ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వికసిత్ భారత్.. వికసిత్ మధ్యప్రదేశ్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

నాడు పోస్టు చేయడమైనది: 29 FEB 2024 6:51PM by PIB Hyderabad

నమస్కారం!

వికసిత్ రాజ్య సే వికసిత్ భారత్’ ప్రచారంలో భాగంగా ఈరోజు మనం మధ్యప్రదేశ్‌లోని మన సోదరీసోదరులను కలుసుకున్నాం. నేను మరిన్ని విషయాలను ప్రస్తావించే ముందు.. దిండోరి రోడ్డు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ఈ విషాద సమయంలో మధ్యప్రదేశ్ ప్రజలకు అండగా నేను ఉన్నాను.

మిత్రులారా,

మధ్యప్రదేశ్‌లోని ప్రతి లోక్‌సభ, శాసనసభ స్థానంలో లక్షలాది మంది మిత్రులు 'అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్సంకల్పంతో ప్రస్తుతం ముందుకు సాగుతున్నారు. గత కొద్ది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాలూ ఇదేవిధంగా అభివృద్ధి సాధనకు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే భారత్ అభివృద్ధి చెందుతుంది. నేడు మధ్యప్రదేశ్ ఈ 'సంకల్ప యాత్ర'లో చేరుతోంది. మీ అందరికీ నా అభినందనలు.

మిత్రులారా,

రేపటి నుంచి మధ్యప్రదేశ్‌లో 9 రోజుల విక్రమోత్సవం ప్రారంభం కానుంది. ఇది మన అద్భుతమైన వారసత్వం.. ప్రస్తుత అభివృద్ధిల వేడుక. మన ప్రభుత్వం వారసత్వం.. అభివృద్ధి.. రెండింటితో ముందుకు సాగుతున్న తీరుకు ఉజ్జయినిలో ఏర్పాటు చేసిన వేద గడియారం నిదర్శనం. బాబా మహాకాల్ నగరం ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి కాల గణన కేంద్రంగా ఉండేది. కానీ ఆ ప్రాముఖ్యం మరుగునపడింది. ఇప్పుడు మనం ప్రపంచంలోని మొట్టమొదటి "విక్రమాదిత్య వేద గడియారాన్ని" తిరిగి వెలుగులోకి తెచ్చాం. ఇది మన సుసంపన్నమైన గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన భారత్ సాకారమయ్యే  కాల చక్ర గమనాన్ని కూడా ఇది చూడబోతోంది.

మిత్రులారా,

మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం సుమారుగా 17,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటిలో తాగునీరు, నీటిపారుదల ప్రాజెక్టులున్నాయి. విద్యుత్రహదారులురైల్వేలుక్రీడా సౌకర్యాలుకమ్యూనిటీ సెంటర్లు, ఇతర పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులూ ఉన్నాయి. ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని 30కి పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిని రెట్టింపు వేగంతో ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయి.. పెట్టుబడులూ, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ అభినందనలు.

మిత్రులారా,

ప్రతిచోటా ఇప్పుడు ఒకే విషయం వినిపిస్తోంది..  'అబ్కీ బార్400 పార్అబ్కీ బార్400 పార్!తమకు ఇష్టమైన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటూ తొలిసారిగా ప్రజలు నినదిస్తున్నారు. ఈ నినాదం బీజేపీ ఇచ్చింది కాదు.. దేశ ప్రజలు ఇచ్చింది. మోదీ హామీల పట్ల దేశ ప్రజల అపారమైన విశ్వాసానికి ఇది నిదర్శనం.

