ఆయుష్
ప్రపంచ పోషణలో ఆయుర్వేద ఆహారాన్ని ఓ అంతర్భాగంగా చేయడం మా ధ్యేయం: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్
అంకుర సంస్థలకు సాధికారతతో పాటు జీవనశైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడానికే ఆయుర్వేద ఆహార జాబితా ప్రకటన: ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి
దీర్ఘకాలిక మనుగడను దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద ఆధారిత పోషణను ప్రచారంలోకి తేవడానికి ఆయుష్ శాఖ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సంయుక్త కృషి
Posted On:
16 OCT 2025 1:24PM by PIB Hyderabad
‘‘మంచి ఆహారం, మేలైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగుదాం’’ ఇతివృత్తంతో ‘ప్రపంచ ఆహార దినోత్సవం-2025’ను ప్రపంచ దేశాలు నిర్వహించుకొంటున్న వేళ, ఈ భూగ్రహాన్ని మరింత కాలం పాటు మనిషి మనుగడకు అనువైందిగా తీర్చిదిద్దాలన్న భారత్ నిబద్ధతను ఆయుష్ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటిస్తున్నది. ఇదే లక్ష్యంతో ‘ఆయుర్వేద ఆహారాన్ని అందించే’ మార్గదర్శక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ఆయుష్ శాఖ భుజానికెత్తుకుంది. సమతౌల్యం, సంక్షేమం, ప్రకృతి.. ఈ మూడింటిలోనే భారత అద్వితీయ ఆహార దార్శనికత ఇమిడివుంది.
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌స్ అథారిటీ ఆఫ్ ఇండియా..ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆయుష్ శాఖతో సంప్రదింపులు జరిపిన తరువాత, కేటగిరీ ‘ఏ’ ఆయుర్వేద ఆహార ఉత్పాదనలతో ఓ పక్కా జాబితాను ఇటీవలే విడుదల చేసింది. దీంతో ప్రామాణిక ఆయుర్వేద ఆహార తయారీకి ఒక సమగ్ర స్వరూపం మొదటిసారిగా అందుబాటులోకి వచ్చినట్లయింది. అధికారిక శాస్త్రీయ గ్రంథాల నుంచి సేకరించి మరీ రూపొందించిన ఈ జాబితా.. వృద్ధినీ, నాణ్యతనూ ప్రోత్సహించడంతో పాటే ఆయుర్వేదం చెబుతున్న పోషణ విజ్ఞానం పట్ల ప్రపంచ దేశాల్లో విశ్వాసం పెంపొందేటట్లు కూడా దోహద పడుతుందని భావిస్తున్నారు.
ఆయుర్వేద ఆహారానికున్న ప్రాధాన్యాన్ని ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ ముఖ్యంగా ప్రస్తావిస్తూ, ‘‘ఈ సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవ ఇతివృత్తం భారత సాంప్రదాయక జ్ఞాన బోధకు అనుగుణంగా ఉంది. ఆయుర్వేద ఆహారం అంటే అది ఒక్క ఆహారానికే పరిమితం కాదు.. అది ఆరోగ్యాన్నీ, దీర్ఘకాలికత్వాన్నీ, ప్రకృతి పట్ల కరుణనూ పెనవేసే దార్శనికత. ఎఫ్ఎస్ఎస్ఏఐ సమన్వయంతో మేం ఆయుర్వేద ఆహారాన్ని ప్రపంచ పోషణలో అంతర్భాగంగా మలచి, దీని ద్వారా మంచి ఆహార పదార్థాలు.. ఉత్తమమైన, వ్యాధుల్లేని రేపటి రోజును కళ్లెదుట నిలుపుతాయని చాటాలనుకుంటున్నాం’’ అన్నారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటిఫై చేసిన ఆయుర్వేద ఆహార నియమనిబంధనలు ఇప్పటికే భారత సంప్రదాయ ఆరోగ్య జ్ఞానాన్ని ఆధునిక ఆహార భద్రతా కొలమానాలతో మేళవించడంలో కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తున్నాయి. ఈ పునాదులను ఆధారంగా చేసుకొని, నిర్ణాయక ఉత్పాదనల జాబితాను విడుదల చేయడమంటే అది ఆయుర్వేద శాస్త్రీయ విజ్ఞాన గ్రంథాల్లో పొందుపరిచిన స్పష్టమైన, మాన్యత కలిగిన సూచనలపై వినియోగదారులకూ, ఆహార వాణిజ్య సంస్థలకూ కూడా చక్కని అవగాహనను అందించడమే అవుతుంది.
