ప్రధాన మంత్రి కార్యాలయం
సంయుక్త ప్రకటన: 2వ భారత్-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం
प्रविष्टि तिथि:
19 NOV 2024 11:22PM by PIB Hyderabad
రియో డి జనీరోలో 2024 నవంబర్ 19న జరిగిన జీ20 సందర్భంగా గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి శ్రీ ఆంథోనీ అల్బనీస్ - రెండో భారత్- ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.
2025 భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఐదో వార్షికోత్సవానికి ముందు.. వాతావరణ మార్పు- పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం- పెట్టుబడి, రక్షణ - భద్రత, విద్య - పరిశోధన, నైపుణ్యాలు, రవాణా, శాస్త్ర సాంకేతికత, ప్రాంతీయ - బహుపాక్షిక సహకారం, సామాజిక సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాలు వంటి ముఖ్యమైన రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ప్రధానమంత్రులు తెలిపారు.
మన ప్రాంత ఉమ్మడి ప్రయోజనాలపై ఇద్దరు ప్రధానులు అభిప్రాయాలను పంచుకున్నారు. సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాలకు, విస్తృతమైన ఈ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్యనున్న ఉన్నత స్థాయి, మంత్రిత్వ స్థాయి సంబంధాలను స్వాగతించిన ఇరువురు.. రానున్న కాలంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి నిబద్ధతతో ఉన్నట్లు పునరుద్ఘాటించారు. పరస్పరం ప్రయోజనాన్ని కలిగించే పనులను వేగవంతం చేసేందుకు, వాటిని కేంద్రీకృతంగా అమలు చేసేందుకు.. అలాగే మన ఉమ్మడి ప్రాంత శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించటానికి ఉద్దేశించిన కార్యక్రమాలను ప్రకటించారు.
ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులు:
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ఈసీటీఏ) కింద పెరుగుతోన్న ద్విముఖ వాణిజ్యం, వ్యాపార సంబంధాలు, వస్తు సేవలకు మార్కెట్లు అందుబాటులో ఉండటంపై ప్రధానమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక, సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) దిశగా కొనసాగుతోన్న కృషిని వారు స్వాగతించారు.
'భారత్‌లో తయారీ', 'ఫ్యూచర్ మేడ్ ఇన్ ఆస్ట్రేలియా' అనేవి పరస్పరం ప్రయోజనకర, సహకార సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఇరువురు పేర్కొన్నారు. ఇవి కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు, ఆర్థిక వృద్ధిని పెంచేందుకు, మారుతోన్న ప్రపంచంలో మన భవిష్యత్ శ్రేయస్సును భద్రపరిచేందుకు సహాయపడతాయని అంగీకరించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలియజేసేలా మరిన్ని ద్విముఖ పెట్టుబడులు పెట్టాలని ఇద్దరు నాయకులు పిలుపునిచ్చారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల మధ్య మరింత ఎక్కువ సమన్వయం సాధించేందుకు, రైండు వైపులా పరస్పరం ప్రయోజనకరమైన పెట్టుబడులను ప్రోత్సహించేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ ఎక్స్ఛేంజ్ (ఏఐబీఎక్స్) కార్యక్రమాన్ని జూలై 2024 నుంచి మరో నాలుగు సంవత్సరాలు పొడగించటాన్ని ప్రధాన మంత్రులు స్వాగతించారు. పరస్పరం ప్రయోజనకరమైన భాగస్వామ్యాలను అనుసంధానించేందుకు, ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియా, భారతదేశ సంస్థల విశ్వాసం, సామర్థ్యాలను ఏఐబీఎక్స్ నిరంతరం పెంపొందిస్తోంది.
