పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్, వెట్ ల్యాండ్ నగరాల గుర్తింపు
2025 అవార్డులను ప్రదానం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
గాలి స్వచ్చత పరంగా అత్యుత్తమ పనితీరు కనబరచిన
11 ఎన్సీఏపీ నగరాలను సత్కరించిన పర్యావరణ మంత్రిత్వశాఖ
2025 ఎన్సీఏపీ అవార్డుల కింద అగ్రస్థానంలో నిలిచిన
ఇండోర్, జబల్పూర్, ఆగ్రా, సూరత్ నగరాలు
వెట్‌ల్యాండ్ నగరాలుగా ఇండోర్, ఉదయపూర్ నగరాలకు
రామ్‌సర్ ఒప్పందం కింద అంతర్జాతీయ గుర్తింపు
దేశంలోని 130 నగరాలలో శుభ్రమైన గాలి, హరిత మౌలిక వసతుల కోసం
రూ 1.55 లక్షల కోట్లకు పైగా నిధుల సమీకరణ
ప్రధాని దార్శనికతే నగరాలకు స్ఫూర్తి... 103 పట్టణ కేంద్రాలలో గణనీయమైన మెరుగుదల కనబరిచిన జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం: శ్రీ భూపేందర్ యాదవ్
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్: మరింత ప్రభావం కోసం వార్డు స్థాయికి వార్షిక స్వచ్ఛ వాయు సర్వే విస్తరణ
దేశవ్యాప్తంగా పట్టణ వాయు నాణ్యత కార్యక్రమాలకు మార్గనిర్దేశం
చేసేందుకు ఉత్తమ విధానాలతో సంకలనం విడుదల
సుస్థిర అభివృద్ధి, ప్రతి పౌరునికి స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యం: కేంద్ర మంత్రి పునరుద్ఘాటన
Posted On:
09 SEP 2025 4:21PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈ రోజు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డులు, వెట్ ల్యాండ్ నగరాల గుర్తింపు ఉత్సవం-2025ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ హాజరయ్యారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద 130 నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షన్ 2025లో ఉత్తమ పనితీరు కనబరిచిన నగరాలకు మంత్రిత్వ శాఖ అవార్డులు ప్రదానం చేసింది.
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) 2020 ఆగస్టు 15న ప్రధానమంత్రి ఇచ్చిన శక్తిమంతమైన సందేశంతో ప్రారంభమైంది. సమీకృత, ఆధునిక విధానం ద్వారా 100 నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడానికి లక్ష్య నిర్దేశిత చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఆ పిలుపు మేరకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ (ఎంఓఈఎఫ్సీసీ) జాతీయ స్వచ్ఛ వాయు (ఎన్సీఏపీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇది ప్రణాళికా దశ నుంచి ఆచరణాత్మక చర్యలకు మారింది. ఆశించిన ఫలితాలను చూపింది.
స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ 2025 కింద, స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 130 ఎన్సీఏపీ నగరాలకు గాను అత్యుత్తమ నిబద్ధత, ఆవిష్కరణను ప్రదర్శించిన పదకొండు నగరాలను మంత్రి అభినందించారు.
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ను జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద సమగ్ర పరిశీలనతో కూడిన కఠినమైన, బహుళ స్థాయి మదింపు వ్యవస్థగా రూపొందించారు. నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించి, గాలి నాణ్యతను మెరుగుపరచడానికి వేగవంతమైన చర్యలు తీసుకునేలా చేయడానికి ఎన్సీఏపీ కింద 130 నగరాలలో స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్ ను ఏటా నిర్వహిస్తున్నారు.
ఈ కింది నగరాలకు ఈఎఫ్సీసీ మంత్రి అవార్డులను ప్రదానం చేశారు:
కేటగిరీ-1 (10 లక్షల పైగా జనాభా):
I. ఇండోర్ 200 కి 200 స్కోరు సాధించి మొదటి స్థానం సంపాదించింది. దీనికి రూ.1.5 కోట్ల నగదు అవార్డు అందచేశారు. ఇండోర్ గత సంవత్సరంలో 16 లక్షల పైగా చెట్లు నాటడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. 120 ఎలక్ట్రిక్ బస్సులు, 150 సీఎన్జీ బస్సులతో ప్రజా రవాణా పనిచేస్తోంది.
