పర్యటక మంత్రిత్వ శాఖ
కొత్త కార్యక్రమాలపై రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రుల సమావేశం
Posted On:
14 OCT 2025 12:50PM by PIB Hyderabad
రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రుల సమావేశాన్ని ఈ నెల 14వ, 15వ తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల టూరిజం మంత్రులతో పాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొంటున్నారు.
image.png
ప్రతి రాష్ట్రంలో, ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక ఆకర్షణీయ కేంద్రాన్నైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఇచ్చిన ‘‘ఒక రాష్ట్రం: ఒక ప్రపంచ శ్రేణి ఆకర్షణీయ కేంద్రం’’ పిలుపును దృష్టిలో పెట్టుకొని, ఆ నినాదాన్ని సాకారం చేసే దిశగా పయనించడంలో ఈ సమావేశం ఒక ప్రధాన మజిలీ. 2025-26 కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్భంలో చేసిన ప్రకటనల్లో ఈ కార్యక్రమం కూడా ఒకటి. మన దేశంలో పర్యటన రంగంలో పెనుమార్పులను తీసుకురావడంలోనూ, అలాగే వికసిత్ భారత్ సాధనకు మార్గసూచీని సిద్ధం చేయడంలోనూ భాగంగా కీలక సందర్శన స్థలం అభివృద్ధితో పాటు ఆ స్థల నిర్వహణకు నడుం బిగించే ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెటులో పేర్కొన్నారు.
ఆసక్తిదారులతో నిరంతరం సంప్రదింపులు జరిపే అంశంపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యటన మంత్రులు ‘50 ఆకర్షణీయ స్థలాల వికాసం’, ‘ఫలితాల ఆధారంగా ప్రోత్సాహకాలు’ (పెర్ఫార్మెన్స్ లింక్‌డ్ ఇన్సెంటివ్స్) అనే విషయాలపై తమ ముసాయిదా పత్రాల సారాంశాన్ని వివరించారు. భారత్ పర్యటన రంగంలో పెనుమార్పు తీసుకురావడానికి ఈ రెండు విషయాలు కీలకం. ప్రయివేటు రంగం మార్గదర్శకత్వంలో టూరిజం హబ్ అభివృద్ధి, పీఎల్ఐ ప్రాతిపదికన ఆకర్షణీయ కేంద్రాలకు మెరుగులు దిద్దే పద్ధతిని అనుసరించడం.. వీటికి పెద్దపీట వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.
సమావేశంలో మొదట పర్యాటక కార్యదర్శి వి. విద్యావతి ప్రసంగించారు. ఆ తరువాత కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, రెండు రోజుల చర్చకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచ ప్రమాణాలకు సరితూగే ఆకర్షణీయ పర్యాటక స్థలాలను తీర్చిదిద్దడంలో కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పరిశ్రమ ఆసక్తిదారుల మధ్య సహకార పూర్వక కార్యాచరణ ఎంతైనా అవసరమని ఈ కార్యక్రమంలో స్పష్టం చేశారు.
image.png
వివిధ ప్రాంతాల పర్యాటక మంత్రులు, అధికారులు తమ తమ ఆలోచనలనూ, బడ్జెట్లో చేపట్టే కార్యక్రమాలతో సహా ఈ రెండు రోజుల సమావేశంలో వివరిస్తున్నారు. ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం ఒక్కొక్క స్థలం చొప్పున, ప్రపంచ స్థాయి సందర్శనీయ స్థలంగా ఎలా అభివృద్ధి చేస్తారనే ప్రణాళికను తెలియజేస్తాయి.
image.png
సమావేశంలో రెండో రోజున సమీకృత ప్రోత్సాహక పథకం మార్గదర్శక సూత్రాల ముసాయిదాపై ప్రత్యేకంగా సమాలోచనలు చేస్తారు. ఇండియాను దేశ, విదేశీ పర్యాటకులకు అతి ఆకర్షక దేశంగా నిలపడం ఈ సమాలోచనల లక్ష్యం.
పర్యాటక ముఖచిత్ర రూపురేఖలను ఇప్పటికన్నా ఎంతో మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన కార్యాచరణకు వీలైన విధానాలు తేవడం, వికసిత్ భారత్‌ను ఆవిష్కరించే క్రమంలో ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన, దీర్ఘకాల ప్రాతిపదిక కలిగిన పర్యాటక అనుబంధ విస్తారిత వ్యవస్థను నెలకొల్పడానికి ప్రతి ప్రాంతం తన వంతు తోడ్పాటును అందించేటట్లు చూడడమే ధ్యేయంగా పెట్టుకొని పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.
***
(Release ID: 2178870)
Visitor Counter : 8