మిత్రులారా,

మా లక్ష్యం కేవలం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడానికే మేం మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మా అంతిమ లక్ష్యం కాదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జాతి నిర్మాణం కోసం ఒక మార్గం. మధ్యప్రదేశ్‌లో కూడా మేం దీనిని చూస్తున్నాం. మీరు గత రెండు దశాబ్దాలుగా మాకు నిరంతరం అవకాశాలను ఇస్తూనే ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత కొన్ని నెలలుగా జరిగిన అభివృద్ధి పట్ల ఉత్సాహం, ఉత్తేజాన్ని మీరు ఈ రోజూ చూశారు. నేను నా ముందు ఉన్న స్క్రీన్‌ను చూస్తున్నప్పుడుప్రతిచోటా కూర్చున్న ప్రజలు నాకు కనిపిస్తున్నారు. 200 కంటే ఎక్కువ ప్రదేశాల నుంచి 15 లక్షలకు పైగా ప్రజలు పాల్గొంటున్న ఈ వీడియో అనుసంధాన కార్యక్రమం సాధారణమైనది కాదు. ఈ ఉత్సాహంఉత్తేజం, తపనను చూసి.. మధ్యప్రదేశ్ సోదరులు చూపిస్తున్న ప్రేమకు మరోసారి నమస్కరిస్తున్నా.. మీ ఆశీర్వాదాలను సగౌరవంగా స్వీకరిస్తున్నా.

మిత్రులారా,

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం 'వికసిత్ మధ్యప్రదేశ్కోసం వ్యవసాయంపరిశ్రమలు, పర్యాటక రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. నేడు నర్మదా నదిపై మూడు సాగునీటి ప్రాజెక్టుల శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టులు తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా గిరిజన ప్రాంతాలకు సాగునీరందిస్తాయి. మధ్యప్రదేశ్‌ నీటిపారుదల రంగంలో మనం కొత్త విప్లవాన్ని చూస్తున్నాం. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ బుందేల్‌ఖండ్‌లోని లక్షలాది కుటుంబాల జీవితాలను మార్చబోతోంది. రైతుల పొలాలకు నీరు చేరినప్పుడు అది ఎంత గొప్ప సేవ కాగలదునీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో బీజేపీ-కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. 2014కి ముందు 10 సంవత్సరాల్లో దేశంలోని దాదాపు 40 లక్షల హెక్టార్ల భూమిని సూక్ష్మసేద్యం కిందకు తీసుకువచ్చారు. మా ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో దీనిని రెట్టింపు చేసింది. దాదాపు 90 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని సూక్ష్మ సేద్యంతో అనుసంధానించాం. ఇది బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది. బీజేపీ ప్రభుత్వం అంటే వేగం, పురోగతిల సంగమం అని ఇది రుజువు చేస్తుంది.

మిత్రులారా,

నిల్వ సదుపాయాల కొరత చిన్న రైతులకు ప్రధాన సమస్య. ఫలితంగా చిన్న రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తుంది. పంట ఉత్పత్తుల నిల్వ కోసం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పథకం కోసం మేం కృషి చేస్తున్నాం. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వేలాది పెద్ద గిడ్డంగుల నిర్మాణంతో.. 700 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం 1.25 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాలని యోచిస్తోంది.

మిత్రులారా,

గ్రామాల స్వయం-సమృద్ధికి మా ప్రభుత్వం గణనీయ ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రయోజనం కోసం సహకార సంఘాలను విస్తరిస్తున్నాం. ఇప్పటివరకు పాడి, చెరకు రంగాల్లో సహకార సంఘాల ప్రయోజనాలను మనం చూశాం. బీజేపీ ప్రభుత్వం ధాన్యాలుపండ్లు, కూరగాయలుచేపలు సహా ప్రతి రంగంలో సహకార సంఘాలకు ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రయోజనం కోసం లక్షలాది గ్రామాల్లో సహకార సంఘాలు, సంస్థలు ఏర్పాటవుతున్నాయి. వ్యవసాయంపశుపోషణతేనెటీగల పెంపకంకోళ్ల పెంపకంచేపల పెంపకం, ఇతర మార్గాల ద్వారా గ్రామాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి జరుగుతోంది.

