ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారత్‌లో తయారైన మొదటి చిప్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఇదొక గర్వకారణమైన సందర్భమని పేర్కొన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
దూరదృష్టి, దృఢ సంకల్పం, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నందుకు
ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి
7.8 శాతం జీడీపీ వృద్ధి నుంచి.... దేశంలో తయారైన మొదటి చిప్‌తో కూడిన సెమీకండక్టర్ వ్యవస్థ వరకూ
భారతదేశపు స్థిరత్వానికి దీపస్తంభం: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
సెమికాన్ ఇండియా-2025లో కుదిరిన 12 అవగాహన ఒప్పందాలు
కెమెరా మాడ్యూళ్లు, మైక్రోఫోన్ బడ్స్, మినియేచర్ ప్యాకేజింగ్ సంబంధిత ఉత్పత్తుల డిజైన్, తయారీతో పాటు నైపుణ్యాభిృద్ధి వ్యవస్థలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయటంపై దృష్టి సారించనున్న ఈ ఒప్పందాలు
స్వచ్ఛ ఇంధనం, క్వాంటం, అధునాతన సాంకేతిక రంగాలలో సెమీకండక్టర్ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు
బిలియన్ డాలర్ల మూలధనంతో డీప్ టెక్ కూటమిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి
తొలిదశలో ఫ్యాబ్స్, ఓసాట్, ముఖ్యమైన పరికరాలు, పదార్థాల తయారీ ద్వారా విస్తారిత వ్యవస్థ...
మలిదశలో మేకింగ్ ఇండియా ద్వారా ఉత్పత్తి దేశంగా భారత్... ఐఎస్ఎం 2.0 లక్ష్యం
ప్రపంచదేశాలతో ప
Posted On:
02 SEP 2025 8:02PM by PIB Hyderabad
భారత సెమీకండక్టర్ ప్రయాణం నేడు ఒక చారిత్రాత్మక ఘట్టానికి చేరుకుంది. ప్రయోగాత్మక ఉత్పత్తిలో భాగంగా భారత్‌లో తయారైన మొదటి చిప్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ అందజేశారు. డిసెంబర్ 2021లో ప్రారంభించిన భారత సెమీకండక్టర్ మిషన్.. కేవలం మూడున్నర సంవత్సరాల్లో అనుమతుల దశ నుంచి ఉత్పత్తి దశకు మారింది. ఈ ఘనతను సాధించడం మనకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈ రంగానికి సంబంధించి దూరదృష్టి, దృఢ సంకల్పం, నిర్ణయాత్మక చర్యలు తీసుకున్న ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 7.8 శాతం జీడీపీ వృద్ధి నుంచి ‘భారత్‌లో తయారైన’ మొదటి చిప్‌లతో కూడిన సెమీకండక్టర్ వ్యవస్థ వరకు స్థిరత్వానికి భారత్ దీపస్తంభంగా నిలుస్తోందని ఆయన అన్నారు.
మేధో సంపత్తి హక్కులను గౌరవించడం, సరఫరా గొలుసు అభివృద్ధికి మద్దతునివ్వటం, ప్రపంచ భాగస్వాములతో కలిసి సహాభివృద్ధి పద్ధతిలో నమూనాల తయారీని ప్రోత్సహించడం అనే నమ్మకంపై భారత సెమీకండక్టర్ మిషన్ ఏర్పాటైందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. "పరస్పర వృద్ధి, ఇరు పక్షాల గెలుపుకు ఉపయోగపడే విధంగా ప్రపంచ దేశాల వద్దకు భారతదేశం ఎల్లప్పుడూ ఒక భాగస్వామిగా వెళ్తుంది." అని ఆయన అన్నారు. ప్రపంచ విలువ గొలుసులో భారతదేశానికి ఉన్న బలమైన అనుకూలతల్లో ఈ విశ్వసనీయత ఒకటని అన్నారు.
సెమీకాన్ ఇండియా- 2025 సందర్భంగా 12 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) జరిగాయి. దేశంలో స్వయం సమృద్ధిగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సెమీకండక్టర్ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో ఉత్పత్తి, అభివృద్ధిని మెరుగుపరచడం.. సర్వీస్ సామర్థ్యాలను విస్తరించటం, నైపుణ్యాభివృద్ధి రంగాన్ని బలోపేతం చేయడంపై ఈ ఒప్పందాలు దృష్టి సారించనున్నాయి.
