కర్ణాటక, మైసూరులోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్(ఏఐఐఎస్‌హెచ్) వజ్రోత్సవ వేడుకల్లో గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నిన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గహ్లోత్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధ రామయ్య, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్, కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దినేష్ గుండు రావు, మైసూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీమతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ "విద్య, వైద్యం, స్పీచ్, హియరింగ్ రంగాల్లో పరిశోధనల్లో గణనీయమైన కృషి చేసిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనటం నాకు చాలా ఆనందంగా ఉంది. సంప్రదింపుల్లో లోపాలను గుర్తించటం, చికిత్స అందించటంలో కీలక సేవలందించిన సంస్థ మాజీ, ప్రస్తుత డైరెక్టర్లు, అధ్యాపకులు, నిర్వాహకులు, విద్యార్థులందరికీ ఈ ప్రత్యేక సందర్భంలో, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని తెలిపారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధీనంలో స్వయం ప్రతిపత్తి సంస్థగా 1965లో ఏఐఐఎస్‌హెచ్ స్థాపించారు. కమ్యూనికేషన్ లోపాలకు సంబంధించి మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య సేవలు, శిక్షణ, పరిశోధన, ప్రజా విద్య, విస్తరణ సేవల్లో దక్షిణాసియాలోనే ఇది ప్రముఖమైన సంస్థగా పేరొందింది. కమ్యూనికేషన్ లోపంతో బాధపడే వారికి సంరక్షణ, పునరావాసం కల్పించటమే లక్ష్యంగా ఏఐఐఎస్‌హెచ్‌ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్, డాక్టోరల్, పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్ కోర్సులను అందించడమే కాకుండా, కమ్యూనికేషన్, వినికిడి లోపాలున్న వారికి చికిత్స అందించి, వారిని సంరక్షిస్తుంది. పునరావాసం ద్వారా రోగులు, వారి కుటుంబ సభ్యులకు కూడా సహాయం చేస్తుంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో, ఏఐఐఎస్‌హెచ్ తన రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందింది.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి వి. హెకలి జిమోమి, భారత ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ఏఐఐఎస్‌హెచ్ అధ్యాపకులు, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
****