వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రెండు ప్రధాన కార్యక్రమాలు – పీఎం ధన - ధాన్య యోజన, పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి మిషన్ - లను ఈనెల 11న న్యూఢిల్లీలోని పూసా క్యాంపస్ నుంచి ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
న్యూఢిల్లీలో పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య , ఆహార శుద్ధి రంగాలలో రూ.42,000 కోట్ల పైగా విలువైన 1,100 పైగా ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచానికి ఆహార భాండాగారంగా భారత్ - శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
2030-31 నాటికి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 27.5 మిలియన్ల నుంచి 31 మిలియన్ హెక్టార్లకు విస్తరించడమే లక్ష్యం - శ్రీ చౌహాన్
రైతులకు కోటి 26 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలు, 88 లక్షల ఉచిత మినీ విత్తన కిట్ల పంపిణీ - శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
రూ. 25 లక్షల చొప్పున సబ్సిడీతో 1,000 ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు - శ్రీ చౌహాన్
Posted On:
09 OCT 2025 7:56PM by PIB Hyderabad
2025 అక్టోబర్ 11న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ప్రతిష్ఠాత్మక పథకాల గురించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ముఖ్యమైన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. భారతదేశం రబీ సాగు సీజన్‌లోకి ప్రవేశిస్తున్నందున, రైతుల సంక్షేమానికి, ఆదాయ వృద్ధికి ఉద్దేశించిన ప్రాధాన్యతా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత వ్యవసాయ రంగం అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, ప్రపంచానికి ఆహార భాండాగారంగా మారే దిశగా పయనిస్తోందని శ్రీ చౌహాన్ అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణం కొత్త శిఖరాలకు చేరుకుందని, ఇప్పుడు భారతదేశ పురోగతిని గత ప్రభుత్వాలతో పోల్చకుండా ప్రపంచ ప్రమాణాలతో కొలుస్తారని కేంద్ర మంత్రి అన్నారు.
ఆహార భద్రత కల్పించడం, రైతుల ఆదాయాలను పెంచడం, పౌష్టికాహార ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయని శ్రీ చౌహాన్ అన్నారు. 2014 నుంచి, భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 40% పెరిగింది, గోధుమ, బియ్యం, మొక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్లలో రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చాయి. “ఈరోజు, భారతదేశం గోధుమ, బియ్యం విషయంలో పూర్తిగా స్వయం సమృద్ధి సాధించింది, నాలుగు కోట్ల టన్నులకు పైగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేశాం. అయితే, పప్పుధాన్యాల విషయంలో మనం సాధించాల్సింది ఇంకా ఉంది” అని ఆయన పేర్కొన్నారు.
పప్పుధాన్యాలలో స్వావలంబన సాధించవలసిన అవసరాన్ని ప్రస్తావిస్తూ, మన దేశం పప్పుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు, వినియోగదారు అయినప్పటికీ, ఇంకా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోందని శ్రీ చౌహాన్ అన్నారు. అందువల్ల, ఉత్పత్తి, ఉత్పాదకత, సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం పప్పుధాన్యాల స్వావలంబన మిషన్‌ను ప్రారంభించిందని, 2030-31 నాటికి మొత్తం పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని 27.5 మిలియన్ హెక్టార్ల నుంచి 31 మిలియన్ హెక్టార్లకు విస్తరించడం, ఉత్పత్తిని 24.2 మిలియన్ టన్నుల నుంచి 35 మిలియన్ టన్నులకు, ఉత్పాదకతను హెక్టారుకు 880 కిలోల నుంచి 1,130 కిలోలకు పెంచడం ఈ మిషన్ లక్ష్యమని ఆయన వివరించారు.
ఈ లక్ష్యాలను సాధించడానికి బలమైన పరిశోధన, అభివృద్ధి వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో భాగంగా తెగుళ్లను నిరోధించి, వాతావరణ ప్రతికూలతలను తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేయడం, వాటిని రైతులకు సకాలంలో అందించడంపై దృష్టి పెడతారు. మినీ కిట్ల ద్వారా అధిక నాణ్యత గల విత్తనాలను పంపిణీ చేస్తారు. రైతులకు 1.26 కోట్ల క్వింటాళ్ల సర్టిఫైడ్ విత్తనాలు, 88 లక్షల ఉచిత విత్తన కిట్లను అందిస్తారు.
పప్పుధాన్యాలు పండించే ప్రాంతాల్లో రైతులకు మంచి ధరలు లభించేలా, స్థానిక విలువ జోడింపును ప్రోత్సహించేందుకు 1,000 ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ చౌహాన్ ప్రకటించారు. ప్రతి యూనిట్‌కు ప్రభుత్వం రూ. 25 లక్షల సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మొత్తం వ్యవసాయ యంత్రాంగం 'ఒకే దేశం, ఒకే వ్యవసాయం, ఒకే జట్టు‘ అనే దార్శనికతతో పనిచేస్తుంది.
