రక్షణ మంత్రిత్వ శాఖ
మాజీ సైనికులు, వారి కుటుంబీకులకు ఆర్థిక సాయంలో 100% పెంపుదలకు రక్షణ మంత్రి ఆమోదం
Posted On:
15 OCT 2025 11:52AM by PIB Hyderabad
కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం అమలు చేస్తున్న పథకాల కింద మాజీ సైనికులు, వారి కుటుంబీకులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచడానికి రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఆమోదం పొందిన పెంపుదల కింది విధంగా ఉంది:
- పెన్యూరీ గ్రాంటును ఒక్కో లబ్ధిదారుడికీ నెలకు రూ.4,000 నుంచి రూ.8,000కు రెండింతలు పెంచారు. ఇతర ఆదాయ మార్గాలు లేని 65 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు, పెన్షనర్లు కాని మాజీ సైనికోద్యోగులు, వారి వితంతువులకు ఇది నిరంతర జీవితకాల చేయూతను అందిస్తుంది.
- కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు (ఒకటో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు), లేదా రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు అభ్యసిస్తున్న వితంతువులకు ఒక్కొక్కరికీ నెలకు అందించే విద్యా గ్రాంటును రూ. 1,000 నుంచి రూ. 2,000కు పెంచారు.
- వివాహ గ్రాంటును ఒక్కో లబ్ధిదారుడికీ రూ.50,000 నుంచి రూ.1,00,000కు పెంచారు. మాజీ సైనికోద్యోగుల ఇద్దరు కుమార్తెలకు, వితంతు పునర్వివాహానికి, ఈ ఉత్తర్వు జారీ చేసిన తరువాత జరిగే వివాహాలకు ఇది వర్తిస్తుంది.
2025 నవంబరు 1 నుంచి సమర్పించే దరఖాస్తులకు సంబంధించి ఈ సవరించిన రేట్లు అమలులోకి వస్తాయి. ఇందులో దాదాపు రూ. 257 కోట్ల వార్షిక ఆర్థిక భారాన్ని ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్ నుంచి భరిస్తారు. సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ (ఏఎఫ్ఎఫ్‌డీఎఫ్) ఉప విభాగమైన రక్షణ మంత్రి మాజీ సైనికోద్యోగుల సంక్షేమ నిధి ద్వారా ఈ పథకాలకు నిధులు సమకూరుతాయి.
అల్పాదాయ వర్గాలకు చెందిన పెన్షనర్లు కాని మాజీ సైనికోద్యోగులు, వితంతువులు, వారి కుటుంబాల సామాజిక భద్రతను ఈ నిర్ణయం బలోపేతం చేస్తుంది. అనుభవజ్ఞులైన వీరి సేవ, త్యాగాన్ని గుర్తించి, గౌరవించడంలో ప్రభుత్వ అంకితభావాన్ని ఇది పునరుద్ఘాటిస్తోంది.
***
(Release ID: 2179371)
Visitor Counter : 204