ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వరల్డ్ ఫుడ్ ఇండియా-2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఆహార రంగానికి సంబంధించిన ప్రపంచ స్థాయి భారీ కార్యక్రమం... ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’
Posted On:
12 SEP 2025 6:48PM by PIB Hyderabad
ఆహార రంగానికి సంబంధించిన ప్రపంచ స్థాయి భారీ కార్యక్రమం అయిన వరల్డ్ ఫుడ్ ఇండియా-2025ను (డబ్ల్యూఎఫ్ఐ) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న సాయంత్రం 6:00 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించనున్నారు. డబ్ల్యూఎఫ్ఐలో 4వ ఎడిషన్ అయిన ఈ కార్యక్రమానికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాస్వాన్ కూడా హాజరుకానున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్పీఐ) నిర్వహిస్తోన్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025 సెప్టెంబర్ 25న ప్రారంభమై, సెప్టెంబర్ 28 వరకు కొనసాగనుంది. ఆహార శుద్ధి రంగానికి ఉన్న పరివర్తన సామర్థ్యాన్ని గుర్తించిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రపంచ స్థాయి కార్యక్రమం ఆహార శుద్ధి వాణిజ్య కార్యకలాపాల్లో భాగస్వామ్యాలు, ఆవిష్కరణ, పెట్టుబడులను ప్రోత్సహిచంటం ద్వారా "ప్రపంచ ఆహార కేంద్రంగా" భారత్ స్థానాన్ని నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంతకు ముందు నిర్వహించిన డబ్ల్యూఎఫ్ఐ కార్యక్రమాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. దీని ఆధారంగా చేసుకొని వరల్డ్ ఫుడ్ ఇండియా నాలుగో ఎడిషన్ ఒక ప్రధాన అంతర్జాతీయ వేదికగా మారింది. వేగంగా వృద్ధి చెందుతోన్న భారత్ ఆహార శుద్ధి వ్యవస్థతో అనుసంధానమయ్యేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకునేందుకు.. విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశోధకులు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకురానుంది. పెద్ద సంఖ్యలో దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయనే అంచనా ఉంది. ప్రపంచ ఆహార రంగానికి సంబంధించిన వ్యవస్థకు చెందిన అత్యంత సమగ్ర ప్రదర్శన కార్యక్రమాల్లో ఇది ఒకటి.
ఈ సంవత్సరం న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. జపాన్, యూఏఈ, వియత్నాం, రష్యా ముఖ్య దేశాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఈ దేశాల భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయటమే కాకుండా విజ్ఞాన మార్పిడిని పెంచుతుంది. దీనితో పాటు ఆహార శుద్ధి రంగంలో వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది.
ప్రపంచ ఆహార శుద్ధి రంగంలోని మేధావులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమ నిపుణులతో ఉన్నత స్థాయి వైజ్ఞానిక చర్చలు, ప్యానెల్ చర్చలను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్నారు. తాజా ఆవిష్కరణలు, సాంకేతికతలు.. ఆహార శుద్ధి, ప్యాకేజింగ్, యంత్రాలు, శీతలీకరణ కేంద్రాలు, అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ఉండనున్నాయి. వీటితో పాటు వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడానికి రూపొందించిన బీటూబీ- బీటూజీ నెట్‌వర్కింగ్ అవకాశాల ప్రదర్శన కూడా ఉండనుంది. వంటలకు సంబంధించిన అనుభవాలు, చెఫ్ పోటీలు భారతదేశానికి చెందిన గొప్ప ఆహార వైవిధ్యాన్ని.. ఆరోగ్యకరమైన, సుస్థిరమైన, భవిష్యత్కు సరిపోయే ఆహారాలలో ప్రపంచ ధోరణులను ప్రదర్శించనున్నాయి.
రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహించే 3వ ప్రపంచ ఆహార నియంత్రణ సదస్సు( ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్).. ఆహార భద్రతా ప్రమాణాల సమన్వయం, నియంత్రణ విషయంలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించేందుకు ప్రపంచ స్థాయి నియంత్రణ సంస్థలకు ఒక ప్రత్యేకమైన వేదికను అందించనున్నాయి. పెరుగుతోన్న భారతదేశ సముద్ర ఆహార ఎగుమతి సామర్థ్యం, ప్రపంచ మార్కెట్ అనుసంధానతలపై దృష్టి సారించే భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల సంఘం (సీఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా- ఎస్ఈఏఐ) వరల్డ్ ఫుడ్ ఇండియాకు సమాంతరంగా 24వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో (ఐఐఎస్ఎస్) నిర్వహించనుంది.
ఈ భారీ కార్యక్రమానికి సన్నాహకంగా కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ 2025 సెప్టెంబర్ 11న ఢిల్లీలోని భారత్ మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను సవివరంగా సమీక్షించారు. వేదికకు సంబంధించిన లేఅవుట్, రవాణా సదుపాయాలు, స్టాళ్ల ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు, అంతర్జాతీయ ప్రతినిధులను స్వాగతించేందుకు ఉద్దేశించిన ప్రాధమ్యాలపై మంత్రి ఆరా తీశారు. పొరపాట్లు లేని సమన్వయం, అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, పాల్గొనే వారందరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించటం అవసరమని ఆయన ప్రధానంగా చెప్పారు.
***
(Release ID: 2166349)
Visitor Counter : 10