ఇంధనం, శాస్త్ర సాంకేతికత, అంతరిక్షం
వాతావరణ కార్యచరణను ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేయటం, వేగాన్ని పెంచటం, పరస్పరం ఉపయోగపడే సామర్థ్యాలను వాడుకోవాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని భారత్, ఆస్ట్రేలియాలు ప్రకటించాయి. సౌర పీవీ, హరిత హైడ్రోజన్, ఇంధన నిల్వ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో పాటు అనుబంధ రంగాలలో ద్విముఖ పెట్టుబడి, భవిష్యత్తు పునరుత్పాదక ఇంధనానికి అవసరైన శ్రామిక శక్తిని తయారుచేసేందుకు అధునాతన నైపుణ్య శిక్షణ వంటి ప్రాధాన్యతా రంగాల్లో ఆచరణాత్మక భాగస్వామ్యాన్ని అందించే భారత్, ఆస్ట్రేలియా పునరుత్పాదక ఇంధన భాగస్వామ్యాన్ని (ఆర్ఈపీ) ప్రారంభించటాన్ని ఇరువురు ప్రధానులు స్వాగతించారు.
భారతదేశానికి చెందిన ఖనిజ్ విదేశ్ లిమిటెడ్ (కేఏబీఐఎల్), ఆస్ట్రేలియాకు చెందిన క్రిటికల్ మినరల్స్ ఆఫీస్ మధ్య అవగాహన ఒప్పందం కింద సాధించిన పురోగతిని..వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడానికి, సరఫరా వ్యవస్థను వైవిధ్యభరితం చేసే విషయంలో ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశంగా ప్రధాన మంత్రులు గుర్తించారు. పరిశోధన- ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన బదిలీ, ఒక దేశంలోని సమావేశాల్లో ఇంకో దేశం పాల్గొనటం.. ప్రపంచ హరిత ఇంధన పరివర్తనకు అనుగుణంగా బ్యాటరీలు తయారుచేయటం, పైకప్పులపై సౌర విద్యుత్ వంటి సాంకేతికతలతో సహా కీలకమైన ఖనిజ రంగాన్ని అభివృద్ధి చేయడంలో సుస్థిర పద్ధతుల పాత్రను ఇరువురు ప్రధానంగా పేర్కొన్నారు.
అంతరిక్ష స్థాయితో పాటు అంతరిక్ష పరిశ్రమ స్థాయిలో రెండు దేశాల మధ్య పెరుగుతోన్న భాగస్వామ్యాన్ని ఇద్దరు ప్రధానులు స్వాగతించారు. గగన్‌యాన్ మిషన్లకు మద్దతునివ్వటం, 2026లో భారతీయ రాకెట్ల నుంచి ఆస్ట్రేలియా ఉపగ్రహాలను ప్రయోగించే ప్రణాళిక, ఇరు దేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులకు మద్దతునివ్వటం ఈ ధృడ సహకారానికి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
రక్షణ, భద్రతా సహకారం
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలోని రక్షణ, భద్రతా విభాగం కింద సాధిస్తోన్న నిరంతర పురోగతిని ప్రధాన మంత్రులు స్వాగతించారు. రెండు దేశాల రక్షణ, భద్రతా భాగస్వామ్యం,.. వ్యూహాత్మక ఆసక్తులను ప్రతిబింబించేలా 2025లో ‘రక్షణ, భద్రతా సహకారంపై ఉమ్మడి ప్రకటన’ను పునరుద్ధరణ, బలోపేతం చేసే ఉద్దేశ్యాన్ని ఇరువురు వ్యక్తం చేశారు. సమష్టి సామర్థ్యాన్ని పెంపొందించటం, రెండు దేశాల భద్రతకు దోహదపడటం, ప్రాంతీయ శాంతి- భద్రతకు ముఖ్యమైన సహకారాన్ని అందించేందుకు రెండు దేశాల మధ్య రక్షణ, భద్రతా సహకారానికి సంబంధించిన దీర్ఘకాలిక దార్శనికత దిశగా పనిచేయటంపై ప్రధాన మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందాల అమలు ద్వారా రక్షణ విన్యాసాలు సంఖ్య పెరగటం, వాటి సంక్లిష్టత పెరగటం, సంయుక్తంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడటం పట్ల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
సముద్రాల విషయంలో అవగాహనను పెంపొందించటం.. కార్యచరణ విషయంలో రక్షణ సహకారాన్ని మరింతగా పెంచటం, ఉమ్మడి ఆందోళనలు- సవాళ్లను పరిష్కరించటం.. బహిరంగ, సమ్మిళిత, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ దిశగా పనిచేసేందుకు పెరిగిన పరస్పర రక్షణ సమాచార భాగస్వామ్యాన్ని ప్రధాన మంత్రులు స్వాగతించారు. ఉమ్మడి సముద్ర భద్రతా సహకార రోడ్ మ్యాప్‌ను తయారుచేసేందుకు ఇరువురు అంగీకరించారు. కార్యాచరణ సారూప్యతను పెంపొందించేందుకు ఒక దేశంలో మరొక దేశం విమానాల మోహరించటాన్ని కొనసాగించాలని ప్రధాన మంత్రులు అంగీకరించారు.
