రక్షణ మంత్రిత్వ శాఖ
‘ఆపరేషన్ సింధూర్ విజయసాధనలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, వనరుల వినియోగాన్ని మెరుగుపరచడం, కార్యాచరణ సంసిద్ధతను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించిన డీఏడీ: రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
ఇది కేవలం లెక్కల విభాగం మాత్రమే కాదు... దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు దోహదపడే ఒక శక్తివంతమైన సాధనం. ఆర్థిక వ్యవస్థ, సాయుధ దళాలను కలిపే అదృశ్య వంతెన
రక్షణ బడ్జెట్‌ను సంరక్షించడంలో, భవిష్యత్తు సైనిక సామర్థ్యాలను నిర్మించేందుకు పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడంలో రక్షణ ఖాతాల విభాగం పాత్ర ఎంతో కీలకం
డిజిటల్ సంస్కరణల ద్వారా సాంకేతికత ఆధారిత సామర్థ్యం, పారదర్శకతను ముందుకు తీసుకెళ్తున్న డీఏడీ
దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌గా శక్తిమంతంగా మార్చేందుకు ముందుకు నడిపిస్తోంది...
ఐక్యత, సమన్వయానికి ఆర్థిక సహాయకారిగా పనిచేయాలని డీఏడీని కోరిన రక్షణ మంత్రి, గ్రామీణ స్థాయి నుంచి ప్రధాన కార్యాలయాల వరకు విస్తరించిన సేవలను ప్రశంసించిన కేంద్ర మంత్రి
प्रविष्टि तिथि:
01 OCT 2025 2:02PM by PIB Hyderabad
"ఆపరేషన్ సిందూర్" సమయంలో చారిత్రాత్మక, నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో భారత సాయుధ దళాలు చూపిన శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అయితే యుద్ధ సన్నద్ధత, ఆర్థిక నిర్వహణ, వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడంలో రక్షణ ఖాతాల విభాగం మౌనంగా ఉంటూనే కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. న్యూఢిల్లీలో 2025 అక్టోబర్ 1న నిర్వహించిన డీఏడీ 278వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రక్షణమంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డీఏడీ చారిత్రక వారసత్వాన్ని, భారత సాయుధ దళాలకు ఆర్థిక వెన్నుగా ఉంటూ అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డీఏడీ కేవలం ఆర్థిక నియంత్రణ, పారదర్శకతను కాపాడే సంస్థ మాత్రమే కాదని, సేవలకు అవసరమైన వనరులను సమయానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ కార్యాచరణ సంసిద్ధతను బలోపేతం చేసే వ్యవస్థగా కూడా అభివర్ణించారు.
‘‘డీఏడీ కేవలం లెక్కల విభాగం మాత్రమే కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడే శక్తిమంతమైన సాధనం. ఇది ఆర్థిక వ్యవస్థను, సాయుధ దళాలను కలిపే అదృశ్య వంతెన. మన సైనికుల శౌర్యం వెనుక మీ నిశ్శబ్దమైన, నిర్ణయాత్మకమైన సహకారం ఉంది’’ అని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
బలమైన ఆర్థిక క్రమశిక్షణ
ఆర్థిక వ్యవస్థను పరిపాలనకు ప్రాణాధారంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.‘‘ఒక దేశ బలాన్ని దాని ఆర్థిక పునాదుల బలమే ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు. దేశ పరిపాలన వ్యవస్థ, రక్షణ యంత్రాంగం సజావుగా పనిచేయాలంటే స్థిరమైన ఆర్థిక ప్రవాహం అత్యంత అవసరమని ఆయన అన్నారు.
2025 సెప్టెంబర్ 30 నాటికి మూలధన బడ్జెట్ వ్యయంలో 50 శాతం ఇప్పటికే ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇది వనరుల సమర్థ వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం బడ్జెట్టును వినియోగించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. అదే ఉత్సాహం, వేగం, పనితీరు ఈ ఏఏడాది కూడా కొనసాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
సాంకేతిక ఆధారిత సంస్కరణలు
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రక్షణ ఖాతా విభాగం చూపుతున్న ఆసక్తిని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ-రక్షా ఆవాస్ ప్రాజెక్ట్ విజయాన్ని, నిధి 1.0 నుంచి నిధి 2.0 కు అప్‌గ్రేడ్‌ను, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న తులిప్ 2.0 మార్పులు ఆర్థిక వ్యవహారాల్లో సమర్థతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. కృత్రిమ మేధో చాట్‌బాట్ ‘జ్ఞాన సాథి’ ను డీఏడీ స్వయంగా అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇది నిబంధనలు, విధానాలపై ఖచ్చితమైన సమాచారం అందించేందుకు రూపొందించినట్లు చెప్పారు.
‘‘ఈ ప్రగతిశీల సంస్కరణలు, సమర్థత, పారదర్శకత కోసం సాంకేతికతను స్వీకరించడంలో డీఏడీ చూపుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తాయి. ఇవి డిజిటల్‌గా సాధికారత పొందిన రక్షణ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లాలనే దేశ సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి అన్నారు.
పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం
ఆధునిక సాంకేతికత ఆధారిత యుద్ధాల సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘నేటి యుద్ధాల్లో సాంకేతికత ఆధారిత కొత్త పరిజ్ఞానాలు తరుచుగా ఆశ్చర్యకరమైన అంశాలుగా మారుతున్నాయి. ఇవి అనేక సంవత్సరాల పరిశోధన, అభివృద్ధి ఫలితం. అందుకే రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించే ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను సృష్టించడం అత్యవసరం’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఐ-డెక్స్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్, డీఆర్డీఓ ప్రాజెక్టులు వంటి ప్రభుత్వ కార్యక్రమాలను పేర్కొంటూ..బడ్జెట్ క్రమశిక్షణను కాపాడుతూనే, ఈ రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం అందించడంలో రక్షణ ఖాతాల విభాగం చురుకైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
“రక్షణ బడ్జెట్ సంరక్షకులుగా.. మన సాయుధ దళాల భవిష్యత్తు సామర్థ్యాలను పెంపొందించేందుకు పరిశోధన, అభివృద్ధికి మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం మీ కీలక బాధ్యత” అని ఆయన స్పష్టం చేశారు.
సాయుధ దళాల మధ్య ఐక్యత
త్రివిధ దళాల మధ్య ఐక్యత, సమన్వయాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియకు డీఏడీ ఆర్థికంగా దోహదపడేలా వ్యవహరించాలని ఆయన కోరారు. “అట్టడుగు స్థాయి నుంచి త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాల వరకు ఉనికిని కలిగి ఉన్న అతికొద్ది సంస్థలలో మీరు ఒకరు. ఈ దళాలతో సమీపంగా పనిచేసి, ఆర్థిక ప్రక్రియల ద్వారా ఐక్యత, సమన్వయాన్ని ఎలా పెంచుకోవచ్చో అన్వేషించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది మన త్రివిధ దళాల పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది.’’అని ఆయన పేర్కొన్నారు.
కొనుగోలు సంస్కరణలు
రక్షణ (ఆదాయం, మూలధనం రెండింటిలోనూ) కొనుగోళ్లలో వేగం, సామర్థ్యం అవసరమని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, పేర్కొన్నారు. ఆదాయ కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు వావలంబనను ప్రోత్సహించేందుకు కొత్తగా రక్షణ కొనుగోలు మాన్యువల్ 2025 ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.. అదేవిధంగా రక్షణ సముపార్జన విధానంపై సమీక్ష ప్రక్రియ కొనసాగుతోందని, ఇది మూలధన కొనుగోళ్లను మరింత సమర్థవంతంగా మార్చడంలో దోహదపడుతుందని తెలిపారు.
ప్రగతిశీల చర్యలకు గుర్తింపు
జీఈఎమ్ కొనుగోళ్ల ద్వారా రక్షణ ఖర్చుల ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేసేందుకు మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికలను విడుదల చేయడం వంటి చర్యలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఇది శాస్త్రీయమైన ఆర్థిక ప్రణాళిక వైపు ఇదొక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు.
కంట్రోలర్ కాన్ఫరెన్స్ లో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రస్తావిస్తూ డీఏడీని 'రక్షణ ఆర్థిక, ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ఆయన వివరించారు. దీనిని అమలు చేసేందుకు సీజీడీఏ ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఇందులో రక్షణ ఆర్థిక, ఆర్థిక శాస్త్రంపై రంగాల వారీగా నివేదికలు ఉండాలని, ఇవి భారత ఆర్థిక సర్వే లో చేర్చేలా ఉండాలని సూచించారు.
కార్యాచరణ సంసిద్ధతతో క్రమశిక్షణ సమతుల్యత
‘‘ఓవైపు మీరు ఆర్థిక నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ప్రతి రూపాయి దేశ ప్రజలదే. మరోవైపు మీరు సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించుకోవాలి. కొన్నిసార్లు ఈ రెండు బాధ్యతలు పరస్పరం విరుద్ధంగా అనిపించవచ్చు. కానీ వాస్తవానికి ఇవి ఒకదానిని మరొకటి బలపరచే విధంగా ఉంటాయి. సరైన మనస్తత్వం, సమన్వయంతో నియమాలను పాటిస్తూ త్రివిధ దళాలకు అవసరమైన వనరులను సమయానికి అందించవచ్చు’ అని రక్షణశాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ సమతుల్యతను సాధించడం బలమైన సంస్థ ముఖ్య లక్షణమని, దేశ భద్రతకు ఇది అత్యవసరమని ఆయన తెలిపారు.
