రక్షణ మంత్రిత్వ శాఖ
మూడు ఆధునిక పదార్థ సాంకేతికతలను పరిశ్రమకు బదిలీ చేసిన డీఆర్డీఓ
Posted On:
04 SEP 2025 12:44PM by PIB Hyderabad
హైదరాబాద్‌లోని డీఆర్డీఓ రక్షణ లోహశాస్త్ర పరిశోధన ప్రయోగశాల (డీఎమ్ఆర్ఎల్) మూడు ఆధునిక పదార్థ సాంకేతికతలను పరిశ్రమ భాగస్వాములకు బదిలీ చేసింది. హైరదాబాద్ లోని డీఎమ్ఆర్ఎల్ లో 2025 ఆగస్టు 30న నిర్వహించిన కార్యక్రమంలో రక్షణశాఖ కార్యదర్శి, డీఆర్ డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ పరిశ్రమ భాగస్వామ్యులకు సాంకేతికత బదిలీ లైసెన్సు ఒప్పంద పత్రాలను అందజేశారు.
బదిలీ చేసిన సాంకేతికతలు ఇవే:
-
అధిక నాణ్యతతో కూడిన రాడోమ్ ల ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను జగదీష్‌పూర్‌లోని బీహెచ్ఈఎల్ కు బదిలీ చేశారు. దీని ద్వారా అధిక సామర్థ్యం కలిగిన రాడోమ్‌ల తయారీ సాధ్యమవుతుంది. ఇది కీలక రక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇచ్చేందుకు, క్షిపణి వ్యవస్థలలో స్వయం సమృద్ధిని సాధించేందుకు సహాయపడుతుంది. భారత రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక కీలక ముందడుగు.
-
డీఎమ్ఆర్-1700 స్టీల్ షీట్లు, ప్లేట్ల తయారీ సాంకేతికను జేఎస్ పీఎల్, అంగుల్‌కు బదిలీ చేశారు. ఇవి రక్షణ అవసరాల కోసం ఉపయోగపడతాయి .ఈ స్టీల్‌కు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద అత్యధిక బలం, విరిగిపోకుండా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది.
-
డీఎమ్ఆర్ 249ఏ హెచ్ఎస్ఎల్ఏ ఉక్కు ప్లేట్ల తయారీ హక్కును సెయిల్ భిలాయ్ స్టీల్ ప్లాంటుకు బదిలీ చేశారు. నౌకా నిర్మాణానికి వినియోగించే ఈ ఉక్కు అధిక నాణ్యత, దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. ఖచ్చితమైన పరిమాణాలు, భౌతిక, లోహ సంబంధిత ప్రమాణాలతో తయారైన ఈ ఉక్కు బలమైనది, నమ్మకమైనది.
డీఆర్ డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ మాట్లాడుతూ.. పరిశోధన, అభివృద్ధి విభాగం విజయానికి తోడ్పడిన శాస్త్రవేత్తలు, పరిశోధకుల కృషిని ప్రశంసించారు. పరిశ్రమ–పరిశోధన భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ, భవిష్యత్తులో ప్రభావవంతమైన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో డీఎమ్ఆర్ఎల్ చూపిన నిబద్ధతను ఆయన అభినందించారు.
ఈ సాంకేతిక బదిలీలు.. వ్యూహాత్మక అవసరాల కోసం స్వదేశీ పదార్థ సాంకేతికత అభివృద్ధిలో ముఖ్యమైన ప్రస్థానంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ సాంకేతికతలు విభిన్న రంగాల్లో ఉపయోగపడతాయి. ఇది డీఎమ్ఆర్ఎల్ బహుళ విభాగ నైపుణ్యాన్ని, పరిశ్రమ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని అందిస్తుంది.. ప్రతిష్ఠాత్మక పరిశ్రమ భాగస్వాములతో కలసి పనిచేయడం ద్వారా ఈ ఆవిష్కరణలను వేగంగా విస్తరించి వాణిజ్య, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం అమలు చేయగలమని అన్నారు.
డీఆర్డీఓ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు చెందిన విమాన ప్రమాదాల పరిశోధన బ్యూరో (ఏఏఐబీ), డీఎమ్ఆర్ఎల్ మధ్య ఒక ఒప్పందం కుదరింది. ఈ ఒప్పందం ద్వారా డీఎమ్ఆర్ఎల్ అనుభవం, సదుపాయాలు, నైపుణ్యాలను ఏఏఐబీ కార్యకలాపాలకు అనుగుణంగా వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ (నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్) డాక్టర్ ఆర్ వీ. హర ప్రసాద్, డైరెక్టర్ జనరల్ (రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్) డాక్టర్ మనూ కొరుల్లా, డీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. బాలమురళి కృష్ణన్ పాల్గొన్నారు.
***
(Release ID: 2163880)
Visitor Counter : 2