ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నాణ్యతతో కూడిన డిజిటల్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్
డామన్ (దాద్రా నగర్ హవేలి- డామన్ డయ్యుా), ముజఫర్‌పూర్ (బీహార్), బాలాసోర్ (ఒడిశా), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), లుంగ్లీలలో (మిజోరాం) ఐదు కొత్త ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలను వర్చువల్‍గా ప్రారంభించిన మంత్రి
టాప్ 500 కంపెనీలతో చర్చించి.. ‘పాఠ్యాంశాలను మీరే నిర్ణయించండి’ అనే ఆలోచనతో
అవగాహన ఒప్పందాలు చేసుకోనున్న ఎన్ఐఈఎల్ఐటీ: శ్రీ అశ్వినీ వైష్ణవ్
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఐఈఎల్ఐటీ కోర్సుల్లో మార్పు: శ్రీ అశ్వినీ వైష్ణవ్
మైక్రోసాఫ్ట్, జెడ్‌స్కేలర్, సీసీఆర్‌వైఎన్, డిక్సన్ టెక్, ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్‌లతో
ఎన్ఐఈఎల్ఐటీ చేసుకున్న ఒప్పందాలను మార్చుకున్న ఉభయ పక్షాలు
प्रविष्टि तिथि:
02 OCT 2025 8:37PM by PIB Hyderabad
ఢిల్లీలో ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని (ఎన్‌డీయూ) కేంద్ర రైల్వేలు, ఎలక్ట్రానిక్స్- ఐటీ, సమాచార- ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. అధిక నాణ్యతతో కూడిన డిజిటల్ విద్యను అందరికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఈ వేదికను రూపొందించారు.
ఇది ఏఐ, సైబర్ భద్రత, డేటా సైన్స్, సెమీకండక్టర్లు, అనుబంధ రంగాల వంటి ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానాలలో పరిశ్రమలకు అవసరమైన విధంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టనుంది. ఇది యువతను భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి సౌకర్యవంతమైన డిజిటల్ బోధన పద్ధతులు, వర్చువల్ ప్రయోగశాలలను అందిస్తుంది.
ముజఫర్‌పూర్ (బీహార్), బాలాసోర్ (ఒడిశా), తిరుపతి (ఆంధ్రప్రదేశ్), డామన్ (దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూ), లుంగ్లీలలో (మిజోరాం) అయిదు కొత్త ఎన్ఐఈఎల్‌టీ కేంద్రాలను కూడా వర్చువల్ పద్ధతిలో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఈ కొత్త కేంద్రాలతో భారతదేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎన్ఐఈఎల్ఐటీ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్, జెడ్‌స్కేలర్, సీసీఆర్‌వైఎన్, డిక్సన్ టెక్, ఫ్యూచర్ క్రైమ్ రీసెర్చ్ ఫౌండేషన్‌లతో ఎన్ఐఈఎల్ఐటీ చేసుకున్న అవగాహన ఒప్పందాలను (ఎంఓయూ) కూడా సంబంధిత సంస్థల ప్రతినిధులు మార్చుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. “మూడు సంవత్సరాల క్రితం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంలో పలు రకాల మార్గాలున్నప్పటికీ.. ఎన్ఐఈఎల్ఐటీనే ఉత్తమ మార్గంగా ఉంది. భాగస్వామ్యాలు ఏర్పాటుచేసుకునేందుకు 500 కంపెనీల జాబితాను మనం తయారుచేయాలి. ఇవి తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీకి మాత్రమే సంబంధించివై ఉండాల్సిన అవసరం లేదు. ఈ సాంకేతికతలు ఇప్పుడు ప్రతి రంగంలో ఉపయోగపడతున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ అవసరాలు ఎక్కడున్నా.. దానికి తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, సిద్ధం చేయడం మన లక్ష్యం. నేడు కేవలం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగమే రూ. 13 లక్షల కోట్ల విలువైన పరిశ్రమగా తయారైంది. ఎన్ఐఈఎల్ఐటీ సమీప భవిష్యత్తులో ఇంకా గొప్ప ఘనతనలు సాధిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను” అని అన్నారు.
