హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో నేరస్థుల అప్పగింత –సవాళ్లు, వ్యూహాలపై సదస్సు రేపు ప్రారంభించనున్న కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ దర్యాప్తుల్లో కొత్త శకంలోకి అడుగుపెడుతున్న భారత్

నేరగాళ్ల అప్పగింత విషయంలో అధికారిక, అనధికారిక మార్గాల వినియోగం

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరారీలో ఉన్న నేరస్థుల గుర్తింపు

నేరగాళ్ల అప్పగింత కోసం వ్యూహాత్మక విధానం... వాంటెడ్ నేరగాళ్ల ఆర్థిక చరిత్రపై విశ్లేషణ

నార్కో నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరస్థులపై ప్రత్యేక దృష్టి

Posted On: 15 OCT 2025 5:58PM by PIB Hyderabad

‘‘నేరస్థుల అప్పగింత –సవాళ్లు, వ్యూహాలు’’ అన్న అంశంపై న్యూఢిల్లీలో గురువారం (16, అక్టోబర్‌, 2025) జరగనున్న సదస్సును కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్‌ షా ప్రారంభిస్తారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ సదస్సును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిర్వహించనుంది.

ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పోలీసు సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. అంతర్జాతీయ పోలీసు సహకారానికి సంబంధించిన అంశాలు, పరారీలో ఉన్న నేరస్థులను కనిపెట్టడం, వారిని భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన సమన్వయ చర్యలపై చర్చించనున్నారు. ఈ సదస్సులో విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహా తదితర కీలక భాగస్వాములు కూడా పాల్గొననున్నారు.

రెండు రోజులపాటు కొనసాగే ఈ సమావేశంలో.. విదేశాల నుంచి సహకారాన్ని కోరేందుకు అందుబాటులో ఉన్న అధికారిక, అనధికారిక మార్గాలను సమర్థవంతంగా వినియోగించడం, నేరస్థులను గుర్తించడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, పారిపోయిన ఖైదీలను అప్పగించేందుకు వ్యూహాత్మక విధానం, వాంటెడ్ నేరగాళ్ల ఆర్థిక చరిత్రను విశ్లేషించడం వంటి అనేక అంశాలను చర్చిస్తారు. అంతేగాక నార్కో, ఉగ్రవాదం, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరస్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

అంతర్జాతీయ నేర దర్యాప్తులో- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో- భారత్‌ కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. విదేశాలకు పారిపోయిన నేరస్థులను తిరిగి దేశానికి తీసుకురావడంలో సమన్వయంతో కూడిన వ్యూహం అవసరమని గత జులైలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ దిశగా పరారీలో ఉన్న నేరస్థులను చట్టపరమైన, దౌత్య మార్గాల ద్వారా తిరిగి తీసుకురావడంపై చర్చించేందుకు సీబీఐ ఈ ప్రత్యేక సదస్సును నిర్వహిస్తోంది.

దేశం నుంచి పారిపోయిన ఖైదీలకు సంబంధించి వివిధ దేశాల్లో 300కు పైగా అప్పగింత అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాలు తమను భారత్‌కు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు పరారీలో ఉన్న నేరస్థులు చట్టపరంగా ఉన్న వివిధ మార్గాలను ఆశ్రయిస్తారు. వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధమున్న అనేక మంది నేరస్థులు భారత్ నుంచి పారిపోయి విదేశాల నుంచే నేర కార్యకలాపాలను కొనసాగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సవాళ్లపై చర్చించేందుకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. పరారీలో ఉన్న నేరస్థులను వేగవంతంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు సమర్థవంతమైన మార్గాలను అన్వేషించడమే ఈ చర్చల ముఖ్య ఉద్దేశం.

సీబీఐ అభివృద్ధి చేసిన భారత్‌పోల్‌ పోర్టల్‌ను కేంద్ర హోంశాఖా మంత్రి ప్రారంభించారు. ఇది జిల్లా పోలీసు శాఖలు, రాష్ట్ర పోలీసులు, కేంద్ర న్యాయ అమలు సంస్థలు, సీబీఐని ఒకే వేదికపైకి తీసుకురానుంది. దీని ద్వారా విభిన్న స్థాయుల్లోని న్యాయ సంస్థల మధ్య సమాచార మార్పిడి వేగవంతం కావడంతోపాటు పారదర్శకతను పెంచేందుకు, కలిసికట్టుగా చర్యలు తీసుకునేందుకూ అవకాశం లభిస్తుంది. ఈ సదస్సులో జరిగే చర్చలు, ఆలోచనల మార్పిడి, కొత్త దృక్కోథాలు, చక్కటి పరిజ్ఞానాన్ని అందివ్వడమే కాకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.

 

***


(Release ID: 2179661) Visitor Counter : 4