వ్యవసాయ మంత్రిత్వ శాఖ
‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’నూ, ‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’నూ సమయానుకూలంగా అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ ఆదేశం
‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ను త్వరిత గతిన అమలు చేయడానికి
11 శాఖల మంత్రులతో సమావేశాన్ని నిర్వహించనున్న శ్రీ శివ్‌రాజ్ సింగ్
‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’ కాలానుగుణ అమలుకు
సంబంధిత రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించాలంటూ
అధికారులకు ఆదేశాలిచ్చిన శ్రీ చౌహాన్
Posted On:
17 OCT 2025 11:12AM by PIB Hyderabad
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో ‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’ను, ‘ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన’లకు సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ పథకాలు సమయానికి తగ్గట్టు అమలయ్యేలా కేంద్ర మంత్రి ఈ సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన’ త్వరిత గతిన అమలు అయ్యేటట్టు చూడడానికి శ్రీ చౌహాన్ 11 మంత్రిత్వ శాఖల మంత్రులను త్వరలోనే సమావేశపరచనున్నారు.

జిల్లా స్థాయి క్లస్టర్లను ఏర్పాటు చేసి, ఆ క్లస్టర్లకు సంబంధించి రాష్ట్రాల మద్దతును తీసుకుని ‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’ను అమలుపరచనున్నట్లు సమావేశంలో తెలియజేశారు. దీనికి అదనంగా, ‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ బాగా కింది స్థాయిలో సమర్థంగా అయ్యేటట్టు చూడాల్సిందిగా అధికారులను శ్రీ చౌహాన్ ఆదేశించారు. రెండు కార్యక్రమాలనూ క్షేత్ర స్థాయిలో కాలానుగుణంగా అమలుపరిస్తే, వాటి ప్రయోజనాలు రైతులకు నేరుగా అందుతాయని ఆయన చెప్పారు.
11 మంత్రిత్వ శాఖలు అమలుపరుస్తున్న 36 ఉప పథకాలను కలిపేసి దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో వ్యవసాయ రంగ పురోగతికి దోహద పడటం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ లక్ష్యం. ఈ సందర్భంలో శ్రీ చౌహాన్, పథకం తాలూకు ప్రయోజనాలు అధికంగా రైతులకు అందేలా చూడటానికి ఆ 11 మంత్రిత్వ శాఖల మంత్రులతోనూ, కార్యదర్శులతోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి నీతి ఆయోగ్ అధికారులను కూడా పిలిపించాలని ఆయన సూచించారు.
‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’ను సక్రమంగా అమలుపరచడానికి సంబంధిత రాష్ట్రాల నోడల్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి అధికారులను ఆదేశించారు. అంతక్రితం, ఈ నెల 11న న్యూఢిల్లీలోని పూసాలో నిర్వహించిన ఒక పెద్ద కార్యక్రమంలో ‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’నూ, ‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’నూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.
‘ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ను కేంద్ర మంత్రివర్గం ఈ సంవత్సరం జులై 16న ఆమోదించింది. ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంతో మొదలుపెట్టి ఆరేళ్ల పాటు అమలు చేస్తారు. దీనికి ఏటా రూ.24,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇదే విధంగా, ‘పప్పుధాన్యాల రంగంలో స్వావలంబన మిషన్’ను కూడా ఆరు సంవత్సరాల పాటు అమలు చేస్తారు. దీనికి రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ మిషన్ ద్వారా 2030-31 కల్లా పప్పుధాన్యాలను పండించే ప్రాంతాన్ని 275 లక్షల హెక్టార్ల నుంచి 310 లక్షల హెక్టార్లకూ, ఉత్పత్తిని 242 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకూ, ఉత్పాదకతను ఒక్కొక్క హెక్టారుకూ 1,130 కిలోలకూ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్పాదకతను ఈ మిషన్ మెరుగుపరచడంతో పాటే ఉద్యోగ అవకాశాలను చెప్పుకోదగ్గ స్థాయిలో పెంచుతుందని భావిస్తున్నారు.
***
(Release ID: 2180405)
Visitor Counter : 12