పీఎం ధన-ధాన్య యోజన గురించి మాట్లాడుతూ, వ్యవసాయ ఉత్పాదకత రాష్ట్రాల మధ్య, ఒకే రాష్ట్రంలోని జిల్లాల మధ్య కూడా మారుతూ ఉంటుందని శ్రీ చౌహాన్ అన్నారు. ఈ అసమానతను పరిష్కరించడానికి, ప్రభుత్వం తక్కువ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాలను గుర్తించి, ఉత్పాదకతను పెంచడానికి లక్ష్య ఆధారిత చర్యలను అమలు చేస్తుంది. నీటిపారుదల సౌకర్యాన్ని మెరుగుపరచడం, నిల్వ సౌకర్యాలను బలోపేతం చేయడం, రుణ సదుపాయాన్ని విస్తరించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడంపై ఈ ప్రయత్నాలు దృష్టి సారిస్తాయి.
ఈ కార్యక్రమానికి ఆకాంక్ష జిల్లాల నమూనా స్ఫూర్తి అని, దీనిని డాష్‌బోర్డ్ ద్వారా నీతి ఆయోగ్ పర్యవేక్షిస్తుందని ఆయన చెప్పారు. "తక్కువ పనితీరు కనబరుస్తున్న జిల్లాల ఉత్పాదకతను జాతీయ సగటుకు పెంచితే మొత్తం జాతీయ ఉత్పత్తి పెరుగుతుంది. రైతుల ఆదాయాలు పెరుగుతాయి. దేశ ఆహార అవసరాలు భద్రంగా ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు.
అక్టోబర్ 11న లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి రోజున ఈ పథకం ప్రారంభం కానుండటం పట్ల శ్రీ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో దేశం సాధించిన ప్రధాన విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తారని చెప్పారు.
వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ దేవేష్ చతుర్వేది, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్, డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ మాంగీలాల్ జాట్ కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
నేపథ్యం
భారతదేశ వ్యవసాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ, రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 11, 2025 న, న్యూఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్, పూసాలో రెండు ప్రధాన కార్యక్రమాలు - పీఎం ధన-ధాన్య కృషి యోజన, పప్పుధాన్యాలలో స్వావలంబన మిషన్ - లను ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా, ప్రధానమంత్రి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభిస్తారు. పశుసంవర్ధక, మత్స్య, ఆహార శుద్ధి రంగాలకు సంబంధించిన రూ. 42,000 కోట్ల పైగా విలువైన 1,100కు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇవి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల జీవితాల్లో శ్రేయస్సు, సౌభాగ్యంతో కూడిన కొత్త శకాన్ని తీసుకువస్తాయని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వ్యవసాయ రంగానికి అత్యుత్తమ సేవలు అందించిన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓలు), సహకార సంఘాలు, ఆవిష్కర్తలను సత్కరిస్తారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ధిలో సాధించిన క్రింద పేర్కొన్న అనేక కీలక జాతీయ విజయాలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తారు,
1. వార్షిక వ్యాపారం కోటి రూపాయలు మించిన 1,100 ‘కోటిపతి ఎఫ్పీఓ‘ లతో సహా 10,000 ఎఫ్పీఓలతో 50 లక్షలమందికి పైగా రైతులు అనుసంధానమయ్యారు,
2. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద సేంద్రీయ వ్యవసాయం కోసం లక్షమందికి పైగా రైతులు ఎంపికయ్యారు.
3. 10,000 కొత్త ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్) ను ఇ-పీఏసీఎస్ లుగా కంప్యూటరీకరించడం, వాటిని కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ), ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పీఎంకేఎస్కే), ఎరువుల రిటైల్ అవుట్‌లెట్‌లుగా మార్చడం.
4. 10,000 ప్రాంతాలలో పాడి, మత్స్య సహకార సంఘాల కోసం కొత్త బహుళ ప్రయోజన పీఏసీఎస్ ల ఏర్పాటు.
5. దేశవ్యాప్తంగా 4,275 గ్రామీణ మల్టీపర్పస్ ఏఐ టెక్నీషియన్లకు (ఎంఏఐటీఆర్ఐ) సర్టిఫికేషన్.
పీఎం ధన - ధాన్య కృషి యోజన కింద, దేశవ్యాప్తంగా 100 తక్కువ ఉత్పాదకత కలిగిన జిల్లాలలో రైతుల ఆదాయాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో సమగ్ర వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ పథకం ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం, పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించడం, రుణ, నిల్వ సౌకర్యాలను సులభంగా పొందేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ప్రభుత్వ పథకాలను కలపడం ద్వారా ఈ కార్యక్రమం రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గట్టి ఊతాన్ని ఇస్తుంది.
పప్పుధాన్యాలలో స్వయంసమృద్ధి మిషన్ కంది, మినుములు, ఎర్రపప్పు వంటి ప్రధాన పప్పుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఈ మిషన్ కింద నమోదైన రైతుల నుంచి కేంద్ర ఏజెన్సీలు వారి ఉత్పత్తి మొత్తాన్ని కనీస మద్దతు ధరకు (ఎంఎస్పీ) కొనుగోలు చేస్తాయి. తద్వారా సాగుదారులకు మంచి రాబడి లభిస్తుంది. పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఒక కీలకమైన కార్యక్రమంగా సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఈ మిషన్ దోహదపడుతుంది.
మొత్తంమీద ఈ కార్యక్రమాలు రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆహార భద్రతను పటిష్టం చేయడమే కాకుండా, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తాయి. రైతుల సాధికారత, సుస్థిర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరింత బలపరుస్తాయి.
(Release ID: 2177499)
Visitor Counter : 24