రైల్వే మంత్రిత్వ శాఖ
‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0’ని విజయవంతంగా అమలు చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైన భారతీయ రైల్వే
స్వచ్ఛతపై, పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరణ
రియల్ టైమ్ కమ్యూనికేషన్‌తో పాటు తాజా సమాచారాన్ని ఇవ్వడానికి 17 జోనల్ రైల్వేలు, 70 డివిజన్లు,
10 ప్రభుత్వ రంగ సంస్థలు, 9 ప్రొడక్షన్ యూనిట్లతో పాటు 9 శిక్షణ సంస్థల్లో
150 కన్నా ఎక్కువ మంది నోడల్ అధికారులకు బాధ్యతలు
ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0 నిర్వహణ ద్వారా స్వచ్ఛతను రోజువారీ అభ్యాసంగా
తీర్చిదిద్దడంతో పాటు పెండింగులో ఉన్న అన్ని వ్యవహారాలను పూర్తి చేయడానికి కట్టుబడిన భారతీయ రైల్వే
Posted On:
18 SEP 2025 3:01PM by PIB Hyderabad
అన్ని సంస్థలూ స్వచ్ఛతను తప్పక పాటించడంతో పాటు పరిష్కరించకుండా మిగిలి ఉన్న పనులను పూర్తి చేసే లక్ష్యంతో ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0’ ను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న ఆరంభించింది. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని ఈ సంవత్సరం అక్టోబరు 2 నుంచి 31 మధ్య నెరవేర్చడం ఈ ప్రచార ఉద్యమ ధ్యేయాలు. ఈ ప్రచార ఉద్యమాన్ని భారతీయ రైల్వే అంతటా ఫలప్రదంగా అమలు చేయడానికి రైల్వే శాఖ అన్ని విధాలుగానూ సన్నద్ధమైంది.
ప్రచార ఉద్యమాన్ని రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సతీష్ కుమార్ నాయకత్వంతో పాటు ఇతర ఉన్నతాధికారుల సాయంతో ప్రభావవంతంగా అమలుచేయడానికి సంబంధించిన సన్నాహాలను బోర్డు పర్యవేక్షిస్తోంది. ఈ విషయంలో జనరల్ మేనేజర్లకు, ఇతర యూనిట్ల అధిపతులకు ఒక డి.ఒ. లేఖను పంపుతూ, క్షేత్ర విభాగాలన్నింటికీ సమగ్ర మార్గదర్శకాలను సూచించారు. ప్రచార ఉద్యమ నోడల్ అధికారులందరితో కిందటి నెల 27న ఒక సమీక్షా సమావేశాన్ని రైల్వే బోర్డు కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించారు.
పదిహేడు జోనల్ రైల్వేలు, 70 డివిజనల్ కార్యాలయాలు, 10 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు), 9 ప్రొడక్షన్ యూనిట్లు (పీయూల)తో పాటు 9 కేంద్రీయ శిక్షణ సంస్థలన్నీ ప్రచార ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకోవాల్సిందంటూ ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలను సమన్వయం చేసే బాధ్యతను 150 కన్నా ఎక్కువ మంది నోడల్ అధికారులకు అప్పగించారు. రియల్ టైమ్ కమ్యూనికేషన్‌తో పాటు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని ఇవ్వడానికి ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం సన్నాహక దశ కొనసాగుతోంది. ప్రచార ఉద్యమంలో ముఖ్య అంశాలకు సంబంధించి లక్ష్యాలకు తుది రూపును ఇస్తున్నారు. పరిష్కారం కాకుండా మిగిలి ఉన్న పనులను గుర్తించి వాటిని పూర్తి చేయడం, ఫైళ్లను సమీక్షించడం, స్వచ్ఛత పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, తుక్కును వదిలించుకోవడం ఈ ముఖ్య అంశాల్లో కొన్ని.
స్వచ్ఛతను కాపాడడాన్ని రోజువారీ చేపట్టాల్సిన సంస్థాగత అభ్యాసంగా మార్చడానికి, పెండింగు పనులన్నింటిని సమయానికి తగ్గట్టు పరిష్కరిస్తుండడానికి రైల్వే శాఖ పూర్తి స్థాయి నిబద్ధతను కనబరుస్తోంది. అన్ని విభాగాల్లో ప్రణాళికాబద్ధ సమన్వయాన్ని ఏర్పరుచుకొని, అన్ని యూనిట్లు అంకిత భావంతో భాగం పంచుకొనేటట్లు చూస్తూ ‘ప్రత్యేక ప్రచార ఉద్యమం 5.0’ను గొప్పగా విజయవంతం చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకొంది.
***
(Release ID: 2168267)