II. జబల్పూర్ 200 కి 199 స్కోరు సాధించి రెండో స్థానం సంపాదించింది. రూ. 1 కోటి నగదు అవార్డు అందచేశారు. జబల్పూర్…. వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 11 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. పచ్చదనాన్ని అభివృద్ధి చేసింది.
III. ఆగ్రా, సూరత్ 200 కి 196 స్కోరు సాధించి మూడో స్థానం పొందాయి. వీటికి రూ. 25 లక్షల చొప్పున నగదు అవార్డు అందచేశారు. వ్యర్థాలను పారబోసి పాత వేస్ట్ డంప్ ప్రదేశాన్ని ఆధునికం చేయడంతో పాటు ఆగ్రా మియావాకీ ప్లాంటేషన్ ఏర్పాటు చేసింది. సూరత్... విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు, పన్ను ప్రయోజనాలను అందించడానికి ఈవీ విధానాన్ని తీసుకువచ్చింది. 38% విస్తీర్ణానికి పచ్చదనాన్ని విస్తరించింది.
కేటగిరీ-2 (3-10 లక్షల జనాభా):
I. అమరావతి 200 కి 200 స్కోరు సాధించి మొదటి స్థానం సంపాదించింది. రూ. 75 లక్షల నగదు అవార్డు అందచేశారు. 340 కి.మీ. కాలి నడక దారులతో సహా రహదారుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. 53 ఉద్యానవనాల్లో విస్తృతంగా పచ్చదనం ఉంది. 19 ఎకరాల ఎడారి భూమిని దట్టమైన అడవులుగా మార్చింది.
II. ఝాన్సీ, మురాదాబాద్ 200 కి 198.5 స్కోరు సాధించి రెండో స్థానం పొందాయి. రూ. 25 లక్షల చొప్పున నగదు అవార్డు అందచేశారు. ఝాన్సీ నగరంలో పచ్చదనం, మియావాకి అడవులను అభివృద్ధి చేశారు. మురాదాబాద్ రోడ్డు మౌలిక సదుపాయాలు, నిర్మాణం, కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై చర్యలు తీసుకుంది.
III. అల్వార్ 200 కి 197.6 స్కోరు సాధించి మూడో స్థానం పొందింది. రూ. 25 లక్షల నగదు అవార్డు అందుకుంది. అల్వార్ పురాతన వ్యర్థ స్థావరాన్ని పునరుద్ధరించింది.
కేటగిరీ-3 (3 లక్షల లోపు జనాభా):
I. దేవాస్ 200 కి 193 స్కోరు సాధించి మొదటి స్థానం సంపాదించింది. రూ. 37.50 లక్షల నగదు అవార్డు అందచేశారు. దేవాస్ పరిశ్రమలను పరిశుభ్ర ఇంధనాల వైపునకు మార్చింది.
II. పర్వానూ 200 కి 191.5 స్కోరు సాధించి రెండో స్థానం సంపాదించింది. రూ. 25 లక్షల నగదు అవార్డు అందచేశారు. పర్వానూ రోడ్ల మొత్తం కాలినడక దారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంది.
III. అంగుల్ 200 కి 191 స్కోరు సాధించి మూడో స్థానం సంపాదించింది. రూ. 12.50 లక్షల నగదు అవార్డు అందుకుంది. అంగుల్ రోడ్డు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంది. ప్రజలను భాగస్వాములను చేసే కార్యక్రమాలు నిర్వహించింది.
ఈ అవార్డులను ఆయా నగరాల మేయర్లు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు స్వీకరించారు.