ఆవిష్కరణలను మరింత పెంచేందుకు డీప్ టెక్ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. దీనికోసం దాదాపు బిలియన్ డాలర్ల మూలధనాన్ని ఇప్పటికే ప్రకటించారు. ప్రారంభంలో సెమీకండక్టర్లపై దృష్టి సారించనున్నప్పటికీ క్రమంగా ఇది స్వచ్ఛ ఇంధనం.. జీవ సాంకేతికత, క్వాంటం సాంకేతికత, అంతరిక్షం తదితర అధునాతన (ఫ్రాంటియర్) రంగాలపై పనిచేయనుంది. ఇది వర్థమాన డీప్ టెక్ పరిశ్రమలకు అత్యంత అవసరమైన మూలధన సహాయాన్ని (వెంచర్ క్యాపిటల్) అందిస్తుందని మంత్రి అన్నారు.
మొహాలిలోని సెమీకండక్టర్ ప్రయోగశాల ఆధునికీకరణ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు వెళుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఉత్పత్తి స్థాయిని పెంచటం, కొత్త ఉత్పత్తుల టేప్ అవుట్స్‌ను ప్రారంభించడం.. భారతదేశపు అధిక విలువ- మధ్య స్థాయి తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని ఇది లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఐఎస్ఎం 1.0 విజయాన్ని ఆధారంగా చేసుకుంటూ, ఐఎస్ఎం 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది మొత్తం సెమీకండక్టర్ విలువ గొలుసుపై పనిచేసేందుకు ఫ్యాబ్‌లు, ఓశాట్ యూనిట్లు, తయారీ పరికరాలు-పదార్థాల విషయంలో మద్దతునందించనుంది.
ఆమోదం పొందిన పది ప్రాజెక్టులలో ఎగుమతులు అనేవి అంతర్భాగంగా ఉంటాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి తెలిపారు. భారత్‌లో తయారైన చిప్‌లు దేశీయ, ప్రపంచ మార్కెట్లకు ఉపయోగపడేలా ఇది చూసుకుంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, భారత్‌లో సెమీకండక్టర్ల ఉత్పత్తికి భారత్‌లో ఖర్చు ఇప్పటికే 15–30 శాతం తక్కువ అవుతోందని స్వతంత్ర అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రాజెక్టులను ఆమోదించే విషయంలో భారత్ ఎప్పుడూ తొందరపడలేదని, సుస్థిర పురోగతి కోసం వృత్తిపరమైన అంచనా ఉండేలా చూసుకుందని ప్రధానంగా పేర్కొన్నారు. ఇప్పటికే రెండు ఫ్యాబ్‌లు ఉన్నాయి. మరిన్ని రాబోతున్నాయి. ఇవి భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమలో ఉత్తేజాన్ని పెంచనున్నాయి. ఈ రంగంలో ఒకసారి గట్టి పునాది ఏర్పడిన తర్వాత వృద్ధి భారీగా పెరగనుంది.
సెమికాన్ ఇండియా- 2025లో ఏఎస్ఎంఎల్, లామ్ రీసెర్చ్, అప్లయిడ్ మెటీరియల్స్, మెర్క్, టోక్యో ఎలక్ట్రాన్ వంటి పరికరాలు, ముడి పదార్థాలకు సంబంధించిన ప్రపంచ సంస్థలతో సహా సెమీకండక్టర్ వ్యవస్థలోని ప్రధాన భాగస్వాములన్నీ పాల్గొన్నాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పురోగతి సాధిస్తోన్న భారత సెమీకండక్టర్ మిషన్‌పై ప్రపంచం కలిగి ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇది తెలియజేస్తోందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
సెమీ-కండక్టర్ ప్రయోగశాలలో (ఎస్సీఎల్) భారతీయ విద్యార్థులు తయారు చేసిన 20 చిప్‌లను ప్రధానమంత్రికి అందజేశారు. కార్యక్రమంలో ఇదొక ప్రత్యేక ఆకర్షణ. దేశవ్యాప్తంగా 78 విశ్వవిద్యాలయాలు అధునాతన ఈడీఏ సాధనాలను ఉపయోగిస్తున్నాయని.. అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను భారత్ తయారు చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రపంచ సెమీకండక్టర్ శ్రామిక శక్తిలో దాదాపు 20% వాటాను ఇప్పటికే భారత్ కలిగి ఉందని తెలిపారు. మిషన్‌కు నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవని అన్నారు.
