రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

93వ భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2025 5:20PM by PIB Hyderabad

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 93వ వార్షికోత్సవ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వైమానిక దళ సిబ్బందికి, మాజీ సిబ్బందికి, అధికారులకు, వారి కుటుంబాలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వైమానిక శక్తి వ్యూహాత్మక ఫలితాలను ఎలా రాబడుతుందో అనేకసార్లు ఐఏఎఫ్ నిరూపించినదని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రువుల భూభాగంలోకి ప్రవేశించి కచ్చితత్వంతో దాడి చేసే మన సామర్థ్యాన్ని వైమానిక దళం మరోసారి ప్రపంచానికి స్పష్టం చేసిందన్నారు.

శత్రు విమానాలు, వైమానిక ఆయుధాలు, డ్రోన్‌లను సమర్థంగా గుర్తించి.. వాటిని నిర్వీర్యం చేయడం కోసం గల సంక్లిష్టమైన సెన్సార్లు, రాడార్‌లతో కూడిన ఐఏఎఫ్ నెట్‌వర్క్‌ను సీడీఎస్ ప్రశంసించారు. భారత వాయుసేన విభాగాల మద్దతుతో ఐఏఎఫ్‌కు చెందిన సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి (ఎస్ఏఎమ్), కౌంటర్-అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (సీయూఏఎస్) యూనిట్లు.. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (ఐఏసీసీఎస్) ఆధ్వర్యంలో అద్భుతంగా పని చేస్తూ ఆపరేషన్ సిందూర్ సమయంలో సత్ఫలితాలు సాధించాయని ఆయన తెలిపారు. స్వదేశీ ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించడం, అధునాతన ఆయుధ వ్యవస్థలను అమలుచేయడం, మొత్తం ఏరోస్పేస్ వ్యవస్థ వ్యాప్తంగా అమలయ్యే నియమ నిబంధనలను నవీకరించడం ద్వారా ఆధునికీకరణ దిశగా పురోగమిస్తున్న ఐఏఎఫ్ నిరంతర ప్రయత్నాలను సీడీఎస్ కొనియాడారు.

యుద్ధం పరిణామం చెందే తీరును జనరల్ అనిల్ చౌహాన్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. "యుద్ధ స్వభావం తీవ్రమైన మార్పులకు లోనవుతోంది. భవిష్యత్తులో సంఘర్షణలు సాంకేతికత ఆధారితంగా, మరింత వేగంగా, బహుళ రంగాల్లో పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆధునిక యుద్ధాలను గెలవడంలో వైమానిక శక్తి కీలకం కానుంది" అని అన్నారు. యుద్ధంలోనూ, మానవతా కార్యకలాపాల్లోనూ ధైర్యం, వృత్తి నైపుణ్యం, దేశానికి సేవ చేయడమనే విశిష్ట వారసత్వాన్ని ఐఏఎఫ్ కొనసాగిస్తోందని సీడీఎస్ ప్రశంసించారు.

మానవతా సాయంలోనూ, విపత్తు సహాయ కార్యకలాపాల (హెచ్ఏడీఆర్) సమయంలోనూ నమ్మదగిన తోడుగా అందరి కన్నా ముందుగా ఐఏఎఫ్ రంగంలోకి దిగుతుందని సీడీఎస్ తెలిపారు. "సంఘర్షణ ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడం ద్వారా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కీలక సహాయాన్ని అందించడం ద్వారా ఐఏఎఫ్ నిరంతరం విస్తరిస్తున్న తన పరిధిని, వేగవంతమైన స్పందనను ప్రదర్శిస్తోంది" అన్నారు. దశాబ్దాలుగా దేశ గగనతలాన్ని రక్షిస్తూనే.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరులకూ సహాయం చేస్తూ ఐఏఎఫ్ శౌర్యానికి చిహ్నంగా నిలుస్తోందని సీడీఎస్ వ్యాఖ్యానించారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2176526) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Punjabi