కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త స్వదేశీ 4జీ (5జీ రెడీ) నెట్‌వర్క్‌ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
"వికసిత్ భారత్ దిశగా సీ-డాట్ కోర్, తేజస్ ఆర్ఏఎన్, టీసీఎస్ ఇంటిగ్రేషన్ ఆధారంగా ఉన్న
బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ (5జీకి పూర్తిగా అప్‌గ్రేడ్ చేయగల) నెట్‌వర్క్
ఒక చారిత్రాత్మక ముందడుగును తెలియజేస్తోంది: జ్యోతిరాదిత్య సింధియా
భారతదేశ టెలికాం స్వావలంబనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న స్వదేశీ 4జీ
Posted On:
26 SEP 2025 3:55PM by PIB Hyderabad
రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు ప్రధాన కార్యక్రమాల్లో పాల్గొంటారని కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంతాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఇవాళ వివరాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా దాదాపు 98,000 మొబైల్ 4జీ టవర్లను ప్రారంభించటతో పాటు స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌ను ప్రధాని ఆవిష్కరించనున్నారు. ఈ స్వదేశీ నెటవర్క్ పూర్తిగా సాఫ్ట్వేర్, క్లౌడ్ ఆధారితమైనదే కాకుండా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న డిజైన్ వల్ల 5జీకి సులభంగా అప్‌గ్రేడ్ కాగలదు. "భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని కూడా నెట్‌వర్క్ లేకుండా విడిచిపెట్టబోం" అని ఆయన అన్నారు. ఈ 4జీ టవర్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 22 మిలియన్ల మందికి సేవలందిస్తున్నాయని తెలిపారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి టెలికాం పరికరాల తయారీదారుల జాబితాలోకి భారత్ చేరనున్నందున ఇది దేశ టెలికాం రంగంలో ఒక కొత్త శకానికి నాందిగా ఉంటుంది. తేజస్ నెట్‌వర్క్ అభివృద్ధి చేసిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్ఏఎన్), సీ-డాట్‌కు చెందిన కోర్ నెట్‌వర్క్, టీసీఎస్ ఇంటిగ్రేషన్‌తో తయారైన ఈ పూర్తి స్వదేశీ 4జీ సాంకేతికత స్టాక్‌ను ఆత్మనిర్భర్ కింద బీఎస్ఎన్‌ఎల్ ఉపయోగిస్తోంది.
"ఇది సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? దీనివల్ల బీహార్‌లోని విద్యార్థులు ఇప్పుడు ప్రపంచ స్థాయి ఆన్‌లైన్ విద్యను సులభంగా పొందగలుగుతారు. పంజాబ్‌లోని రైతులు మార్కెట్ ధరలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. కాశ్మీర్లో ఉన్న సైనికులు ఇష్టమైన వారితో అనుసంధానమై ఉంటారు. ఈశాన్య ప్రాంతంలోని వ్యవస్థాపకులకు అంతర్జాతీయ నైపుణ్యం, నిధులు అందుబాటులో ఉంటాయి. ఈ 4జీ మౌలిక సదుపాయాలు ప్రతి భారతీయుడిని భౌగోళిక స్థితిగతులు, నేపథ్యంతో సంబంధం లేకుండా పురోగతి బాట పట్టించే ఆలోచనతో రూపొందాయి." అని మంత్రి సింధియా స్పష్టం చేశారు.
"డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా భారతదేశంలో 100 శాతం సంతృప్త స్థాయిలో ఉండే 4జీ నెట్‌వర్క్‌ను కూడా మేం ఆవిష్కరిస్తున్నాం. 4జీ సంతృప్త ప్రాజెక్ట్, డీబీఎన్ ఇతర ప్రాజెక్టులలో భాగంగా దాదాపు 29,000 గ్రామాలు అనుసంధానమవుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ రజతోత్సవం, 25 సంవత్సరాల సేవా దినోత్సవం కంటే ముందే ఇది జరుగుతుంది" అని ఆయన అన్నారు.
టెలికాం కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ భారతదేశానికి సంబంధించిన అద్భుత టెలికాం వృద్ధి కథను ఒక ప్రజెంటేషన్ ద్వారా చెప్పారు. మొదట్లో సందేహాలు ఉండే స్థాయి నుంచి స్వదేశీ 4జీ స్టాక్‌ను విజయవంతంగా అభివృద్ధి చేయటం, దేశవ్యాప్తంగా స్వదేశీ 4జీ టవర్లను ఏర్పాటు చేయటం వరకు గల ప్రయాణాన్ని ఆయన వివరించారు. గ్రామీణ అనుసంధానతను పెంచేందుకు డిజిటల్ భారత్ నిధి ఒక కేంద్ర బిందువుగా పనిచేసిందని అన్నారు. డిజిటల్ భారత్, విశ్వగురు అనే గౌరవ ప్రధాని దార్శనికతకు అనుగుణంగా భారతీయ యువత, పరిశ్రమ భాగస్వామ్యం, ఎప్పటికప్పుడు చేపట్టిన ప్రత్యక్ష పర్యవేక్షణల వల్ల టెలికాంలో దేశం స్వావలంబనగా మారి, సాంకేతికతను ప్రపంచదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని ప్రధానంగా చెప్పారు.
భారత్ ఇప్పుడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రయాణాన్ని నిర్ణయించే పరిస్థితుల్లో ఉంది. నాలుగు సంవత్సరాల క్రితం అసాధ్యంగా అనిపించినది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. స్వావలంబన, డిజిటల్ సమ్మిళితత్వం, ప్రపంచ నాయకత్వం అనే ప్రధానమంత్రి దార్శనికత కేంద్రీకృత అమలు, అచంచలమైన నిబద్ధత వల్ల ఇది సాధ్యమైంది. ఆ దార్శనికత ఇప్పుడు స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటోంది. నేడు భారత్ 120 కోట్ల మంది ప్రజలకు అధిక నాణ్యతతో కూడిన టెలికాం సేవలను అందించటమే కాకుండా టెలికాం పరికరాల తయారీకి ప్రపంచ కేంద్రంగా భారత్ స్థిరపపడుతోంది. ఈ ద్వంద్వ విజయాలు..వసుధైక కుటుంబ భావనలైన ప్రపంచ వృద్ధి, సమానత్వం, డిజిటల్ సమ్మిళితత్వాలను ముందుకు తీసుకెళ్లే దేశంగా భారత్ పాత్రను బలోపేతం చేస్తాయి.
జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రస్తుత క్షణంలో ఈ స్వదేశీ ఘన విజయాలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. సాంకేతికతకు సంబంధించిన ప్రయాణంలో ఇదొక ప్రస్థానంగా ఉండటమే కాకుండా ఒకప్పుడు సుదూరంగా ఉన్నట్లుగా అనిపించిన ఒక దార్శనికత సాకారం కానుంది.
***
(Release ID: 2172274)
Visitor Counter : 3