రక్షణ మంత్రిత్వ శాఖ
‘నౌకా వాణిజ్య రంగంపై సైబర్ దాడులు... జాతీయ భద్రత, అంతర్జాతీయ సంబంధాలపై పడుతున్న ప్రభావం’ అంశంపై సెమినార్‌ను ఏర్పాటు చేస్తున్న భారతీయ నౌకాదళం
Posted On:
15 OCT 2025 12:56PM by PIB Hyderabad
‘నౌకావాణిజ్య రంగంపై సైబర్ దాడులు... జాతీయ భద్రతపైనా, అంతర్జాతీయ సంబంధాలపైనా పడుతున్న ప్రభావం’ అంశంపై ఒక సెమినార్‌ను భారతీయ నౌకాదళం ఈ నెల 16న న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్‌లో ఏర్పాటు చేస్తోంది. నౌకావాణిజ్య రంగంలో సైబర్ ముప్పును క్షుణ్నంగా అర్థం చేసుకోవడంతో పాటు సైబర్ భద్రతను పెంచడం. జాతీయ సైబర్ భద్రత స్థితిని పటిష్ట పరచడం ఈ సెమినార్ లక్ష్యం.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (ఎంఈఐటీవై) సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయన సెమినార్ ప్రారంభ సదస్సులో కీలక ఉపన్యాసం చేస్తారు.
వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలకు చెందిన ప్రముఖ నిపుణులు నాయకత్వం వహించే బృంద చర్చలు ఈ సెమినార్లో భాగంగా ఉంటాయి. వారిలో ఓడరేవులు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ, పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎన్‌జీ), జాతీయ భద్రతామండలి సచివాలయం (ఎన్ఎస్‌సీఎస్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (జీఏఐఎల్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్), ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ-ఐఎన్), నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (ఎన్‌సీఐఐపీసీ)లతో పాటు నేషనల్ మేరీటైం ఫౌండేషన్ (ఎన్ఎమ్ఎఫ్)లే కాకుండా ప్రయివేటు సంస్థలకు చెందిన నాయకులు కూడా పాల్గొంటారు.
1. ప్రపంచ వ్యాప్తంగా నౌకావాణిజ్య మౌలిక సదుపాయాలకు ఎదురవుతున్న సైబర్ బెదిరింపులు,
2. పౌర, సైనిక భాగస్వామ్యం.
3. కీలక సమాచార మౌలిక సదుపాయంగా నౌకావాణిజ్య రంగం.. అనే అంశాలపై బృంద చర్చలు ఉంటాయి.
గౌరవ ప్రధానమంత్రి ప్రతిపాదించిన ‘మహాసాగర్’ (ప్రాంతాలవారీ భద్రతా పరిరక్షణ, అభివృద్ధి సాధనల కోసం పరస్పర, సమగ్ర ఉన్నతి) దృష్టికోణాన్ని సాకారం చేయడం ఈ సెమినార్ ధ్యేయం. స్వదేశీ, సురక్షిత డిజైన్లతో కూడిన డిజిటల్ ప్రణాళికలతో పాటు బలమైన ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య మాధ్యమంతో ‘ఆత్మనిర్భర్ భారత్’ను ఆవిష్కరించాలనే పిలుపును మారుమోగేటట్లు చేయడం కూడా ఈ సెమినార్ ఉద్దేశంగా ఉంది. ‘మేరిటైం ఇండియా విజన్-2030’, ‘అమృత్ కాల్ విజన్-2047’లకు అనుగుణంగా, అభివృద్ధి సాధనలో ఓడరేవుల అండదండలను పొందడం, స్మార్ట్ లాజిస్టిక్స్, సముద్ర తీరానికి ఆవల ఇంధన ఉత్పాదన, ముఖ్య మిషన్లలో నౌకాదళ సహకారం.. వీటన్నింటిలోనూ సైబర్ భద్రతదే ముఖ్య పాత్ర అని ఈ సెమినార్ చాటి చెబుతుంది.
సెమినార్‌లో భాగంగా, ఒక సాంకేతిక ప్రదర్శనను డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) భాగస్వామ్యంతో నిర్వహిస్తారు. సైబర్ భద్రత, రక్షణ సాంకేతికత రంగాలకు సంబంధించి దేశంలోని వివిధ అంకుర సంస్థలు అభివృద్ధి పరిచిన నవకల్పనలను ఈ ఎగ్జిబిషన్లో పరిచయం చేస్తారు. స్వావలంబనను ప్రోత్సహిస్తూ, 2047 కల్లా ‘వికసిత్ భారత్’ను సాకారం చేయాలని నిర్దేశించుకొన్న మార్గంలో ముందుకు సాగిపోవడానికి తోడ్పడే ఉత్పాదనలను దీనిలో ప్రదర్శిస్తారు.
***
(Release ID: 2179381)
Visitor Counter : 12