ఆయుష్ కార్యదర్శి శ్రీ వైద్య రాజేశ్ కొటేచా మాట్లాడుతూ, ‘‘ఆయుర్వేద ఆధారిత ఆహార పద్ధతులపై ప్రపంచంలో నానాటికీ శ్రద్ధ, ఆసక్తులు పెరిగిపోతుండడం బట్టి చూస్తే సంపూర్ణ పోషణకు భారత్ కీలక తోడ్పాటును అందిస్తోందని స్ఫష్టమవుతోంది. ప్రస్తుతం విడుదల చేసిన నిర్ణాయక జాబితాతో ఆయుర్వేద ఆహార స్వరూపం బలోపేతమైంది. ఇది తయారీదారులతో పాటు వినియోగదారులకు కూడా స్పష్టతనిస్తుంది. దీనిని మేం అంకుర సంస్థలతో పాటు ఆరోగ్యదాయక ఆహార రంగంలో నవకల్పనకు ఒక ప్రధాన ప్రోత్సాహక పరిణామంగా పరిగణిస్తున్నాం. ఆహార స్వీకరణ పట్ల పెరుగుతున్న మక్కువకూ, జీవనశైలికి సంబంధించిన అనారోగ్యాలకూ అడ్డుకట్ట వేయడంలో ఆయుర్వేద విజ్ఞానం సాయపడుతుంద’’న్నారు.
ఈ కార్యక్రమానికి విజ్ఞానశాస్త్రపరంగా, విద్య పరంగా ఉన్న కోణాలను జాతీయ ఆయుర్వేద సంస్థ (ఎన్ఐఏ), జైపూర్‌కు చెందిన ప్రొఫెసర్ అనుపమ్ శ్రీవాస్తవ వివరిస్తూ, ‘‘ఆయుర్వేదలో చెప్పిన ఆహార సూత్రాలకు భారత్ ప్రధాన స్రవంతి పోషణ విధానంలో స్థానాన్ని కల్పించి, దీర్ఘకాలిక, వివేచనయుక్త భోజన పద్ధతుల దిశగా ప్రపంచానికి సాంప్రదాయక జ్ఞానం ఎలా మార్గదర్శిగా వ్యవహరించగలదో చాటిచెబుతోంద’’న్నారు. ఆయుష్, ఎఫ్ఎస్ఎస్ఏఐల సహకారం ఉత్తమ తిళ్లు, మెరుగైన భవిష్యత్తు లక్ష్యాల సాధనకు చెట్టపట్టాల్ వేసుకొని పనిచేయాలని ఉదాహరిస్తున్నాయని కూడా శ్రీ శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు.
భిన్నత్వంతో పాటు సమతౌల్యానికి ప్రతీకగా ఉన్న భారతీయ సంప్రదాయ భోజన పదార్థాలకు వాటిలోని పోషక విలువలు, పర్యావరణానుకూలత్వం పరంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన ఆయుర్వేద జ్ఞానాన్నుంచి స్ఫూర్తిని పొంది ఈ ఆహార నమూనాలు ఆయా రుతువులకు తగిన ఆహారం తీసుకోవాలనీ, దినుసులను స్థానికంగా సమకూర్చుకోవాలనీ, ఎంత అవసరమో అంతే భుజించాలనీ సూచిస్తున్నాయి. ఇది ఆహార వ్యవస్థలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దుకోవాలన్న అంతర్జాతీయ నినాదం స్ఫూర్తితో చక్కగా సరిపోలుతోంది.
ఆహారం పట్ల తమ దృక్పథాన్ని ప్రపంచ దేశాలు మార్చుకొంటున్న వేళ, సమతౌల్యం వైపునకు దారిని చూపే దీపంగా భారత్ నిలుస్తోంది. సాంప్రదాయక జ్ఞానం, ఆధునిక విజ్ఞానశాస్త్రం కలిసికట్టుగా ఆటుపోట్లకు తట్టుకోగలిగే, ఆరోగ్యవంతమైన సమాజాలను నిర్మించగలుగుతాయని భారత్ నిరూపిస్తున్నది. ఎఫ్ఎస్ఎస్ఏఐతో, ఇతర ఆసక్తిదారులతో ఆయుష్ శాఖ కలిసి పనిచేస్తూ, ఆయుర్వేద ఆహారం అంటే పుష్టికీ, దీర్ఘకాలికత్వానికీ, ప్రపంచంలో అందరూ బాగుండాలనే దృక్పథానికీ మారుపేరని చాటాలన్న తన ఆశయాన్ని సాధించే దిశగా పురోగమిస్తోంది.

***
(Release ID: 2179933)
Visitor Counter : 13