వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ-నామ్ వేదిక విస్తరణ: భారత అతిపెద్ద డిజిటల్ వ్యవసాయ-వాణిజ్య వేదికను బలోపేతం చేసేందుకు 9 కొత్త ఉత్పత్తుల చేరిక
247కు చేరిన ఉత్పత్తుల సంఖ్య.. పెరిగిన పరిధితో రైతులు, వ్యాపారులకు కొత్త అవకాశాలు
Posted On:
08 OCT 2025 8:04PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) వేదికను బలోపేతం చేస్తూ మరో 9 ఉత్పత్తులను చేర్చింది. ఈ వేదికపై మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 247కు చేరింది. మార్కెట్ అనుసంధానంలో భాగంగా వస్తు లభ్యతా పరిధిని పెంచాలంటూ రైతులు, వ్యాపారులు, ఇతర వాటాదారుల నుంచి వచ్చిన డిమాండు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను కలుపుతూ పారదర్శకంగా, పోటీతత్వంతో కూడిన డిజిటల్ వాణిజ్య వేదికను రైతులు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావటం ద్వారా అవకాశాలను మెరుగుపరచాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
సంస్థలు, వ్యాపారులు, నిపుణులు, ఎస్ఎఫ్ఏసీతో విస్తృతంగా చర్చించి, ఈ-నామ్ వేదికలోని ఉత్పత్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన వాణిజ్య ప్రమాణాలను మార్కెటింగ్, తనిఖీల విభాగం (డీఎంఐ) రూపొందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహన్ కూడా దీనిని ఆమోదించారు.
వాణిజ్య ప్రమాణాలు ఉండటం వల్ల మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోవడంతోపాటు, రైతు- తన ఉత్పత్తులకు మంచి ధరను పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం పారదర్శకమైన వాణిజ్య వ్యవస్థను ప్రోత్సహించటంతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడి, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడుతుంది.
ఈ-నామ్ వేదికపై క్రయ విక్రయాలు జరుగుతున్న 238 వ్యవసాయ ఉత్పత్తులకు వాణిజ్య ప్రమాణాలను డీఎంఐ రూపొందించింది. కొత్తగా 9 ఉత్పత్తులను చేర్చటం ద్వారా మొత్తం ఉత్పత్తుల సంఖ్య 247కి పెరగటంతో వేదిక పరిధి, ప్రభావం మరింత విస్తృతమవుతాయి. కొత్తగా చేర్చిన 9 కొత్త ఉత్పత్తులు:
-
గ్రీన్ టీ
-
టీ
-
ఎండిన అశ్వగంధ వేర్లు
-
ఆవ నూనె
-
లెవెండర్ ఆయిల్
-
మెంతి నూనె
-
వర్జిన్ ఆలివ్ ఆయిల్
-
ఎండిన లెవెండర్ పువ్వులు
-
నూకలు
వాణిజ్య ప్రమాణాలు.. పంట ఉత్పత్తులకు నాణ్యతా శ్రేణిని, స్థాయిని నిర్ణయించటం వలన ధరలు నాణ్యతతో ముడిపడి ఉంటాయి. దీంతో రైతులు తమ పంటలకు మెరుగైన ధరను పొందుతారు.
తాజాగా ఆమోదించిన వాణిజ్య ప్రమాణాలు ఇప్పుడు ఈ-నామ్ పోర్టల్ (enam.gov.in)లో అందుబాటులో ఉండటంతో ఈ వేదిక పారదర్శకమైన, నాణ్యతా-ఆధారిత మార్కెట్ గా తన పాత్రను మరింత బలపరచుకుంది. ఈ వేదిక ద్వారా రైతులు విస్తృత స్థాయి మార్కెట్లను చేరుకోవటానికి, లాభదాయకమైన ధరలను పొందటానికి, నాణ్యాతా ప్రమాణాల ద్వారా ప్రయోజనాలు పొందే వీలుంటుంది. దీంతో రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
పారదర్శకమైన డిజిటల్ వేదిక ద్వారా రైతులకు సాధికారత కల్పిస్తూ, నాణ్యతాధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయ రంగంలో సమ్మిళిత వృద్ధిని పెంచాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
***
(Release ID: 2176676)
Visitor Counter : 15