ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్‌లో సుస్థిర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఏడీబీ మధ్య 126.4 మిలియన్ల డాలర్ల రుణ ఒప్పందం
ఉత్తరాఖండ్‌లో అత్యంత వాతావరణ మార్పులకు గురయ్యే,
ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన టెహ్రీ గర్హ్వాల్ జిల్లా లక్ష్యంగా ఈ ప్రాజెక్టు
మెరుగైన పర్యాటక ప్రణాళిక, అధునాతన మౌలిక సదుపాయాలు, మెరుగైన పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, విపత్తు సంసిద్ధత
87,000 మందికి పైగా నివాసితులు, 2.7 మిలియన్ల వార్షిక పర్యాటకులకు ప్రయోజనం
Posted On:
11 SEP 2025 1:08PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లోని టెహ్రీ సరస్సు ప్రాంతంలో స్థిరమైన, వాతావరణ స్థితిస్థాపక పర్యాటకం ద్వారా గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకుతో కలిసి భారత ప్రభుత్వం నిన్న 126.42 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది.
టెహ్రీ సరస్సు ప్రాంత ప్రాజెక్టులో స్థిరమైన, సమ్మిళితమైన, వాతావరణ-స్థితిస్థాపక పర్యాటక అభివృద్ధిపై జరిగిన ఈ ఒప్పందంపై (https://www.adb.org/projects/57213-001/main) సంతకం చేసిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి జూహి ముఖర్జీ, ఏడీబీ నుంచి భారత నివాస మిషన్ ఇంచార్జి అధికారి శ్రీ కాయి వియీ యియో ఉన్నారు.
‘‘ఉత్తరాఖండ్ ను విభిన్నమైన, అన్ని కాలాల్లో అనుకూలమైన పర్యాటకానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ విధానానికి ఏడీబీ రుణ మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా టెహ్రీ సరస్సును అభివృద్ధికి ప్రాధాన్య ప్రాంతంగా గుర్తించింది’’ అని శ్రీమతి ముఖర్జీ అన్నారు.
జల విద్యుత్ సరస్సు ఏర్పాటు కేంద్రంగా... సుస్థిర పర్యాటకం, ఉద్యోగాల కల్పన, భిన్నమార్గాల్లో ఆదాయం, వాతావరణ మార్పులను తట్టుకునేలా పెంపొందించేందుకు బహుళ రంగాల విధానాన్ని అవలంబించడం కోసం ఈ ప్రాజెక్టులు కీలకంగా పనిచేయనున్నాయి’’ అని యియో తెలిపారు.
ఉత్తరాఖండ్ లో ఎక్కువగా వాతావరణ మార్పులకు గురయ్యే, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాల్లో ఒకటైన టెహ్రీ గర్హ్వాల్ జిల్లాలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.
ఇది 87,000 మంది స్థానిక నివాసితులు, ప్రతి ఏడాది 2.7 మిలియన్ పర్యాటకులకు లాభం చేకూర్చేలా రూపొందింది. ముఖ్యంగా మెరుగైన పర్యాటక ప్రణాళిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విపత్తుల నివారణకు సిద్ధంగా ఉండే చర్యలు చేపడతారు.
సంస్థాగత బలోపేతం, వాతావరణ మార్పులను తట్టుకోవడం, మౌలిక సదుపాయాలు, కొండచరియలు విరిగిపడటం, వరద ప్రమాదాలను తగ్గించడానికి ప్రకృతి ఆధారిత పరిష్కారాలు, మహిళలు, యువత, ప్రైవేటు రంగం ఆధ్వర్యంలో సమగ్ర పర్యాటక సేవలు వంటివి ఈ ప్రాజెక్టులో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి.
మహిళలు, యువత, ఎంఎస్ఎంఈల ఆధ్వర్యంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు జీవనోపాధి సమాన సహాయ కార్యక్రమం, వికలాంగులతో సహా అందరికీ ఉపయోగపడే డిజైన్ రూపకల్పన, ప్రయోగాత్మక గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ కార్యక్రమం వంటివి ఈ ప్రాజెక్టు ప్రధాన అంశాలు.
***
(Release ID: 2165700)
Visitor Counter : 2