రక్షణ మంత్రిత్వ శాఖ
పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసి.. భారత నిర్ణయాత్మక సామర్థ్యాన్ని నిరూపించిన ఆపరేషన్ సిందూర్: రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
సర్ క్రీక్ సెక్టార్‌లో పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే నిర్ణయాత్మక ప్రతిస్పందన తప్పదు
సమాధానం చాలా బలంగా ఉంటుంది.. అది చరిత్రను, భౌగోళిక రూపురేఖలనూ మారుస్తుంది
విజయదశమిని పురస్కరించుకుని గుజరాత్‌లోని భుజ్‌లో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆయుధ పూజలు
న్యాయాన్నీ, ధర్మాన్నీ కాపాడటానికే ఆయుధ ప్రయోగం: ఆయుధ పూజ సందర్భంగా రక్షణ మంత్రి
Posted On:
02 OCT 2025 1:07PM by PIB Hyderabad
విజయదశమి సందర్భంగా గుజరాత్‌లోని భుజ్ మిలిటరీ స్టేషన్‌లో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు ఆయుధ పూజ నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత రక్షణ వ్యవస్థపై దాడికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్న భారత సాయుధ దళాలను రక్షణ మంత్రి ప్రశంసించారు. "లే నుంచి సర్ క్రీక్ సెక్టార్ వరకు పాకిస్తాన్ భారత రక్షణలోని భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించింది.. కానీ భారత దళాల వేగవంతమైన, ప్రభావవంతమైన ప్రతిఘటన పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థలోని బలహీనతలను బహిర్గతం చేసింది. భారత్ తాను ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో, పద్ధతిలో భారీ నష్టాన్ని కలిగించగలదని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపింది" అని ఆయన వ్యాఖ్యానించారు.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి భారత్ పదేపదే ప్రయత్నిస్తున్నప్పటికీ.. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా సర్ క్రీక్ సెక్టార్ విషయంలో పాకిస్తాన్ వివాదాలు సృష్టిస్తూనే ఉందన్నారు. సర్ క్రీక్ సెక్టార్‌లో పాకిస్తాన్ ఇటీవల సైనిక మౌలిక సదుపాయాలను విస్తరించడం దాని దురుద్దేశాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. సర్ క్రీక్ సెక్టార్‌లో పాకిస్తాన్ చేసే ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే, నిర్ణయాత్మక ప్రతిస్పందన తప్పదని రక్షణ మంత్రి హెచ్చరించారు. "సర్ క్రీక్ సెక్టార్‌లో పాక్ దుస్సాహసం చేసే పక్షంలో, భారత్ ఇచ్చే సమాధానం చాలా బలంగా ఉంటుంది. అది చరిత్రను, భౌగోళిక రూపురేఖలనూ మారుస్తుంది. 1965లో భారత సైన్యం లాహోర్‌కు చేరుకోవడం ద్వారా తమ ధైర్యాన్ని చూపించింది.. 2025లో కరాచీకి వెళ్లే మార్గం క్రీక్ గుండానే వెళుతుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.
రికార్డు సమయంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం పట్ల రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. సాయుధ దళాల సంపూర్ణ సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తన ప్రత్యర్థులను ఓడించగల భారత్ సామర్థ్యాన్ని నిరూపించిన సైనికులు-అధికారుల వ్యూహం, ధైర్యం, సామర్థ్యాలను ఆయన అభినందించారు.
ఆపరేషన్ సిందూర్ ప్రధాన లక్ష్యం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే అయినా సంఘర్షణలు చెలరేగకుండా భారత్ సంయమనాన్ని ప్రదర్శించిందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా సైనిక లక్ష్యాలన్నీ విజయవంతంగా సాధించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం పూర్తి దృఢ సంకల్పంతో కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. భారత సాయుధ దళాలూ, సరిహద్దు భద్రతా దళం నిరంతర అప్రమత్తతో దేశ సరిహద్దులను కాపాడుతున్నాయని రక్షణ మంత్రి తెలిపారు.
ఆయుధ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదనీ.. భారత నాగరికతలోని తాత్వికతను ప్రతిబింబిస్తుందని సాయుధ దళాలనుద్దేశించి చేసిన ప్రసంగంలో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆయుధాలను హింసకు సాధనాలుగా కాకుండా ధర్మ పరిరక్షణ సాధనాలుగా పరిగణిస్తారని తెలిపారు. రైతులు నాగలిని పూజించడం.. విద్యార్థులు తమ పుస్తకాలను గౌరవించడం.. సైనికులు తమ ఆయుధాలను గౌరవించడం భారత సంప్రదాయంలోని గొప్పతమని ఆయన పేర్కొన్నారు. న్యాయం-ధర్మాన్ని కాపాడుకోవడానికే ఆయుధాలను ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు.
