస్తృత ప్రశంస లభించింది. ప్రధాన స్టేషన్లలో భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన నిరంతర (24/7) వైద్య సంసిద్ధత, శిక్షణ పొందిన నిపుణుల అందుబాటు, అత్యవసర ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ఇది ప్రముఖంగా తెలియచేస్తుంది.

భారతీయ ప్రయాణీకులకు భద్రత, పారదర్శకత,  మెరుగైన సేవలు అందించడం పట్ల భారతీయ రైల్వే తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ప్రయాణ సంబంధిత తాజా వివరాల కోసం కేవలం అధికారిక ఛానెళ్ల పైన, నిర్ధారిత సమాచారం పైన మాత్రమే ఆధారపడాలని ప్రజలను కోరుతోంది.

 

***


(Release ID: 2181392) Visitor Counter : 8