రాష్ట్రపతి సచివాలయం
మంగోలియా అధ్యక్షుడికి స్వాగతం పలికిన భారత రాష్ట్రపతి
రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నూతన, సమకాలీన సహకార అంశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేయాల్సిన సమయమిది: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
14 OCT 2025 10:30PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ (అక్టోబర్ 14, 2025) రాష్ట్రపతి భవన్ కు మంగోలియా అధ్యక్షుడు హెచ్ ఈ శ్రీ ఖురెల్సుఖ్ ఉఖ్నాను ఆహ్వానించారు. గౌరవార్థంగా ఆయనకు విందును ఏర్పాటు చేశారు.

అధ్యక్షుడు ఖురెల్సుఖ్, ఆయన ప్రతినిధి బృందాన్ని రాష్ట్రపతి భవన్ కు స్వాగతించిన అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత్-మంగోలియా సంబంధాలకు సాంస్కృతిక వారసత్వం, ప్రజాస్వామ్య విలువలే పునాది అన్నారు. భారత్, మంగోలియా 'వ్యూహాత్మక భాగస్వాములు', 'మూడో పొరుగు దేశాలు', 'ఆధ్యాత్మిక పొరుగు దేశాలు' అని వ్యాఖ్యానించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 70వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రత్యేకమైనదని ఆమె తెలిపారు.

భారత్ లో మంగోలియా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా సాంస్కృతిక సంబంధాలు, అభివృద్ధి భాగస్వామ్య బలోపేతానికి తీసుకున్న నిర్ణయాల పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు.
గత 25 ఏళ్లలో మంగోలియాలో బౌద్ధారామాల పునరుద్ధణ, ప్రాచీన గ్రంథాలను తిరిగి ముద్రించటంతో సహా అనేక సాంస్కృతిక ప్రాజెక్టులను భారత్ చేపట్టిందని రాష్ట్రపతి తెలిపారు. మంగోలియా బౌద్ధ సన్యాసులు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించేందుకు సహజమైన గమ్యస్థానంగా భారత్ ఉందన్నారు. ఇవాళ ముగిసిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంపై జరిగిన ఎంఓయూ సాంస్కృతిక మార్పిడిని మరింత ప్రోత్సహించేందుకు బలమైన పునాదిగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మంగోలియాతో అభివృద్ధి, సామర్థ్య నిర్మాణ భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యతనిస్తుందని, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయటానికి కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టులు భారత్-మంగోలియా స్నేహానికి, సహకారానికి శాశ్వత చిహ్నాలుగా నిలుస్తాయని రాష్ట్రపతి అన్నారు.
ఐక్యరాజ్యసమితితో సహా వివిధ వేదికలపై గ్లోబల్ సౌత్ సభ్యులుగా ఇరుదేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని రాష్ట్రపతి అభినందించారు.
రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నూతన, సమకాలీన సహకార అంశాలను జోడించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేయాల్సిన సమయమిదని ఇద్దరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Please click here to see the President's Speech-
***
(रिलीज़ आईडी: 2179676)
आगंतुक पटल : 19