డిజైన్, అంకుర వ్యవస్థను కూడా భారతదేశం అభివృద్ధి చేస్తోంది. 28 కంటే ఎక్కువ అంకురాలు ప్రాజెక్ట్ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి పురోగమిస్తున్నాయి. ఇటీవలి అవగాహన ఒప్పందాలు.. పూర్తి ఐఓటీ చిప్సెట్లు, కెమెరా వ్యవస్థలను తయారీకి సంబంధించినవి కాగా.. ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలు స్వదేశీ మైక్రోకంట్రోలర్లు, ప్రాసెసర్లను విడుదల చేశాయి. డిజైన్ ఆధారిత ప్రోత్సాహక (డీఎల్ఐ) పథకం విలువైన మేధో సంపత్తి (ఐపీ) పోర్ట్‌ఫోలియోను తయారు చేసింది. దీని కింద ఫ్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి చేసేందుకు 25 ఉత్పత్తులను గుర్తించారు.
2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి సెమీకండక్టర్ పరిశ్రమ చేరుకుంటున్న అంచనా ఉంది. దీనితో పాటు నమ్మకం, సాంకేతికత, నైపుణ్యాల పరంగా బలమైన స్థానాన్ని కలిగిన భారత్.. ప్రధానమంత్రి దార్శనికతను సాధించేలా సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఎదగటానికి సిద్ధంగా ఉంది.
సెమికాన్ ఇండియా 2025 సందర్భంగా చేసుకున్న ఎంఓయూలు, చేసిన ప్రకటనలు
1. తయారీ, ప్యాకేజింగ్‌కు సంబంధించి భారత్‌లో సెమీకండక్టర్ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్, మెర్క్ మధ్య ఒప్పందం.
2. దేశీయ సెమీకండక్టర్ డిజైన్, ఐపీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు టాటా ఎలక్ట్రానిక్స్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) మధ్య ఒప్పందం.
3. స్పర్ష్-ఐక్యూ, థర్డ్‌ఐటెక్, ఫోకల్లీ, సెన్స్సెమీ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్థానికంగా ఆటోమేటివ్ కెమెరా, మాడ్యూల్ ఉమ్మడి అభివృద్ధిని ప్రారంభించనున్నట్లు కేన్స్ సెమికాన్ ప్రకటన.
4. ఇన్ఫినియన్ భాగస్వామ్యంతో భారతదేశంలో మొదటి ఎంఈఎంస్ మైక్రోఫోన్, అధునాతన సెమీకండక్టర్ ప్యాకేజీలను అందించనున్నట్లు కేన్స్ సెమికాన్ ప్రకటన.
5. భారీగా ఉపయోగించేందుకు వీలున్న సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైన, ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టల వంటి తదుపరి తరం డిజిటల్ గుర్తింపు వ్యవస్థలను నడిపించే, స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉన్న భారత్‌లో తయారైన సెక్యూర్ చిప్ సంయుక్త అభివృద్ధి ప్రారంభోత్సవ ప్రకటన.. ఐఐటీ గాంధీనగర్, సీడాక్ సహకారంతో దీన్ని చేపట్టనున్న ఎల్‌అండ్‌టీ సెమీకండక్టర్ సంస్థ.
6. సెమీకండక్టర్ పరిశోధన, క్వాంటం సాంకేతికతల విషయంలో నాయకత్వానికి సంబంధించి జాతీయ ఆవిష్కరణ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ఎల్అండ్టీ సెమీకండక్టర్, ఐఐఎస్సీ బెంగళూరు మధ్య అవగాహన ఒప్పందం.
7. సీడాక్ అభివృద్ధి చేసిన స్వదేశీ వెగా ప్రాసెసర్‌ను గుజరాత్‌లోని ఒక మహిళ నాయకత్వంలోని దేశీయ అంకురం అయిన ఇండీసెమిక్‌కు చెందిన బ్లూటూత్, లోరా మ్యూడ్యూల్స్‌లో అనుసంధానిస్తూ భారతదేశపు మొదటి ఐఓటీ ఎవల్యూషన్ బోర్డు ఆవిష్కరణ.
8. సెమీకండక్టర్ నైపుణ్యాలు, పరిశ్రమలు- విద్యా సంస్థల సంబంధాలు, సెమీకండక్టర్ సాంకేతికతల్లో సామర్థ్య తయారీని ప్రోత్సహించేందుకు ఎన్ఐఈఎల్ఐటీ, సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ) మధ్య అవగాహన ఒప్పందం.