రక్షణ ఖాతాల విభాగం 278వ వ్యవస్థాపక దినోత్సవం
రక్షణ ఖాతాల విభాగం 278వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పలు కీలక ప్రచురణలు, డిజిటల్ ఆవిష్కరణలను విడుదల చేశారు. ఇవి సంస్థ ఆర్థిక నిర్వహణ, ఆడిట్ సామర్థ్యాలను కొత్త దశలోకి తీసుకెళ్లేందుకు రూపొందించారు. ప్రధాన ఆవిష్కరణల్లో రక్షణ వ్యయాల సమగ్ర గణాంక నియమావళి పుస్తకం 2025, నవీకరించిన ఆర్మీ లోకల్ ఆడిట్ మాన్యువల్ ఉన్నాయి. అంతేగాక రెండు ఆధునిక డిజిటల్ వేదికలు నిధి 2.0, జ్ఙాన సాధిలను కూడా ప్రవేశపెట్టారు.
నిధి 2.0 అనేది సాధారణ ప్రావిడెంట్ ఫండ్ సబ్‌స్క్రిప్షన్‌ల కోసం సమగ్ర నిర్వహణ వ్యవస్థ. ఇది 1.7 లక్షలకిపైగా ఉద్యోగులకు సేవలందిస్తోంది. ఈ వ్యవస్థ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించగా.. దీనిలో ప్రత్యక్ష సమకాలీకరణ, పర్యవేక్షణ రికార్డులు, స్వయంచాలిత బిల్లు నిర్వహణ, సజావుగా పనిచేసే డిజిటల్ ప్రతిస్పందన వంటి లక్షణాలు ఉన్నాయి.
జ్ఞాన సాథి- ఇది కృత్రిమ మేధో ఆధారిత సహాయక వ్యవస్థ. డీఏడీలో విస్తృత మాన్యువల్స్, నిబంధనల నుంచి సమాచారం పొందేందుకు రూపొందించారు. ఇది భాగస్వాములకు తక్షణమే అధికారిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
సీఓఎస్‌ఎస్‌ఈ-2025- దేశ రక్షణ వ్యయాల సమగ్ర విశ్లేషణను అందించే సమగ్ర నియమావళి. ఇందులో అనేక పట్టికలు, గ్రాఫ్‌లు ఉంటాయి. ఇవి దేశీయ, ప్రపంచ బడ్జెట్ పోలికలను ప్రదర్శించి రక్షణ ఆర్థిక నిర్ణయాలకు సహాయపడతాయి.
ఏఎల్ఏఎమ్- ఆర్మీ యూనిట్లు, ఫార్మేషన్లలో నిల్వ, నగదు ఖాతాల ఆడిట్, తనిఖీ చేసేందుకు అవసరమైన కీలక మార్గదర్శకాలను అందిస్తుంది. అలాగే రక్షణ ఆర్థిక కార్యకలాపాల్లో బాధ్యతాయుత, పారదర్శకత నిర్వహణ కోసం నవీకరించిన విధానాలను వివరిస్తుంది.
2025 రక్షణ మంత్రి అవార్డులు – కీలక సంస్కరణలు, ప్రాజెక్టులను అమలులో విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా బృందాల ప్రతిభను గుర్తిస్తూ అవార్డులను ఈ కార్యక్రమంలో అందజేశారు. ఈ అవార్డులు రక్షణ ఆర్థిక నిర్వహణలో ఆవిష్కరణ, వృత్తి నైపుణ్యం, సమర్థతను అభినందిస్తూ.. సాయుధ దళాలకు అందించే సేవలో పారదర్శకతను పెంచేందుకు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు దోహదపడతాయి.
278 సంవత్సరాల సేవను గుర్తుచేసుకుంటూ.. 1747లో మిలిటరీ పే మాస్టర్ నియామకంతో రక్షణ ఖాతాల విభాగం ప్రారంభమైంది. దేశ సైన్యం, అనుబంధ సంస్థల ఆర్థిక నిర్వహణ అవసరాలకు నిరంతరం మద్దతు ఇచ్చే విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నేడు డీఏడీ అంతర్గత ఆడిట్, చెల్లింపు, లెక్కల నిర్వహణ, ఆర్థిక సలహా, పెన్షన్లు వంటి రంగాల్లో నైపుణ్యాన్ని అందిస్తుంది. అంతేగాక రక్షణ ఆర్థిక, ఆర్థిక శాస్త్రంలో రక్షణ మంత్రిత్వ శాఖకు కీలకమైన ‘జ్ఞాన భాగస్వామి’గా కూడా సేవలందిస్తోంది.
ఈ కార్యక్రమంలో నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి మార్షల్ ఏపీ సింగ్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, డీడీఆర్ అండ్ డీ కార్యదర్శి, డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్, ఆర్థిక సలహాదారు (రక్షణ సేవలు) డాక్టర్ మయాంక్ శర్మ, రక్షణ ఖాతాల కంట్రోలర్ జనరల్ శ్రీ రాజ్ కుమార్ అరోరా, రక్షణ మంత్రిత్వ శాఖ, సీజీడీఏ ఉన్నతాధికారులు, డీఏడీ నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2173780)
आगंतुक पटल : 41