ఈ అవగాహన ఒప్పందాల ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. పరిశ్రమ, విద్యా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన ఒప్పందాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎన్ఐఈఎల్ఐటీ టాప్ 500 కంపెనీలతో చర్చించి.. "పాఠ్యాంశాలను మీరే నిర్ణయించండి" అనే నినాదాన్ని అనుసరిస్తూ అవగాహన ఒప్పందాలు చేసుకోవటం ద్వారా కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తయారుచేయాలని తెలిపారు.
కోర్సులు విస్తృతంగా అందుబాటులో ఉన్న దృష్ట్యా.. ఎన్‌డీయూను ప్రారంభించటం ఒక ముఖ్యమైన ఘట్టమని ఎంఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణన్ అన్నారు. మంచి విద్యా శిక్షణ సంస్థల కొరత ఉన్న చాలా క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలు ఉన్నాయని.. ఇది అత్యాధునిక మౌలిక సదుపాయాల ద్వారా మారుమూల ప్రాంతాలకు సాంకేతిక విద్యను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎన్‌డీయూను ప్రారంభించటంతో.. నైపుణ్యం, ఉపాధికి కావాల్సిన నైపుణ్యాలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించడంలో ఎన్ఐఈఎల్ఐటీ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.
ఎలక్ట్రానిక్స్ విషయంలో ఎన్ఐఈఎల్ఐటీ అందించే కోర్సులు డిజైన్, తయారీ పరంగా మంచి సమతుల్యంతో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇదే ఉత్తేజంతో రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీలో ఎన్ఐఈఎల్ఐటీ కీలక పాత్ర పోషించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
డిజిటల్ పురోగతిలో దేశవ్యాప్త ఐక్యత: ఈశాన్య భారత్ అనుసంధానతను ప్రత్యేకంగా తెలియజేసేలా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.
ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ విజేంద్ర చౌదరి.. ముజఫర్‌పూర్ నుంచి పంచాయతీరాజ్ మంత్రి శ్రీ కేదార్ ప్రసాద్ గుప్తా.. బాలసోర్ నుంచి ఎంపీ శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి.. తూర్పు లుంగ్లీ నుంచి ఎమ్మెల్యే శ్రీ టి. లాల్హ్లింపుయా.. డామన్ నుంచి ఎంపీ శ్రీ ఉమేష్ భాయ్ పటేల్.. తిరుపతి నుంచి ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈశాన్య భారత్‌కు చెందిన మిజోరాంలోని లుంగ్లీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. కొన్ని నెలల కిందట ఈ రాష్ట్రానికి రైల్వే అనుసంధానత వచ్చినందున ఈ ప్రాంతం డిజిటల్‌గా అనుసంధానమవుతోందని అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐఈఎల్ఐటీ విద్యార్థులు, ప్రముఖ విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులతో సహా 1,500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, ఐటీకి చెందిన వివిధ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి, అభ్యాస నమూనాలకు సంబంధించిన ఎన్ఐఈఎల్ఐటీ సామర్థ్యాలను ప్రదర్శించే ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటుచేశారు.
బృంద చర్చ-
ప్రారంభోత్సవం తర్వాత ‘చదువుల డిజిటలైజేషన్‌లో ఏఐ పాత్ర’ అనే అంశంపై వివరణాత్మక ప్యానెల్ చర్చ నిర్వహించారు. ఇందులో ఇంటెల్ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్వేతా ఖురానా, ఇన్ఫోసిస్ రెస్పాన్సిబుల్ ఏఐ విభాగాధిపతి శ్రీ ఆశిష్ తివారీ, డాక్టర్ డీ. వై. పాటిల్ ప్రతిష్ఠాన్ చైర్మన్ (ఆర్అండ్డీ, ఐఆర్) ప్రొఫెసర్ ప్రభాత్ రంజన్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విద్యా పరిశ్రమ డైరెక్టర్ డాక్టర్ విన్నీ జౌహరి, ఏఏటూఐటీ సహ వ్యవస్థాపకుడు- గ్లోబల్ సీటీఓ- భారత్ ఎండీ డాక్టర్ రిషి మోహన్ భట్నాగర్, బార్కో ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యక్షులు- సాఫ్ట్వేర్ డెవలప్‌మెంట్ హెడ్ శ్రీ ఆశిష్ గుప్తా పాల్గొన్నారు. పరిశ్రమ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించాలని, డబ్ల్యూబీఎల్(వర్క్ బేస్డ్ లెర్నింగ్) అవకాశాలను పెంచటం, భారతీయ యువతకు ఉపాధి మార్గాలను బలోపేతం చేయడంపై ఇందులో చర్చించారు.
ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్‌ఫామ్
అందుబాటు ఖర్చులో ఉపాధి ఆధారిత ప్రపంచస్థాయి సమ్మిళిత డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థను సృష్టించాలన్న ఉద్దేశంతో ఎన్ఐఈఎల్ఐటీ డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని (ఎన్‌డీయూ డిజిటల్) తయారు చేశారు. డిజిటల్ ఇండియా, ఎన్ఈపీ 2020, స్కిల్ ఇండియా లక్ష్యాలకు మద్దతునివ్వటం.. కృత్రిమ మేధ, సెమీకండక్టర్స్, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి వర్థమాన సాంకేతికతలలో ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వ మానవ వనరులను తయారుచేయటంతో పాటు అధిక-నాణ్యత డిజిటల్ విద్యకు అందరికి అందేలా చూసుకోవాలన్న లక్ష్యంతో ఈ వేదికను తీసుకొచ్చారు. ఇది అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) ద్వారా క్రెడిట్ల బదిలీ, పరిశ్రమతో అనుసంధానమైన కోర్సులు, వర్చువల్ ల్యాబ్‌లు, బహుభాషా అభ్యాసం, తనిఖీ అయిన డిజిటల్ ధ్రువపత్రాల ద్వారా ఎన్‌సీవీఈటీ ఆమోదించిన, ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయి కోర్సులను అందిస్తుంది. జీవన మార్గాలు, మార్గదర్శకులు, ఇంటర్వ్యూ సిమ్యులేటర్లు, ఇంటరాక్టివ్ నమూనాలు వంటి ఏఐ ఆధారిత సాధనాలతో దేశవ్యాప్తంగా అభ్యాసకులను శక్తిమంతం చేయాలని భావిస్తోంది. 2030 నాటికి 40 లక్షల మంది అభ్యాసకులను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది.
ఎన్ఐఈఎల్ఐటీ:
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు (ఎంఈఐటీవై) చెందిన స్వయం ప్రతిపత్తి గల శాస్త్ర విజ్ఞాన సంస్థ ఎన్ఐఈఎల్ఐటీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).. నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సాధికారతలో మార్గదర్శక సంస్థగా ఉంది.
56 ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలు, 750కి పైగా గుర్తింపు పొందిన సంస్థలు, 9,000 కంటే ఎక్కువ ఉపకేంద్రాలు ( ఫెసిలిటేషన్ కేంద్రాలు) విస్తృత నెట్‌వర్క్‌తో ఎలక్ట్రానిక్స్, ఐసీటీకి సంబంధించిన అధునాతన సాంకేతికతల్లో లక్షలాది విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిస్తూ ధ్రువపత్రాలను ఇచ్చింది.
విద్యా మంత్రిత్వ శాఖ ఎన్ఐటీఎల్ఐటీకి ప్రత్యేక విభాగం కింద "డీమ్డ్ విశ్వవిద్యాలయ" హోదాను ఇచ్చింది. ఎన్ఐఈఎల్ఐటీ ప్రధాన క్యాంపస్ పంజాబ్‌లోని రోపర్‌లో ఉంది. ఐజ్వాల్, అగర్తల, ఔరంగాబాద్, కాలికట్, గోరఖ్‌పూర్, ఇంఫాల్, ఇటానగర్, అజ్మీర్ (కేక్రి), కోహిమా, పాట్నా, శ్రీనగర్‌లలో అనుబంధ క్యాంపస్‌లు ఉన్నాయి. డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి ఎలక్ట్రానిక్స్, ఐసీటీకి సంబంధించిన ఉన్నత విద్యలో భారీ మార్పులు తీసుకురావాలని ఎన్ఐటీఎల్ఐటీ లక్ష్యంగా పెట్టుకుంది.
***
(रिलीज़ आईडी: 2174355)
आगंतुक पटल : 20