సముద్ర పరిశ్రమతో సహా రక్షణ పరిశ్రమ, పరిశోధన - పదార్థాల విషయంలో సహకారానికి ఉన్న ప్రాముఖ్యతను ఇద్దరు ప్రధానులు ప్రముఖంగా పేర్కొన్నారు. పెర్త్‌లో జరిగిన హిందూ మహాసముద్ర రక్షణ, భద్రత 2024 సమావేశం, మెల్బోర్న్లో జరిగిన భూ బలగాల ప్రదర్శనలో భారత రక్షణ పరిశ్రమలు తొలిసారిగా పాల్గొనడాన్ని ప్రధానమంత్రులు ప్రస్తావించారు. ఒక దేశంలోని ప్రధాన రక్షణ వాణిజ్య ప్రదర్శనలలో మరో దేశం పాల్గొనే అవకాశాలతో సహా భారత్-ఆస్ట్రేలియా రక్షణ పారిశ్రామిక కేంద్రాలు, రక్షణ అంకురాల మధ్య సంబంధాలను పెంచాల్సిన అవసరాన్ని వారు ప్రధానంగా పేర్కొన్నారు. నిర్మాణాత్మక చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి, తదుపరి దశలను వివరించేందుకు సమీప భవిష్యత్తులో భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ పరిశ్రమ ప్రతినిధి బృందాల చర్చలు సమావేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.
పార్లమెంటరీ సహకారం
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇరు దేశాల పార్లమెంటరీ సహకారాన్ని ఒక ముఖ్యమైన భాగంగా వర్ణించిన ప్రధానమంత్రులు.. నిరంతర పార్లమెంటరీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
విద్య, క్రీడలు, ప్రజల మధ్య సంబంధాలు
ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచటంలో ప్రజల మధ్య పెరుగుతోన్న సంబంధాలకు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించిన ఇరువురు.. ఈ విషయంలో భారతీయ మూలాలున్న ఆస్ట్రేలియన్ల గణనీయమైన సహకారాన్ని స్వాగతించారు. ఈ 'జీవన వంతెన'ను మరింత బలోపేతం చేయడానికి అంగీకరించారు.