"తనను తాను రక్షించుకునే శక్తి లేని జ్ఞానం దుర్బలమైనది. జ్ఞాన మార్గదర్శనం లేని శక్తీ గందరగోళానికి దారితీస్తుంది. శాస్త్రం- శస్త్రం సమతుల్యత మన నాగరికతను శక్తిమంతంగా, అజేయంగా ఉంచుతుంది," అని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.
ఎల్లప్పుడూ జ్ఞానంతో సుసంపన్నంగా ఉండే భారత్ నేడు రక్షణ తయారీలోనూ స్వయం-సమృద్ధి సాధిస్తున్నదని రక్షణ మంత్రి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా భారత్ రక్షణ పరికరాల తయారీదారుగా, ఎగుమతిదారుగా అభివృద్ధి చెందుతోందన్నారు.
సైన్యం, నావికాదళం, వైమానిక దళాల సమష్టి పనితీరునూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ త్రివిద దళాలను భారత జాతీయ భద్రతకు మూడు బలమైన స్తంభాలుగా ఆయన అభివర్ణించారు. ఈ రంగంలో నిర్వహించిన వరుణాస్త్ర ప్రక్రియను గురించి ప్రస్తావిస్తూ.. ఇది త్రివిధ దళాల సంయుక్త కార్యాచరణ సామర్థ్యాన్నీ, ఏదైనా ముప్పును తిప్పికొట్టడంలో వారి సంసిద్ధతను ప్రదర్శించిందన్నారు.
శస్త్ర ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూనే దేశ సరిహద్దుల్లోని సవాళ్లనూ రక్షణ మంత్రి ప్రస్తావించారు. సవాళ్లు ఎప్పుడూ సరళంగా ఉండవనీ, అవి వేర్వేరు రూపాల్లో వస్తాయని ఆయన అన్నారు. "కొన్నిసార్లు ఈ సవాళ్లు విదేశీ దురాక్రమణ రూపంలో, కొన్నిసార్లు ఉగ్రవాద సంస్థలుగా, నేటి ప్రపంచంలో సైబర్ యుద్ధం, సమాచార యుద్ధం రూపంలోనూ కనిపిస్తాయి" అని ఆయన తెలిపారు.
విజయదశమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్.. చెడు ఎంత శక్తిమంతమైనదిగా కనిపించినప్పటికీ చివరికి విజయం సాధించేది ధర్మమేనని ఈ పండగ మనకు గుర్తుచేస్తుందన్నారు. "ఈ రోజున ఆయుధ పూజ భారత జాతీయ జీవనంతో లోతుగా ముడిపడి ఉంది. దేశ సమష్టి బలం, భద్రత, స్వేచ్ఛ పట్ల గౌరవాన్ని ఇది సూచిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. సాయుధ దళాల ధైర్యం, వ్యూహం, సామర్థ్యాలనూ రక్షణ మంత్రి ప్రశంసించారు. వారి సంసిద్ధత, సంకల్పం భారత సార్వభౌమత్వాన్నీ, సమగ్రతను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందన్నారు.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన రక్షణ మంత్రి.. మహాత్మాగాంధీని నైతిక ధైర్యానికి అసలైన ఉదాహరణగా అభివర్ణించారు. గాంధీజీ తన ఆత్మ శక్తితో మాత్రమే ఆ కాలంలోని బలమైన సామ్రాజ్యాన్ని తలవంచేలా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. "మన సైనికులు ధైర్యం, ఆయుధాలు రెండింటినీ కలిగి ఉన్నారు. వారి సంకల్పం ముందు ఏ సవాలూ నిలువలేదు" అని ఆయన స్పష్టం చేశారు.
వ్యూహాత్మక క్రీక్ సెక్టార్‌లో టైడల్ ఇండిపెండెంట్ బెర్తింగ్ ఫెసిలిటీ, జాయింట్ కంట్రోల్ సెంటర్ (జేసీసీ)లనూ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సౌకర్యాలు సమగ్ర తీరప్రాంత కార్యకలాపాలకు ఎంతో సహాయకరంగా ఉంటాయన్నారు. అదే సమయంలో ఉమ్మడి కార్యాచరణ సామర్థ్యాన్ని, తీరప్రాంత భద్రతా సమన్వయాన్ని, ఏవైనా ముప్పుల కోసం వేగవంతమైన ప్రతిస్పందననూ ఇవి గణనీయంగా మెరుగుపరుస్తాయని తెలిపారు. భుజ్ మిలిటరీ స్టేషన్‌లోని బలగాలతో రక్షణ మంత్రి సంభాషించారు.
ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, సదరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్, జోధ్‌పూర్‌లోని 12 కార్ప్స్ కమాండర్.. లెఫ్టినెంట్ జనరల్ ఆదిత్య విక్రమ్ సింగ్ రాఠీ, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఎయిర్ కమోడోర్ కేపీఎస్ ధామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2174352)
Visitor Counter : 10