సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
డాక్టర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవం-2025
Posted On:
02 SEP 2025 4:10PM by PIB Hyderabad
సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్.. నేడు న్యూఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది. 10వ తరగతిలో అత్తుత్తమ ప్రతిభ చూపిన షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ వర్గాలకు చెందిన విద్యార్థులతోపాటు గుర్తింపు పొందిన రాష్ట్ర/కేంద్ర బోర్డులు, మండళ్లు నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు పొందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా సత్కరించారు.
2021-22, 2022-23 సంవత్సరాలకు మొత్తం 29 రాష్ట్ర/కేంద్ర విద్యా బోర్డులు, మండళ్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో 2021-22 ఏడాదికి 10వ తరగతి నుంచి మొత్తం 367 మంది విద్యార్థులకు అవార్డులను అందజేశారు. వారిలో 22 మంది టాపర్లు ఉన్నారు. 12వ తరగతి నుంచి మొత్తం 563 మంది విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయగా.. వారిలో 49 మంది టాపర్లు ఉన్నారు. ఇక 2022-23 సంవత్సరానికి గానూ 10వ తరగతి నుంచి 17 మంది టాపర్లతో సహా మొత్తం 198 మంది విద్యార్థులకు అవార్డులు లభించాయి. 12వ తరగతి నుంచి 29 మంది టాపర్లతో సహా మొత్తం 362 మంది విద్యార్థులకు అవార్డులు వరించాయి.
ఈ కార్యక్రమానికి సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి, డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వీరేంద్ర కుమార్ హాజరయ్యారు. ఆయన తన ప్రసంగంలో.. విద్య, సామాజిక న్యాయం రంగంలో భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. విద్య, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు, సంక్షేమ పథకాల ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న విద్యార్థులను శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ బీఎల్. వర్మ అభినందించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా అణగారిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఉద్బోధించిన సమానత్వం, సోదరభావం, గౌరవం, సామాజిక న్యాయం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లాలని విద్యార్థులను కోరారు.
డాక్టర్ అంబేద్కర్ జాతీయ ప్రతిభా పురస్కార పథకం కింద గుర్తింపు పొందిన ప్రతి మాధ్యమిక విద్యా బోర్డు నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదే విధంగా ఉన్నత మాధ్యమిక విద్యా బోర్డులోని ఎస్సీ విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు.
అవార్డు పొందిన విద్యార్థులకు ఒకే విడతలో అందజేసే నగదు బహుమతి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ. 60,000/-
2. రెండో స్థానం సాధించిన విద్యార్థికి రూ. 50,000/-
3. మూడో స్థానం సాధించిన విద్యార్థికి రూ. 40,000/-
వీటితోపాటు మొదటి మూడు స్థానాల్లో ఏ బాలిక కూడా లేని సందర్భాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి ప్రత్యేక అవార్డును అందించారు. ఆమె ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహించేందుకు రూ.60,000 నగదు బహుమతిని అందించారు.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ యాదవ్ మాట్లాడుతూ.. తమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కీలకమైన స్కాలర్‌షిప్, సాధికారత పథకాల ప్రాముఖ్యత గురించి వివరించారు. అతిథులను, అవార్డు పొందిన విద్యార్థులను డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ సభ్య కార్యాదర్శి శ్రీ వి. అప్పారావు వేదికపైకి ఆహ్వానించారు. చివరగా డీఏఎఫ్ డైరెక్టర్ శ్రీ మనోజ్ తివారీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఎస్‌జేఈ అదనపు కార్యదర్శి శ్రీమతి కైరలిన్ ఖొంగవార్ దేశ్‌ముఖ్, ఇతర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ ఏడాది నిర్వహించిన ఈ కార్యాక్రమంలో అవార్డు అందుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు. విద్య, సాధికారత ద్వారా సమానమైన, సమ్మిళిత సమాజాన్ని నిర్మించాలనే ప్రభుత్వ దార్శనికతలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఐక్యత, సమానత్వం, ప్రతిభను సాధించాలన్న అద్భుతమైన సంకల్పంతో.. ‘బోధించు, చైతన్యపరుచు, సంఘటితమవ్వు’ అన్న బాబాసాహెబ్ పిలుపును ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం ముగిసింది.
***
(Release ID: 2163214)
Visitor Counter : 3