మిత్రులారా,

గతంలో గ్రామాల అభివృద్ధిలో భూములు, ఆస్తులకు సంబంధించిన అనేక వివాదాలు ప్రధాన సమస్యగా ఉండేవి. భూమికి సంబంధించిన చిన్న పనుల కోసం గ్రామస్తులు తహసీళ్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రధానమంత్రి స్వామిత్వ యోజన ద్వారా ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అందిస్తోంది. స్వామిత్వ యోజన కింద మధ్యప్రదేశ్ చాలా బాగా పనిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని వంద శాతం గ్రామాల్లో డ్రోన్‌ల ద్వారా సర్వే చేశారు. 20 లక్షలకు పైగా స్వామిత్వ కార్డులు ఇప్పటికే జారీ చేశారు. గ్రామాల్లోని గృహాలకు సంబంధించిన ఈ చట్టపరమైన పత్రాలు పేదలను వివిధ వివాదాల నుంచి రక్షిస్తాయి. ప్రతి కష్టాల నుంచి పేదలను రక్షించడం మోదీ హామీ. నేడు మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లోనూ సైబర్ తహసీల్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. బదిలీ, రిజిస్ట్రీకి సంబంధించిన కేసులను డిజిటల్ విధానంలో పరిష్కరిస్తున్నారు. ఇది గ్రామీణ కుటుంబాల సమయాన్ని, ఖర్చులనూ ఆదా చేస్తుంది.

మిత్రులారా,

దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా మధ్యప్రదేశ్ మారాలని ఇక్కడి యువత కోరుకుంటున్నారు. యువతకు.. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయనున్న నేను చెప్పేది ఒక్కటే. బీజేపీ ప్రభుత్వం మీ కోసం కొత్త అవకాశాలను సృష్టించే ఏ అవకాశాన్నీ వదలదు. మీ కలలు మోదీ సంకల్పం. 'ఆత్మనిర్భర్ భారత్', మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు మధ్యప్రదేశ్ మూలాధారంగా మారుతుంది. మోరెనాలోని సీతాపూర్‌లో మెగా లెదర్, ఫుట్‌వేర్ క్లస్టర్ఇండోర్‌లో రెడీమేడ్ వస్త్ర పరిశ్రమ పార్కుమాండ్‌సౌర్‌లో పారిశ్రామిక పార్కుల విస్తరణ, ధార్‌లో కొత్త పారిశ్రామిక పార్కు నిర్మాణం వంటి కార్యక్రమాలు ఈ దిశగా కీలకమైనవి. తయారీలో మన సంప్రదాయ బలాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నాశనం చేశాయి. ఇక్కడ మనకు బొమ్మల తయారీ అనే గొప్ప సంప్రదాయం ఉంది. అయినా గత కొన్ని సంవత్సరాల్లో మన మార్కెట్లు, ఇళ్లలో విదేశీ బొమ్మలు నిండి ఉండేవి. బొమ్మలు తయారు చేసే విశ్వకర్మ కుటుంబాలకు మేం అండగా నిలిచాం. నేడు విదేశాల నుంచి బొమ్మల దిగుమతి గణనీయంగా తగ్గింది. వాస్తవానికి మనం దిగుమతి చేసుకునే దానికంటే ఎక్కువ బొమ్మలను ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాం. బుధ్నిలోనూ బొమ్మలు తయారు చేసే వారి కోసం అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు బుధ్నిలో ప్రారంభించిన ప్రాజెక్టులు బొమ్మల తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

సోదరీ సోదరులారా,

ఎవరూ పట్టించుకోని వారిని మోదీ జాగ్రత్తగా చూసుకుంటారు. దేశంలో మన సంప్రదాయ సహచరుల కృషిని ప్రోత్సహించే బాధ్యతను ఇప్పుడు మోదీ తీసుకున్నారు. నేను మీ కళ, నైపుణ్యాలను గురించి దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రచారం చేస్తున్నాను.. అది అలాగే కొనసాగిస్తాను. కుటీర పరిశ్రమలు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను విదేశీ అతిథులకు కానుకగా ఇవ్వడం సహా మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను అన్ని ప్రయత్నాలూ చేస్తాను. నేను వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడుతూ.. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఇంటినీ నేను చేరుకుంటున్నాను.

