సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఐసీటీ-ముంబయి.. స్టార్టప్ యాక్సిలరేటర్ వేదిక ‘వేవ్‌ఎక్స్‌’ ఆధ్వర్యాన మీడియా టెక్ ఇంక్యుబేటర్‌: ‘ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌’ అంకుర సంస్థలకు ప్రోత్సాహమే లక్ష్యం... దరఖాస్తు గడువు సెప్టెంబరు 7


· ఈ వేదిక ద్వారా భారత మీడియా అంకుర సంస్థలకు ప్రపంచ సాంకేతిక దిగ్గజ సంస్థలు గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌.. అమెజాన్‌ ప్రతినిధుల మార్గదర్శకత్వం

· ప్రభావశీల ఎదుగుదలకు మౌలిక సదుపాయాలు.. సలహాలు.. రియల్-వరల్డ్ టెస్టింగ్‌ సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వ మీడియా యూనిట్ భాగస్వామ్యం

· వ్యాపారాభివృద్ధి.. శాండ్‌బాక్స్ టెస్టింగ్‌.. గ్లోబల్ షోకేసింగ్ అవకాశాల కల్పనకు రెండు-దశల ‘వేవ్‌ఎక్స్‌’ ఇంక్యుబేటర్: తొలి బ్యాచ్‌లో 15 సంస్థలు

Posted On: 30 AUG 2025 7:48PM by PIB Hyderabad

దేశంలో శరవేగంగా పురోగమిస్తున్న మీడియా-వినోద రంగంలో అధిక సామర్థ్యం గల భాగస్వామ్యాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఒక ప్రత్యేక ‘మీడియా టెక్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌’ను ప్రారంభించినట్లు కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) సహకారంతో తమ పరిధిలోని ‘స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ వేవ్‌ఎక్స్‌’ ఆధ్వర్యంలో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఆడియో, విజువల్, కామిక్స్, గేమింగ్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌) రంగంలోని అంకుర సంస్థలను ప్రత్యేక మార్గదర్శక వ్యవస్థగా ఈ ఇంక్యుబేటర్‌ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ కార్యకలాపాల్లో ప్రభుత్వ మీడియా యూనిట్ భాగస్వామ్యాల ద్వారా నిర్మాణాత్మక మార్గదర్శకత్వం, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక సలహాలు, రియల్‌ వరల్డ్‌ టెస్టింగ్‌ అవకాశాలు కూడా లభిస్తాయి. అంకుర సంస్థల ప్రభావశీల ఎదుగుదలతోపాటు వాణిజ్యీకరణకూ ఈ ఇంక్యుబేటర్‌ తోడ్పడుతుంది.

రెండు దశల నమూనాతో ఇంక్యుబేటర్‌ కార్యకలాపాలు

·         ప్రత్యక్ష దశ: వ్యాపార నమూనాలు, ఉత్పత్తుల రూపకల్పన, పిచింగ్, బ్రాండింగ్, నిధుల సమీకరణ, మీడియా నిబంధనల సంబంధిత పూర్తిస్థాయి మద్దతు. దీంతోపాటు ఓటీటీ, వీఎఫ్‌ఎక్స్‌, విఆర్‌, గేమింగ్, యానిమేషన్, పబ్లిషింగ్, పోస్ట్-ప్రొడక్షన్‌ అంశాల్లో శాండ్‌బాక్స్ టెస్టింగ్‌ అవకాశాలు.

·         పరోక్ష దశ: వేవ్స్ బజార్ ద్వారా గ్లోబల్ షోకేసింగ్‌, నిర్దిష్ట పద్ధతులలో మార్గదర్శకత్వం, పెట్టుబడిదారులు-పారిశ్రామిక సంఘాలతో చర్చలపై దృష్టి.
ఈ వేదిక ద్వారా లభించే వివిధ సౌకర్యాల్లో కో-వర్కింగ్ స్పేస్‌, ఏవీ/డిజిటల్ లేబొరేటరీలు, హోస్టింగ్ సర్వర్లు, హై-స్పీడ్ ల్యాన్‌/వై-ఫై, ఏడబ్ల్యూఎస్‌/గూగుల్‌ క్లౌడ్ క్రెడిట్లు వంటివి ఉంటాయి. భవిష్యత్తులో ‘ఇండియా ఏఐ కంప్యూట్’ సేవలు కూడా లభిస్తాయి. అలాగే వివిధ కార్యక్రమాల కింద గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధుల ద్వారా మాస్టర్‌క్లాస్‌లు, ఫోకస్డ్ బూట్‌క్యాంపులు, పాలసీ క్లినిక్స్‌, ఇన్వెస్టర్ కనెక్ట్ సెషన్లు నిర్వహిస్తారు.