మూడుసార్లు విజేతలుగా నిలిచినందుకు మురాదాబాద్, ఆగ్రాలను మంత్రి అభినందించారు. రెండుసార్లు అవార్డు గెలిచిన ఇందూర్, జబల్పూర్, సూరత్, ఝాన్సీ, దేవాస్, పర్వానూ, అంగుల్ నగరాలను, మొదటిసారి అవార్డు అందుకున్న అల్వార్ నగరాన్ని కూడా మంత్రి అభినందించారు.
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద... ప్రభుత్వం 130 నగరాలకు రూ. 20,130 కోట్లు కేటాయించింది. వాయు కాలుష్య నివారణ చర్యలను అమలు చేయడానికి అవసరమైన నిధుల కొరతను తీర్చేందుకు 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 130 నగరాలకు వాయు నాణ్యత పనితీరు ఆధారంగా రూ.13,237 కోట్లు అందించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్), అమృత్, స్మార్ట్ సిటీ మిషన్, సతత్, ఫేమ్-II, నగర్ వన యోజన వంటి పథకాల నుంచి నిధులను సమీకరించి వినియోగిస్తున్నారు.
సుస్థిర, పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి వాయు నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం రూ. 73,350 కోట్లు అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా రూ. 82,000 కోట్లు సమకూర్చాయి. దీని ఫలితంగా ఈ 130 నగరాల్లో మొత్తం రూ.1.55 లక్షల కోట్ల నిధుల సమీకరణ జరిగింది.
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద ఉన్న నగరాలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పలు రంగాల్లో ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. వాటిలో రోడ్డు దుమ్ము, వ్యర్థాల నిర్వహణ, వాహన కాలుష్యం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ, పారిశ్రామిక కాలుష్యం వంటివి ఉన్నాయి.
తీసుకోవడం- తయారుచేయడం- పారవేయడం (టేక్-మేక్-డిస్పోజ్) విధానానికి బదులుగా, రీసైకిల్ చేసి, తిరిగి వినియోగించడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. విచక్షణారహితంగా వ్యర్థాలను పారవేయడాన్ని నియంత్రించడానికి సర్క్యులర్ ఎకానమీ కింద ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టింది.
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద వాయు నాణ్యత మెరుగుదలలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. 130 నగరాలకు గానూ 103 నగరాలు పీఎం10 స్థాయిలలో మెరుగుదల కనబరిచినట్లు ఆయన తెలిపారు. 2017-18 స్థాయిలతో పోలిస్తే 2024-25 నాటికి పీఎం10 స్థాయిలలో 20% తగ్గింపు సాధించిన 64 నగరాలను ఆయన అభినందించారు, అలాగే 2024-25 నాటికే 40% తగ్గింపు మార్కును చేరుకున్న 25 నగరాలను ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్-స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ మార్గదర్శకాలను విడుదల చేశారు. వార్డు స్థాయిలో వాయు కాలుష్య నివారణపై అవగాహన పెంచడానికి, చర్యలను ప్రోత్సహించడానికి వార్షిక సర్వేక్షణ్ ను ఇప్పుడు వార్డు స్థాయికి విస్తరిస్తున్నట్టు హెచ్ఎంఈఎఫ్సీసీ తెలిపింది.
జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద ఉత్తమ పద్ధతుల సంకలనాన్ని కూడా విడుదల చేశారు. ఇది ఎన్సీఏపీ కింద వివిధ నగరాలు అమలు చేసిన ప్రభావవంతమైన వ్యూహాలను ప్రదర్శిస్తుంది. తద్వారా ఇతర నగరాలు వాటి నుంచి నేర్చుకుని, తాము చేపట్టిన గాలి నాణ్యతా కార్యక్రమాలను మెరుగుపరచడానికి విలువైన ఆలోచనలను అందిస్తుంది.
నగరాలు తమ ప్రగతిని ట్రాక్ చేయడంలో ప్రాణ (పీఆర్ఏఎన్ఏ) పోర్టల్ వంటి డిజిటల్ వేదికలు సహాయపడ్డాయని, అదే సమయంలో నగరాలు చేపట్టిన వాయు నాణ్యత మెరుగుదల కార్యకలాపాల అమలులో పారదర్శకతను అందిస్తాయని మంత్రి తెలియజేశారు.
ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరు తో మొక్క నాటడం) ప్రచారం కింద 2025 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే సేవా పర్వ్ లో 75 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. అలాగే, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నగర వన యోజన కింద 75 నగర వనాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం సాధించిన పురోగతి పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014లో 25గా ఉన్న రామ్‌సర్ సైట్‌ల సంఖ్య ఇప్పుడు 91కి పెరిగిందని, ఇది 250% పెరుగుదలను సూచిస్తోందని ఆయన తెలిపారు.
దేశంలోని ప్రతి జిల్లాలో నీటి వనరులను అభివృద్ధి చేయడానికి, పునరుద్ధరించడానికి ప్రధానమంత్రి ‘మిషన్ అమృత్ సరోవర్‘ ను ప్రారంభించారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి మంచి నీటి వనరులు పరిమితంగానే ఉన్నందున, అందరూ పర్యావరణ అనుకూల జీవనశైలిని అవలంబించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ‘మిషన్ లైఫ్‘ ను ప్రారంభించారు. ఈ మిషన్‌లో ‘నీటిని సంరక్షించండి‘ అనే నినాదంతో అంశంతో సహా మొత్తం ఏడు అంశాలు ఉన్నాయి.
దేశ భౌగోళిక విస్తీర్ణంలో 4.7% సరస్సులు ఉన్నాయి. వాటిలో మూడింట రెండు వంతులు అటవీ ప్రాంతాల వెలుపల ఉన్నాయి. సరస్సులు వరదలను నియంత్రిస్తాయి. సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తాయి. మత్స్యకారులకు జీవనోపాధిని కల్పిస్తాయి. సరస్సులు పర్యావరణానికి కిడ్నీలా పనిచేస్తూ కాలుష్యాలను హరిస్తాయి.
పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం, స్థిరమైన జీవనోపాధిలో చిత్తడి నేలల పాత్రను దృష్టిలో ఉంచుకుని వాటిని పరిరక్షించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. రామ్‌సర్ ఒప్పందంలో భారత్ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 91 చిత్తడి నేలలు రామ్‌సర్ సైట్‌లుగా గుర్తింపు పొందాయి. ఇవి 1.36 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. రామ్‌సర్ సైట్‌ల సంఖ్య పరంగా భారత్ ఆసియాలో మొదటి స్థానంలోనూ, ప్రపంచంలో మూడో స్థానంలోనూ ఉంది.
నగరాల్లో చిత్తడి నేలలను సంరక్షించడానికి అసాధారణ చర్యలు తీసుకున్న నగరాలను గుర్తించేందుకు, రామ్‌సర్ ఒప్పందం కింద 'వెట్‌ల్యాండ్ సిటీ అక్రిడిటేషన్' పథకాన్ని ప్రవేశపెట్టారు.
రామ్‌సర్ ఒప్పందం కింద వెట్‌ల్యాండ్ సిటీలుగా గుర్తింపు పొందినందుకు ఇండోర్, ఉదయ్‌పూర్ నగరాలను మంత్రి అభినందించారు. ఈ నగరాల మేయర్లు, జిల్లా కలెక్టర్‌లకు రామ్‌సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ జారీ చేసిన సర్టిఫికెట్లను ఆయన అందజేశారు.
ఇండోర్ నిరంతరాయంగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలుస్తున్నందుకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవం పరిశుభ్రమైన గాలి, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఉద్దేశించిందని మంత్రి చెప్పారు. అవార్డులు గెలుచుకున్న నగరాలను అభినందిస్తూ, ప్రధానమంత్రి ఆకాంక్షించిన విధంగా ప్రతి పౌరుడు స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేలా, ప్రతి నగరం సుస్థిర అభివృద్ధికి నమూనాగా నిలిచేలా అందరూ ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలని ఆయన కోరారు.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), దాని పరిసర ప్రాంతాల వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) ఛైర్‌పర్సన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ నగరాల మేయర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2165185)
Visitor Counter : 2