రాష్ట్రపతి సచివాలయం
సిటీ యూనియన్ బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన భారత రాష్ట్రపతి దేశ అభివృద్ధి పథంలో బ్యాంకింగ్ రంగానిది కీలక పాత్ర: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము
प्रविष्टि तिथि:
02 SEP 2025 1:55PM by PIB Hyderabad
తమిళనాడులోని చెన్నైలో జరిగిన సిటీ యూనియన్ బ్యాంక్ 120వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నేడు(సెప్టెంబర్ 2, 2025) న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందని, దేశ అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని, వేగంగా మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రజల ఆకాంక్షలు విస్తృతంగా పెరిగాయని పేర్కొన్నారు. బ్యాంకుల పాత్ర ఆర్థిక లావాదేవీలకు మించి విస్తరించిందని, నేడు బ్యాంకులు సంపదను రక్షించడమే కాకుండా.. అనేక రకాల ఆర్థిక సేవలను అందిస్తున్నాయని, ఇవి సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి కూడా దోహదపడుతున్నాయని తెలిపారు.
దేశ అభివృద్ధికి కీలకమైన స్థంభాలలో ‘ఆర్థిక సార్వజనీనత’ ఒకటని, ప్రతి పౌరుడు సరసమైన ధరలో ఆర్థిక సేవలను పొందేలా చూసుకోవాలని, బ్యాంకింగ్ పరిశ్రమ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడంలో సిటీ యూనియన్ బ్యాంక్ వంటి బ్యాంకులు సహాయపడుతున్నాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే చాలా మంది ప్రజలు ఇప్పటికీ బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. అయితే అందరికీ ఆర్థిక సేవలను అందించడంలో సిటీ యూనియన్ బ్యాంక్ అద్భుతమైన పురోగతి సాధించిందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు వినియోగదారులకు అనుకూలమైన మొబైల్ యాప్‌లు, సూక్ష్మ రుణాలు, బీమా ఉత్పత్తులను పేదల పేద వర్గాల కోసం అందిస్తున్నాయని రాష్ట్రపతి, చెల్లింపు బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు మారుమూల గ్రామాల ప్రజల ఇంటి ముందుకు ఆర్థిక సేవలను తీసుకెళ్తున్నాయని తెలిపారు. ఈ రంగంలో పురోగతి ఉన్నప్పటికీ, డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ సౌలభ్యం, ఆర్థిక అవగాహన వంటి అంశాల్లో ఇప్పటికీ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఆమె పేర్కొన్నారు. వీటిని అధిగమించేందుకు ప్రతి భాగస్వామి సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాంకేతికత, డిజిటల్, ఆర్థిక అక్షరాస్యత ద్వారా ప్రజలను బ్యాంకింగ్ సేవలతో మరింతగా అనుసంధానించవచ్చని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు.
రైతుల సాధికారత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మన బ్యాంకింగ్ రంగం ప్రాధాన్య లక్ష్యాలుగా ఉండాలని, సకాలంలో రుణాన్ని అందించడం, ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, వ్యవసాయ-సాంకేతిక కార్యక్రమాలను ప్రోత్సహిండం ద్వారా సుస్థిర వ్యవసాయానికి దోహదపడుతూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడంలో బ్యాంకులు సహాయపడతాయని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను అభివృద్ధి ఇంజిన్ లుగా మార్చడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించగలవని, వెనుకబడిన, అణగారిన వర్గాలకు సహాయం చేసేందుకు మన బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దినసరి కూలీలు, వలస కార్మికులను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానించడానికి ప్రత్యేక కృషి అవసరమని ఆమె పేర్కొన్నారు.

మన ఆర్థికవ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ.. డిజిటల్ మార్పు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో బ్యాంకుల పాత్ర మరింత కీలకంగా మారుతోందని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. స్టార్టప్‌ల నుంచి స్మార్ట్ సిటీల వరకు బ్యాంకులు సహాయం చేయగల రంగాలు అనేకం ఉన్నాయని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడంలో బ్యాంకులు క్రియాశీల భాగస్వాములుగా మారాలని ఆమె తెలిపారు.
***
(रिलीज़ आईडी: 2163138)
आगंतुक पटल : 16