ఈ వేదిక ద్వారా నిర్వహించే కార్యక్రమాలపై సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ మార్గదర్శకత్వాన ‘వేవ్‌ఎక్స్‌’ త్రైమాసిక సమీక్షలతోపాటు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి బ్యాచ్‌ కింద నెలకు రూ.8500 (+ జీఎస్‌టీ) రుసుముతో 15 అంకుర సంస్థలను ఐఐసీటీ ప్రాంగణంలో ఎంపిక చేస్తారు.

తొలి బ్యాచ్‌ ఎంపిక కోసం 2025 సెప్టెంబరు 7వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. ఆసక్తిగల అంకుర సంస్థలు ‘wavex.wavesbazaar.com’ ద్వారా లాగిన్ అయి, డాష్‌బోర్డుకు వెళ్లి, “రిజిస్టర్‌ ఫర్‌ ఇంక్యుబేషన్”ను ఎంచుకోవాలి. అటుపైన దరఖాస్తు ఫామ్ నింపి, అవసరమైన వివరాలను నమోదు చేయాలి. తమకు నచ్చిన ఇంక్యుబేటర్ ప్రదేశాన్ని ఎంచుకుని, దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

వేవ్‌ఎక్స్‌ గురించి...

సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలోని ‘వేవ్స్‌’ కింద ప్రత్యేక స్టార్టప్ యాక్సిలరేటర్ వేదికగా ‘వేవ్‌ఎక్స్‌’ ఏర్పాటైంది. మీడియా, వినోద, భాషా సాంకేతికత రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ముంబయిలో ‘వేవ్స్‌ సమ్మిట్-2025’ నిర్వహించిన సందర్భంగా పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలు, సాంకేతిక దిగ్గజ సంస్థల ప్రతినిధుల సమక్షంలో 30కిపైగా అంకుర సంస్థలు తమ ప్రతిభానైపుణ్యాలను ప్రత్యక్షంగా ప్రదర్శించాయి. అటుపైన కూడా హ్యాకథాన్‌ల నిర్వహణ, మెంటర్‌షిప్ కార్యక్రమాలు, జాతీయ వేదికల ఏకీకరణ ద్వారా భావితరం ఆవిష్కర్తలకు ‘వేవ్‌ఎక్స్‌’ సాధికారత కల్పిస్తూనే ఉంది.

ఐఐసీటీ గురించి...

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్-ముంబయి (ఐఐసీటీ)ని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సంవత్సరం జూలైలో ప్రారంభించారు.  భారత ‘ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్-ఎక్స్‌టెండెడ్ రియాలిటీ) రంగాన్ని పురోగమన పథంలో నడిపించే ప్రత్యేక లక్ష్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ‘ఫిక్కి, సీఐఐ’ వంటి పారిశ్రామిక సంఘాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనా కింద ఒక వేదికపైకి తెస్తూ సెక్షన్ 8 జాయింట్ వెంచర్ కంపెనీగా ఐఐసీటీ రూపొందింది. అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతుల సమూహాన్ని తీర్చిదిద్దడం, దేశీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతం సహా సంలీన- డిజిటల్ సారాంశ సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానాన నిలపడమే దీని ధ్యేయం. ఈ దిశగా గూగుల్, అడోబ్, మెటా వంటి ప్రపంచ దిగ్గజాల సహకారం, విద్యా-పారిశ్రామిక రంగాలతో బలమైన అనుసంధానం ద్వారా ‘గేమింగ్, పోస్ట్-ప్రొడక్షన్, యానిమేషన్, కామిక్స్, ఎక్స్‌ఆర్‌’ అంశాల్లో ఐఐసీటీ ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తోంది.

 

****


(Release ID: 2162550) Visitor Counter : 2