బెంగళూరులో కొత్త ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్, బ్రిస్బేన్‌లో కొత్త భారత కాన్సులేట్ జనరల్ ప్రారంభోత్సవాలను ప్రధాన మంత్రులు స్వాగతించారు. ఇవి వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని.. సాంస్కృతిక సంబంధాలను మరింతగా పెంచుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా, భారతదేశం మధ్య మొబిలిటీ అవకాశాలను ఆర్థిక వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా ఇరువురు ప్రధానులు గుర్తించారు. 2024 అక్టోబర్‌లో భారతదేశం కోసం ఆస్ట్రేలియా వర్కింగ్ హాలిడే మేకర్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని వారు స్వాగతించారు. టాలెంటెడ్ ఎర్లీ-ప్రొఫెషనల్స్ కార్యక్రమం (మేట్స్) ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇది నిపుణులు ప్రారంభంలోనే ఆ దేశంలోకి వెళ్లేందుకు ప్రోత్సహించటంతో పాటు భారత్‌లోని అత్యంత ప్రతిభావంతులైన స్టేమ్ డిగ్రీ పట్టాదారుల్లో కొంతమందికి ఆస్ట్రేలియన్ పరిశ్రమను అందుబాటులోకి తెస్తుంది.
బలమైన, పెరుగుతోన్న విద్యా రంగ భాగస్వామ్యం విలువను గుర్తించిన ఇరువురు.. ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలు భారత్‌లో ప్రాంగణాలను ఏర్పాటు చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2024 అక్టోబర్‌లో జరిగిన రెండో ఆస్ట్రేలియా-భారత్ విద్య, నైపుణ్యాల మండలి సమావేశం విద్యా, నైపుణ్య సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడిందని ప్రధాన మంత్రులు అన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి, ప్రజల మధ్య సంబంధాలను, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడానికి క్రీడలు మంచి అవకాశాలను అందిస్తాయని ప్రధాన మంత్రులు పేర్కొన్నారు. సామర్థ్య నిర్మాణం, శిక్షణ, సిబ్బందిని తయారుచేయటం, క్రీడా శాస్త్రం, వైద్యం, ప్రధాన క్రీడా కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టాలని వారు అంగీకరించారు.
ప్రాంతీయ, బహుపాక్షిక సహకారం
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించే బహిరంగ, సమ్మిళిత, స్థిరమైన, శాంతియుత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్‌కు మద్దతునిచ్చేందుకు నిబద్ధతలో ఉన్నట్లు ఇరువురు ప్రధానులు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంపై కన్వెన్షన్‌కు (యూఎస్సీఎల్ఓఎస్) అనుగుణంగా అన్ని సముద్రాలు, మహాసముద్రాలలో హక్కులను వినియోగించుకోవటం, స్వేచ్ఛను కలిగి ఉండటానికి ఉన్న ప్రాముఖ్యతను ఇరువురు ప్రధానంగా పేర్కొన్నారు.
స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత, ధృడమైన ప్రాంతంగా ఇండో-పసిఫిక్‌ను మార్చాలన్న ఉమ్మడి దార్శనికతపై ముందుకెళ్లేందుకు.. ఇండో-పసిఫిక్‌కు నిజమైన, సానుకూల శాశ్వత ప్రభావాన్ని అందించే విషయంలో క్వాడ్ సహకారాన్ని బలోపేతం చేయాలన్న నిబద్ధతను ఇరువురు పునరుద్ఘాటించారు. మహమ్మారులు- వ్యాధుల సమస్యను పరిష్కరించటంలో భాగస్వామ్య దేశాలకు సహాయపడే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టటం, ప్రకృతి వైపరీత్యాలకు ప్రతిస్పందించటం.. సముద్రాల విషయంలో అవగాహన, సముద్ర భద్రతను బలోపేతం చేయటం.. అధిక నాణ్యత గల భౌతిక, డిజిటల్ మౌలిక సదుపాయాలను సమీకరించటం, ఏర్పాటు చేయటం.. కీలకమైన వర్థమాన సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడి పెట్టటం వాటి నుంచి ప్రయోజనం పొందటం.. వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవటం.. సైబర్ భద్రతను బలోపేతం చేయటం, తదుపరి తరం సాంకేతికత విషయంలో నాయకులను పెంపొందించడానికి క్వాడ్ చేస్తోన్న కృషిని వారు ప్రశంసించారు. 2025లో భారతదేశంలో జరిగే క్వాడ్ నాయకుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రులు ఆసియాన్ కేంద్రీకరణ, తూర్పు ఆసియా సమ్మిట్ (ఈఏఎస్), ఆసియాన్ ప్రాంతీయ ఫోరం, ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ వంటి ఆసియాన్ నేతృత్వంలోని ప్రాంతీయ వ్యవస్థల పట్ల నిబద్ధతతో ఉన్నట్లు ఇరు దేశాల నేతలు పునరుద్ఘాటించారు. ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ ఔట్‌లుక్ (ఏఓఐపీ) ఆచరణాత్మక అమలును నిరంతరం మద్దునిస్తున్నట్లు తెలిపారు. ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం (ఐపీఓఐ) కింద కొనసాగుతోన్న ద్వైపాక్షిక సహకారాన్ని గుర్తించిన ఇరువురు నేతలు.. సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడం, సముద్ర కాలుష్య ప్రభావాన్ని తగ్గించడం, సముద్ర వనరుల సుస్థిర వినియోగాన్ని నిర్ధారించడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో మెరుగైన సహకారం కోసం పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన హిందూ మహాసముద్ర రాజధాని పెర్త్‌లో ఇరు దేశాలు కలిసి నిర్వహించిన 2024 హిందూ మహాసముద్ర సమావేశం విజయవంతం కావటాన్ని ఇరువురు ప్రస్తావించారు. ఈ ప్రాంత సవాళ్లను పరిష్కరించేందుకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్‌ను (ఐఓఆర్ఏ) ప్రధాన వేదికగా గట్టి మద్దతునిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. భారత్ 2025లో ఐఓఆర్ఏ అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు.
పసిఫిక్ ద్వీప దేశాల అవసరాలు, ప్రాధాన్యతలను తీర్చేందుకు పసిఫిక్‌లో సహకార బలోపేతానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన ప్రధానమంత్రులు.. వాతావరణ కార్యచరణ, ఆరోగ్యం- విద్యతో సహా పసిఫిక్ ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడంలో రెండు దేశాల నిబద్ధత కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించడంలో పసిఫిక్ ద్వీప దేశాల ఫోరం, దాని 2050 నీలి పసిఫిక్ ఖండ వ్యూహం పోషించిన కీలక పాత్రను వారు ధ్రువీకరించారు. ఫోరం ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్ కోఆపరేషన్ (ఎఫ్ఐపీఐసీ) ఫ్రేమ్‌వర్క్‌తో పాటుగా పసిఫిక్ ద్వీప దేశాలకు అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తరించడంలో భారత్ పొషించిన పాత్రను ప్రధానమంత్రి అల్బనీస్ గుర్తించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు చూస్తున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి.
సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలపై ప్రధాన మంత్రులు అభిప్రాయాలను పంచుకున్నారు. చర్చలు, దౌత్యం ద్వారా ప్రస్తుతం ఉన్న ఘర్షణలను పరిష్కరించుకోవాలనే పిలుపును వారు పునరుద్ఘాటించారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో అన్ని దేశాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందే సమస్యను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించే అంతర్జాతీయ సంస్థగా ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్‌లో సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉగ్రవాద ఫైనాన్సింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇతర కార్యక్రమాలను చేపట్టే ప్రాముఖ్యతను వారు పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు.
ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సానుకూల అంచనాను పంచుకున్న ఇద్దరు ప్రధానమంత్రులు.. పరస్పర, ఈ ప్రాంత ప్రయోజనం కోసం సంబంధాలను మరింతగా బలోపేతం చేసే విషయంలో నిబద్ధతలో ఉన్నట్లు తెలిపారు. త్వరలో రాబోతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఐదో వార్షికోత్సవం ప్రాముఖ్యతను గుర్తించిన ఇరువురు.. ఈ కీలక సందర్భాన్ని సముచితమైన రీతిలో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను స్వాగతించారు. 2025 లో జరిగే తదుపరి భారత్-ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2173391)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam