రాష్ట్రపతి సచివాలయం
ఆర్మీ చీఫ్స్ కాన్‌క్లేవ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ (యూఎన్‌టీసీసీ)లో పాల్గొన్న సైన్య ప్రధానాధికారులు, ఉప ప్రధానాధికారులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో భేటీ
ప్రతి చిన్నారీ హాయిగా నిద్రించే, ప్రతి సమాజం సామరస్యంతో పరిఢవిల్లే, సంఘర్షణలను చరిత్ర పుటల్లోకి నెట్టేసే ప్రపంచాన్ని శాంతి సంరక్షకులుగా మనమంతా కలిసి స్థాపించుదాం: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
Posted On:
16 OCT 2025 4:41PM by PIB Hyderabad
ఆర్మీ చీఫ్స్ కాన్‌క్లేవ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ (యూఎన్‌టీసీసీ)లో పాల్గొన్న సైన్య ప్రధానాధికారులు, ఉప ప్రధానాధికారులు తమ జీవన భాగస్వాములతో కలిసి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్లో ఈ రోజు సమావేశమయ్యారు.
రాష్ట్రపతి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వారిని తమ తమ దేశాల అత్యుత్తమ విలువలు, మర్యాదల సగౌరవ ప్రతినిధులుగా అభివర్ణించారు. వారందరూ కలిసి అపారమైన అనుభవాన్నీ, ప్రావీణ్యాన్నీ, చిరకాల శాంతి, సౌభాగ్యాల పట్ల తమ దేశాల సంకల్పాన్నీ వెంటబెట్టుకు వచ్చారని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళ సభ్యులను ప్రపంచవ్యాప్తంగా 71 వివిధ మిషన్లలో మోహరించారని రాష్ట్రపతి వివరించారు. ఈ మిషన్లు అమాయక ప్రజల, మరీ ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వయోవృద్ధుల కష్టాలను తగ్గించేందుకు శ్రమించాయన్నారు. ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకూ, సుదూర ప్రాంతాలకూ పంపించిన ఐరాస శాంతి పరిరక్షణ దళ యోధులు మొక్కవోని ధైర్య సాహసాలనూ, అంతులేని కరుణనూ కనబరిచారని రాష్ట్రపతి అన్నారు.
అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ బహుళపక్షవాదంతో పాటు ఐక్యరాజ్యసమితి చార్టరులోని సిద్ధాంతాలను అనుసరించడాన్ని కూడా దృఢంగా విశ్వసిస్తోందని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ఐరాస శాంతి పరిరక్షణ దళాన్ని ఆరంభించినప్పటి నుంచీ క్రమం తప్పక దళాలను సమకూర్చుతున్నందుకు భారత్ సంతోషిస్తోందన్నారు. శాంతి పరిరక్షణ దళంలోని మా యోధులు ప్రపంచంలో అత్యంత సవాళ్లు ఎదురైన యుద్ధ కార్యకలాపాల్లో అద్వితీయ సేవలను అందించారని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. శాంతి పరిరక్షణ దళ ప్రస్థానంలో, భారత్ పురుష సైనికులతో పాటు మహిళా సైనికులను పంపించడంలో ప్రశంసనీయమైన నిర్ణయాలను తీసుకుందన్నారు. శాంతి పరిరక్షణ దళంలో పని చేసిన మహిళా సైనికులు వారు విధులను నిర్వర్తించిన చోట్ల ప్రజలకు సాధికారతను కల్పించడంతో పాటుగా వారిలో నమ్మకాన్ని పెంచారని రాష్ట్రపతి అన్నారు.
శాంతి పరిరక్షణ ఉదాత్త ఆశయ సాధన నిమిత్తం సైనికులను పంపిస్తున్న దేశాలుగా మనమంతా కలిసికట్టుగా దళాలను సమకూర్చుతున్న దేశాల వాణిని బిగ్గరగా వినిపించే ఏర్పాట్లు చేయడానికి కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు. ప్రాంతీయ ఆసక్తిదారులతో మరింత చురుకైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకొనే దిశగా కూడా మనం పాటుపడాలన్నారు. ఇలా చేస్తే శాంతిని బలవంతాన రుద్దే వాతావరణానికి బదులు భాగస్వామ్య ప్రధాన ప్రక్రియల ద్వారా శాంతిని పెంచి పోషించడానికి వీలవుతుందన్నారు.
ఆర్మీ చీఫ్స్ కాన్‌క్లేవ్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ట్రూప్ కంట్రిబ్యూటింగ్ కంట్రీస్‌తో పాటు ఇదే పరమార్థంతో నిర్వహించే ఇతర కార్యక్రమాలు కొత్త కొత్త ఆలోచనలనూ, ఇప్పటి కన్నా ఎక్కువ సహకారాన్నీ, దీర్ఘకాలిక మైత్రినీ ప్రోత్సహిస్తాయన్న విశ్వాసం తనకుందని రాష్ట్రపతి అన్నారు. ప్రతి చిన్నారీ హాయిగా నిదరోయే, ప్రతి సమాజం సామరస్యంతో పరిఢవిల్లే, సంఘర్షణలు చరిత్ర పుటల్లోకి నెట్టేసే ప్రపంచాన్ని శాంతి సంరక్షకులుగా మనమంతా కలిసి స్థాపించుదామని రాష్ట్రపతి అన్నారు.
Please click here to see the President's Speech



*****
(Release ID: 2180107)
Visitor Counter : 3