9. ఐఎస్ఎం జాతీయ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా అనువర్తిత పరిశోధన (అప్లయిడ్ రీసెర్చ్), ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళుతూనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న భారత సెమీకండక్టర్ వ్యవస్థ కోసం భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు సహకార విధివిధానాలను ఏర్పాటు చేసేందుకు ఐఎస్ఎం, న్యూ ఏజ్ మేకర్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నామ్‌టెక్) మధ్య అవగాహన ఒప్పందం.
10. శాస్త్రీయ, విద్యా సహకారంపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) మధ్య అవగాహన ఒప్పందం.
11. డీఎల్ఐ పథకం కింద ఆమోదం పొందిన కంపెనీలకు సినాప్సిస్ ఐపీలను సులభంగా వాడుకునే వెసులుబాటు కల్పించేందుకు సీడాక్, సినాప్సిస్, ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్ మధ్య అవగాహన ఒప్పందం.
12. డీఎల్ఐ పథకం కింద ఆమోదం పొందిన కంపెనీలకు అందుబాటులో ఉండే డిజైన్ మౌలిక సదుపాయాలపై ప్రకటన..
మౌలిక సదుపాయాలు, అవి అందించే కంపెనీలు కంపెనీలు ఇలా ఉన్నాయి. :
ఐపీ కోర్:
ఏ) ఐటీసీ కొరియా
బీ) సెక్యూర్ ఐసీ
సీ) కాడెన్స్ డిజైన్ సిస్టమ్స్
డీ) అనలాగ్ బిట్స్
ఈడీఏ టూల్స్ :
ఏ) సిమ్ యోగ్ టెక్నాలజీస్
బీ) కేడర్ డిజైన్ సిస్టమ్స్
పోస్ట్ సిలికాన్ వాలిడేషన్:
ఏ) ఎమర్సన్ గ్లోబల్
బీ) స్మార్ట్సాక్ సొల్యూషన్స్
సీ) సైయంట్ సెమీకండక్టర్
సెమికాన్ ఇండియా:
ప్రపంచవ్యాప్తంగా సెమి నిర్వహించే ఎనిమిది వార్షిక సెమికాన్ ప్రదర్శనలలో సెమికాన్ ఇండియా ఒకటి. ఇది ప్రపంచ సెమీకండక్టర్ డిజైన్, తయారీ వ్యవస్థలోని కార్యనిర్వాహకులు, ప్రముఖ నిపుణులను ఒక వేదికకు తీసుకొస్తుంది. సెమికాన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ సెమీకండక్టర్ వ్యవస్థలో సహకారం, స్థిరత్వాన్ని పెంపొందించే సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించిన భవిష్యత్తులో పరివర్తన చెందే ప్రయాణానికి నాంది పలుకుతుంది.
సెమి:
సెమి అనేది సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ డిజైన్- తయారీ సరఫరా వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు పనిచేసే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,000 కంటే ఎక్కువ సభ్య కంపెనీలు, 1.5 మిలియన్ల నిపుణులను అనుసంధానించే ప్రపంచ స్థాయి పరిశ్రమ సంఘం. వారు సలహా, మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత, సరఫరా వ్యవస్థ నిర్వహణ, ఇతర కార్యక్రమాల ద్వారా పరిశ్రమలో ప్రధాన సవాళ్లను పరిష్కరించే విషయంలో సభ్యుల సహకారాన్ని వేగవంతం చేస్తోంది.
ఐఎస్ఎం:
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కింద పనిచేసే స్వతంత్ర సంస్థ ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం). దేశంలో సుస్థిరమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో ఉండే సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ వ్యవస్థను తయారు చేసేందుకు ఉపయోగపడే సెమికాన్ ఇండియా కార్యక్రమానికి ఇది నోడల్ ఏజెన్సీ. ప్రతిపాదనలను పరిశీలించటం, సాంకేతిక భాగస్వామ్యాలను సులభతరం చేయడం, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడం, ఆర్థికపరమైన ప్రోత్సాహకాల విషయంలో చెల్లింపులు చేయటం వంటి బాధ్యతలను ఐఎస్ఎం నిర్వహిస్తోంది. ఆర్థిక భద్రత, సాంకేతిక స్వావలంబనను నిర్ధారించడం ద్వారా భారత్‌ను సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ విషయంలో విశ్వసనీయ ప్రపంచ స్థాయి కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తోంది.
***
(Release ID: 2163248)
Visitor Counter : 2