మిత్రులారా,

గత 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థాయి గణనీయంగా పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ నేడు భారత్‌తో స్నేహం చేయాలని కోరుకుంటున్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయులందరికీ తగిన గౌరవం లభిస్తోంది. పెరిగిన భారత్ స్థాయి ప్రత్యక్ష ప్రయోజనం పెట్టుబడులు, పర్యాటకంలో కనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు భారత్‌కు రావాలని కోరుకుంటున్నారు. వారు భారత్‌కు వచ్చినప్పుడుప్రత్యేకమైమది.. అధ్బుతమైనది అయిన మధ్యప్రదేశ్‌కు రావాలని సహజంగానే కోరుకుంటారు. ఇటీవలి సంవత్సరాల్లో ఓంకారేశ్వర్, మామలేశ్వర్‌కు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓంకారేశ్వర్‌లో గురు శంకరాచార్య జ్ఞాపకార్థం 'ఏకాత్మ ధామ్అభివృద్ధితో ఈ సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. 2028లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా కూడా జరగనుంది. ఇండోర్‌లోని ఇచ్ఛాపూర్ నుంచి ఓంకారేశ్వర్ వరకు 4 వరుసల రహదారి నిర్మాణం భక్తులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. ఈరోజు జరిగే రైల్వే ప్రాజెక్టుల ప్రారంభోత్సవం మధ్యప్రదేశ్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. కనెక్టివిటీ మెరుగైనప్పుడు వ్యవసాయంపర్యాటకం, పారిశ్రామిక రంగాలు సహా అందరికీ ప్రయోజనం కలుగుతుంది.

మిత్రులారా,

గత 10 సంవత్సరాలుగా మన మహిళల సాధికారతను మనం చూశాం. మన తల్లులు, అక్కాచెల్లెళ్ల జీవితాల నుంచి ప్రతి అసౌకర్యాన్నీ, కష్టాన్నీ తొలగించడానికి నిజాయితీగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చిన నేను.. ఈ హామీని పూర్తి నిజాయితీతో నెరవేర్చడానికి ప్రయత్నించాను. రాబోయే 5 సంవత్సరాల్లో మన అక్కాచెల్లెళ్లు, కుమార్తెలకు అపూర్వమైన సాధికారత లభిస్తుంది.. ప్రతి గ్రామంలో అనేక మంది 'లఖ్‌పతి దీదీలుగా మారతారు.. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు 'నమో డ్రోన్ దీదీలు'గా సేవలందిస్తూ వ్యవసాయంలో కొత్త విప్లవానికి మార్గదర్శకులు అవుతారు.. మన అక్కాచెల్లెళ్ల ఆర్థిక స్థితిలో అపూర్వమైన మెరుగుదల ఉంటుంది. గత 10 సంవత్సరాల్లో పేదల సంక్షేమం కోసం జరిగిన కృషి ఫలితంగా గ్రామాల్లోని పేద కుటుంబాల ఆదాయం వేగంగా పెరిగిందని ఇటీవల ఒక నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం నగరాలతో పోలిస్తే గ్రామాల్లో ఆదాయం వేగంగా పెరుగుతోంది. గత 10 సంవత్సరాల్లో 250 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దీని అర్థం బీజేపీ ప్రభుత్వం సరైన దిశలో పనిచేస్తోంది. మధ్యప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త శిఖరాలను చేరుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. మరోసారి ఈ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు. ఈరోజు మీరు ఈ వీడియో అనుసంధాన కార్యక్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా చరిత్ర సృష్టించారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ధన్యవాదాలు. 

గమనికఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

 

***


(రిలీజ్ ఐడి: 2168843) సందర్శకుల సూచీ సంఖ్య : : 24